గలగల నవ్వుల గరం గరం చాయ్..

by Ravi |   (  Updated:2026-02-16 00:30:40  IST  )

Garam Garam Chai Book Review

గలగల నవ్వుల గరం గరం చాయ్..
X

సొంత ప్రాంతాన్ని స్వీయ భాషను పదుగురికి పరిచయం చేయాలనే తపనతో కలం కృషిని పునః ప్రారంభించిన సహృదయ సాహితీ మూర్తి, తిరుపతికి చెందిన ఆర్ .సి. కృష్ణస్వామి రాజు అనబడే రాచకొండ చంగల్రాజు కృష్ణస్వామి రాజు. ఏ ఇజానికి తలవంచకుండా ఆరోగ్య దాయకమైన సాహితీ సృజన చేస్తున్న నేటికాలపు ఉత్తమ రచయిత. నవరసాలకు నాడి వంటి హాస్యరసం పులుముకుని సభ్యసమాజంలోని అంశాలే కథా వస్తువులుగా మలచుకుని ఆధునిక పాఠకులు ఇష్టపడే నిడివి తక్కువ కథలు వ్రాసి తెలుగు కథా ప్రియులకు అక్షర విందును అందించారు,

తెలుగు కథా త్రివేణి సంగమం..

ప్రతి కథలో ఆరోగ్య దాయకమైన హాసం నిండి ఉండి చదివే పాఠకుల ముఖారవిందాలు మందస్మితాలై విప్పారుకుంటాయి. కథల్లో నవ్వులే ఉన్నాయనుకుంటే పొరపాటే..! పాఠకులను కట్టిపడేసి కడదాకా చదివించే సస్పెన్స్ అనబడే ఉత్కంఠత ఎక్కువ కథల సొంతం, కేవలం ముసి ముసి నవ్వులు చిరు సస్పెన్స్ మాత్రమే అనుకుంటే అపచారమే..!! చక్కని ముగింపుతో ఎంచక్కని సందేశం కలగలిపి అందించటం కృష్ణస్వామి రాజుకి కలంతో పెట్టిన విద్య. బాల - ప్రౌఢల సాహిత్యాల సవ్యసాచి గానే గాక ఆధ్యాత్మికత అంతర్వాహినిగా తెలుగు కథా త్రివేణి సంగమమై జాలు వారుతున్న వీరి కలం నుంచి వెలువడిన 50 పొట్టి కథల సంపుటి గరం గరం చాయ్

చైనాలో చదివిస్తే అసూయ..

సాధారణంగా మనుషుల్లో ఉండే అక్కసు, మరీ ఎక్కువైతే నేటి ఆధునిక సమాజంలో గల యాంత్రిక సంబంధాలను మరింత బలహీన పరుస్తుంది, అనే వేదనతో వ్రాసిన సరదా సరదా కథ చైనా చదువు బ్యాంకు ఉద్యోగి భువనచంద్ర తన భార్య భరణిలో ఎదురింటి గుమస్తా ఉద్యోగి వెంకటేశు తన కొడుకును చైనాలో చదివిస్తాడనే విషయం తెలియగానే పడ్డ మానసిక వేదన తీరును చక్కటి సస్పెన్స్ తో నడిపించిన రచయిత కథన శైలి అద్భుతం, చివరికి వెంకటేశు చెప్పిన సమాధానంతో ఆలుమగల అసూయ తగ్గిపోవడం కథకు మంచి ముగింపు, ఇంతకీ గుమస్తా వెంకటేశు తన కొడుకును చైనాలో ఏ కాలేజీలో చదివించాడు తెలియాలి అంటే ఆలస్యం చేయకుండా కథ ఆసాంతం చదవాల్సిందే..!

విదేశాల్లో పిల్లలున్న పేరెంట్స్ యాతన..

ఇదే దారిలో నడిచిన మరో సరదా కథ టింగ్ టింగ్ ట్రంగ్ అమెరికా బాసు పూటకో నిర్ణయంతో... బిడ్డలను విదేశం పంపిన తల్లిదండ్రులు క్షణక్షణం అనుభవిస్తున్న నరకయాతన కళ్ళకు కట్టిన ఈ కథ ముగింపులోని కొసమేరుపును పనిమనిషి పారిజాతం ద్వారా పలికించిన రచయిత చతురత ఔరా...! అనిపిస్తుంది. ధనవంతుల ఆలోచనను బట్టి డాక్టర్ల వైద్యాలు, మారుతున్న ప్రస్తుత సమాజ తీరును ఆవిష్కరించిన మరో నవ్వుల కథ ష్..గప్..చిప్. ఏ రంగంలో రాణించాలన్న అనుభవంతో పాటు సమయస్ఫూర్తి అవసరం అని ఈ కథలో చెప్తారు, జూనియర్ కంటి డాక్టర్ కిషోర్ కి సీనియర్ డాక్టర్ కు గల తేడా చెబుతూనే నేటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని ఆవిష్కరించారు కథకుడు.

ఆరోగ్యంతో ఆటలొద్దు..

పల్లెటూరి ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల ద్వారా కలుగుతున్న కష్టాలతో పాటు పొందుతున్న నష్టాలను తెలుపుతూ...వ్యాపారం చేసుకోండి, లక్షలు సంపాదించండి, కానీ మనుషుల ఆరోగ్యాలతో ఆడుకోకండి.. అంటూ తారుమారు కథలో రచయిత తెరిసారాణి పాత్రతో పలికిస్తారు. ప్రతి కథలో ఆయా విషయాలకు సంబంధించిన పారిభాషక పదాలు ఉపయోగించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సంబంధిత పదాలను ఉపయోగించే రచయిత ఈ కథలో తెరిసారాణి ఒకేసారి రెండు కళ్ళకు ఆపరేషన్ చేయించుకుంది అనడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.

రైతు కాగలడా రాజు..

రైతు తన వృత్తిని తన భూమిని ఎంత పవిత్రంగా భావిస్తాడో.. భావించాలో.. తెలిపిన చక్కని కథ భూమిభక్తి, అదే తీరు రైతు ఆలోచన, జీవిత వ్యధలు, ఆత్మాభిమానాలు, కళ్ళకు కట్టిన కథలు రైతే రాజు, రైతు కాగలడా రాజు, రైతు హృదయం, సరిహద్దులు లేని భావవ్యక్తీకరణ సాధనం, చెదరని చిరునవ్వులోని గొప్పతనం, తెలిపే కథ భావసేవిక చదివే కొద్ది చదవాలనిపిస్తుంది. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తున్న మాధ్యమాల తీరును ఎండగట్టిన కథ క్యాన్సర్.

మనిషి మారలేదు..

అన్ని విధాల మనిషి ఎంత ఎదిగినా విభజించుకుంటూ తనకు తాను దిగజార్చుకుంటున్న తీరును ఆవిష్కరించిన మనిషి మారలేదు కథ గుండెను తడిచేస్తాయి, కథలను చదువుతున్నంతసేపు మనలను మనం చదువుకుంటున్న అనుభూతి కలగటమే కాదు.. కరిగిపోతున్న మానవత్వం గురించి కావాల్సిన మాననీత గురించిన ఆలోచనలు మనల్ని వెంబడిస్తాయి. కథా వస్తువుల ఎంపిక కథలను నడిపించే శైలి రెండిటి కన్నా మిన్న మంచి ముగింపులు కృష్ణస్వామి గారి కథలకు అదనపు ఆభరణాలు, వీరి కథలన్నీ హాయిగా చదివించడమే కాదు ఆత్మ పరిశీలన చేయిస్తాయి.

పుస్తకం: గరం గరం చాయ్,

(50 కథల సంపుటి),

రచయిత: ఆర్.సి. కృష్ణస్వామి రాజు,

పేజీలు: 168,

వెల రూ.100/-

ప్రతులకు: 93936 62821


సమీక్షకులు

-డా. అమ్మిన శ్రీనివాసరాజు,

77298 83223

Next Story