సకల వర్ణ శోభితం దిగులు వర్ణం

by Ravi |   (  Updated:2026-05-04 00:31:01  IST  )

సభ్య సమాజం ఎదుగుతున్న కొద్దీ ఏర్పాటు వాదాలు పెంచుకుంటూ.. కులమతాల అడ్డుగోడలు ఏర్పాటు చేసుకొని, "అన్నిటికన్నా మాదే మిన్న " అనే బ్రాంతితో బతికేస్తున్న ఆధునిక సమాజం పులుముకున్న రంగుల మకిలి పోవాలనే..

సకల వర్ణ శోభితం దిగులు వర్ణం
X

సభ్య సమాజం ఎదుగుతున్న కొద్దీ ఏర్పాటు వాదాలు పెంచుకుంటూ.. కులమతాల అడ్డుగోడలు ఏర్పాటు చేసుకొని, "అన్నిటికన్నా మాదే మిన్న " అనే బ్రాంతితో బతికేస్తున్న ఆధునిక సమాజం పులుముకున్న రంగుల మకిలి పోవాలనే.. ఆరాటంతో దిగులు పడుతూ, శాంతికి చిహ్నమైన, అన్ని వర్ణాలకు ఆధారమైన, శ్వేత వర్ణం ఎదగాలనే... ఆశ ఆశయంతో రాసిందే..! దిగులు వర్ణం కవితా సంపుటి.

కవయిత్రి రోహిణి వంజారికి సంఖ్యాపరంగా తొలి కవిత సంపుటే..!! కానీ భావవ్యక్తీకరణ రీత్యా ..మోస్ట్ సిన్సియర్ సీనియారిటీ కనిపిస్తుంది, తన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటలను చూస్తూ.. చర్చిస్తూ ఆవేదన పడిపోవడం సాధారణ మనిషి నైజం, కానీ జరుగుతున్న సంఘటనలను భిన్న కోణాల్లో గమనించి ఆవేదనతో సరిపెట్టుకోకుండా ధర్మాగ్రహం కురిపించి వదిలేయకుండా..! అందమైన అక్షరాల పలుకులతో పరవశింపజేస్తుంది రోహిణి కవిత్వం, అందరిలా మాటల తూటాలు పేల్చకుండా మౌలాన్ని సైతం ఆటంబాంబుగా ప్రయోగించడం.. ఈ నెల్లూరి కవయిత్రి నైపుణ్యం అనిపిస్తుంది.

వాక్యాలు సైతం పాత్రలుగా సాక్షాత్కరించి..

ఈ "దిగులు వర్ణం" కవన సీమలో అనుభూతుల పర్యటన చేస్తున్నప్పుడు.. కథన పద్ధతిలో సాగే ఈమె కవిత్వంలో వాక్యాలు సైతం పాత్రలుగా సాక్షాత్కరించి మనతో సంభాషిస్తాయి, మొత్తానికి ఇది కాలక్షేప కవిత్వం కాదు బాధ్యతాయుతంగా వ్రాసిన కండగల కవిత్వం అని ప్రతి కవిత నిరూపించుకుంది, రోహిణిది ఎంతైనా భిన్న పాత్రల బహు పాత్రాభినయమే..! అది అమ్మ తనకు స్త్రీమూర్తీభవం సాక్షిగా.. శక్తి రూపిణిగా... అప్పుడప్పుడు ఉగ్రరూపం చూపిస్తుంది,

మృగాళ్ల మూర్ఖపు చూపులకు ఆపరేషన్..

నీ మెదడులోని దుర్మార్గపు సినాప్సిస్ ని/ ఏ రాతి బండకేసి బద్దలు కొట్టుకుంటావో/ నీ విజ్ఞతకే వదులుతున్నాం/ గుండెల పై చున్నీ చెప్పుకోవాల్సింది మేము కాదు/నీ మనో నేత్రాన్ని కప్పియున్న కామపు శుక్లాలను/ తొలగించుకోవాల్సింది నువ్వే ఇక/... అంటూ మగమహారాజుల్లో కలిసి ఉన్న కొందరు మృగాళ్ళ మూర్ఖపు చూపులకు కంటి ఆపరేషన్ చేస్తుంది తనదైన కవన శస్త్రాల సాయంగా ముందు మనుషులుగా పుట్టి మధ్యలో మనం సృష్టించుకున్న బాహ్య అలంకరణల సాయంగా వేరు వేరు పేర్లు పెట్టుకుని మేము మాత్రమే ఉత్తమం అనే స్వార్ధపు ఆలోచనలతో చేసుకుంటున్న ఈ యాగి గురించి దిగులు పడుతూ... ఆదిమానవుడి కాలంలో లేని ఈ భేదాలు ఆధునిక మానవునికి ఎందుకు? అంటూ అందరం ఒకటే అనే ఇంగితం కలిగే వరకు, కాలచక్రాన్ని వెనక్కి తిప్పుతూనే ఉందాం.. అంటుంది రోహిణి "ప్రవర" కవితలో.

అనుభవైక్య కవనం రచయిత్రి సొంతం!

ఈ కవితలు అన్ని ముక్తకాలుగా.. వేటికవే విడిబడి నిగారించిన, ఆ అన్నిటికి మానవత్వపు పరిమళాలు అద్దడంలో కవయిత్రి శత శాతం ఉత్తీర్ణత సాధించింది, కారణం ఇది అనుభూతి పొంది రాసిన ఊహాత్మక కవనం కాదు, అనుభవించి ఆవహించుకుని మనసు సలపరంతో రాసిన అనుభవైక్య కవనం ఇది, రైతు బిడ్డగా, కళాకారుడి పడతిగా, బిడ్డల పాలిట పంతులమ్మగా, రూపాంతరం చెందిన రోహిణి మనసే ఒక కవితల పూలకుండి, మానవత్వపు సుమాలు నిండి ఉన్న పూలసజ్జ, ఈమె కవితా కలం తాకని వస్తువు లేదు, సమస్త వస్తుయం రోహిణి కవన దర్శనం అనిపిస్తుంది,

శాంతి వర్ణం దవళ కాంతితో

కవితా లక్ష్యం ఏదైనా! కవనపు గురి మరేదైనా..! వాటి అన్నిటి గమ్యం శాంతి నిండిన సమాజం వైపు, మానవత్వం జీర్ణించుకున్న మానవ సమూహం కోసమే..!! సమయాన్ని మించిన సొగసు గురించి "అందం" కవితలోను, అందరం పవిత్రంగా భావించే ఫలహారాలు రుచి మాత్రం ఒకటే అయినప్పుడు వేరు వేరు పవిత్రతలు దేనికంటూ ప్రశ్నిస్తూ... అన్నిటిలోనూ ఒకటే/ తీయదనం../ అదే మన అందరిని కలిపే /మానవత్వం/ అనురాగపు వెల్లువలో/ అందరం తడిసి/ మురిసే వేళ మనకెందుకీ కులమతాలకు గోల.../ అంటూ ప్రశ్నిస్తుంది రోహిణి సమైక్య కలం. సభ్య సమాజంలో ఈ రంగుల కుంచిత భావాల ముసుగు తొలగిపోయి శాంతి వర్ణం దవళ కాంతితో మన సభ్య సమాజం మిరుమిట్లు గొలపాలని ఆశిస్తూ.. కవితా విన్యాసం చేసిన రోహిణి ఆశయం సిద్ధించాలని ఆశిద్దాం..! దిగులు వర్ణానికి పరమార్థం కలగాలని భావిద్దాం.

పుస్తకం: దిగులు వర్ణం (కవిత్వం)

పేజీలు: 120,

ధర: ₹200/-

ప్రతులకు: 90005 94630


సమీక్షకులు

-డా. అమ్మిన శ్రీనివాసరాజు,

77298 83223

Next Story