మైలేజ్ సరే.. మిగతా అంశాల మాటేమిటి?

by Ravi |   (  Updated:2026-07-14 00:45:59  IST  )

ఈ-20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుదల, వినియోగదారులపై అదనపు భారం, ఇంజిన్‌పై ప్రభావం, పర్యావరణ ప్రయోజనాలపై కొనసాగుతున్న చర్చ, ప్రజల సందేహాలు, ప్రభుత్వ విధానం..

మైలేజ్ సరే.. మిగతా అంశాల మాటేమిటి?
X

ఈ-20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల్లో 3 నుంచి 5 శాతం వరకు మైలేజీ తగ్గే అవకాశం ఉందని ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. మరోవైపు ప్యూర్ పెట్రోల్ లేదా ఈ-10 ప్రజలకు అందుబాటులో ఉంచడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను అసలు పరిగణనలోకి తీసుకోకుండా.. ఈ-20 ను సర్కారు జనంపై రుద్దుతున్నది. అయితే ప్రజలు వ్యక్తం చేసే అనుమానాలకు సరైన రీతిలో జవాబు చెప్పకుండా.. కేవలం ప్రకటనలకే పరిమితం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.

సామాన్యుడిపై భారమే!

ప్యూర్ పెట్రోల్ కంటే ఈ-20 పెట్రోల్ తయారీ ఖర్చు చౌక కాదని కేంద్రం అంగీకరించింది. ఈ భారం కూడా వినియోగదారుడిపైనే పడుతోంది. పెట్రోల్ ధర రూ. 110 ఉన్నప్పుడు.. ఒక బైక్ లీటరుకు 50 కిలోమీటర్లు నడిస్తే.. అతనికి కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 2.20. అదే ఐదుకిలోమీటర్ల మైలేజ్ తగ్గితే ఆ ఖర్చు రూ.2.32కు చేరు కుంటుంది. ఇది ప్రస్తుతం చిన్నగానే కనిపించినా.. ఏడాది భారం రూ. రెండున్నర వేల వరకు పడుతుంది. వినియోగదారుడు తన అవసరం, తన వాహనం, తన బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇథనాల్ వినియోగంలో ప్రపంచానికి ఆదర్శంగా చెప్పుకునే దేశం బ్రెజిల్. అయితే అక్కడ దశాబ్దాలుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు తయారవుతున్నాయి. వినియోగ దారుడు అక్కడ తనకు నచ్చిన ఇంధనాన్ని తీసుకుంటాడు. కానీ లాజిస్టిక్స్ సమస్యల పేరుతో ఇక్కడ ఆ స్వేచ్ఛను వినియోగదారుడికి లేకుండా చేశారు. ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌తో పాటు ప్రీమియం, హై ఆక్టేన్ ఇంధనాలు కొన్ని బంకుల్లో విక్రయిస్తున్నారు. సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వంటి బహుళ ఇంధన వ్యవస్థలు కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి. అలాంటప్పుడు పరిమిత స్థాయిలో అయినా వినియోగదారులకు ఎంపిక ఇవ్వాలి.

ఇంజిన్‌పై ప్రభావమేమిటి?

నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఈ-20 పెట్రోల్‌ను ఉపయోగిస్తే ఇంజిన్ దెబ్బతినదని, వాహన జీవిత కాలం తగ్గదని కేంద్రం వాదన. అయితే ఆ పరిశోధనలకు సంబంధించి పూర్తి సాంకేతిక నివేదికలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘అరాయ్’ అధ్యయనంలోని వివరాల ప్రకారం ఈ-20 వల్ల కొన్ని రబ్బరు భాగాలు, హోస్‌లు, గ్యాస్కెట్లు, రింగులపై ప్రభావం పడిందని వార్తలు వచ్చాయి. ఇంజిన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చిందని కూడా చాలా మంది చెప్పారు. వాహనం మోడల్, తయారీ సంవత్సరం, ఉపయోగించిన పదార్థాలు, నిర్వహణ వంటి అంశాలపై ప్రభావం మారవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అన్ని పరిశోధనలను పూర్తిగా ప్రజల ముందుంచితేనే అనుమానాలు నివృత్తి అవుతాయి.

పర్యావరణానికి మేలు ఎలా?

చెరుకు ఆధారిత ఇథనాల్ వల్ల పెట్రోల్‌తో పోలిస్తే ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం చెబుతున్నది. అయితే పర్యావరణం అంటే కేవలం వాహనం నుంచి వచ్చే పొగ మాత్రమే కాదు. ఇథనాల్ తయారయ్యే దశ నుంచి మొదలుపెట్టాలి. చెరకు దేశంలో అత్యధిక నీరు అవసరమయ్యే పంటల్లో ఒకటి. ఈ పంటలు పండించే ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో భారీ స్థాయిలో నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం సరైన విధానమేనా ప్రశ్నించుకోవాలి. మరోవైపు ఇథనాల్ తయారీ పరిశ్రమల చుట్టూ దేశంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్యంపై స్థానిక ప్రజలు నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి డిస్టిలరీ ఉద్గారాలు, నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య తనిఖీ నివేదికలను ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం మంచిది.

-మహమ్మద్ ఆరిఫ్,

96184 00190

Next Story