కళాకారులు.. మానవ హృదయ నిర్మాతలు..

by Ravi |   (  Updated:2026-02-22 23:46:16  IST  )

Chivarakhari Jawabu Book Review

కళాకారులు.. మానవ హృదయ నిర్మాతలు..
X

ఈ పుస్తకానికి ప్రతీకాత్మకమైన శీర్షిక పేరు పెట్టడంలోనే కొత్తదనం కనబడుతుంది. మంచికవర్ పేజీ కాగితంతో, చక్కని కూర్పుతో అక్షర దోషాలు లేకుండా ఎంతో జాగ్రత్త తీసుకుని ఆకర్షణీయమైన చిన్న సైజు కవితా సంపుటిగా ఎన్నెల పిట్ట వారు ముద్రించారు.

విప్లవ కవిత్వంలో స్థానాన్ని ఏర్పరుచుకొని..

ముందుమాట రాసిన విప్లవ కవి వరవరరావు గారి కొన్ని వాక్యాలను క్లుప్తంగా పేర్కొంటాను. ఈ కవిత్వానికి సమకాలీన ఆధునికత గుణాత్మకత ఎక్కడ వచ్చిందంటే 'నిరంతర ఆశల సౌధాలతో నడుస్తున్న సంఘర్షణల యుద్ధభూమి ఇది. సంకేతాల రాజ్యమిది. రహస్య సందేశాల స్థావరం'. పుస్తక రచయిత వసంత నెల్లుట్ల 50 సంవత్సరాల సబ్‌కాన్షియస్ నోస్టాల్జియా జ్ఞాపకాల సంఘర్షణతో సమన్వితమైన ఈ 'చివరాఖరి జవాబు'తో తన మొదటి కవితా సంపుటి ద్వారా ఆధునిక విప్లవ కవిత్వంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

కవిత్వం హృదయ సమ్మిళితం!

కవిత్వ శీర్షిక ఆశయాన్ని వెల్లడిస్తుంది. కవిత్వమంతా కూడా హృదయ సమ్మిళితం. కవిత్వం ఎంతో భావ అనుభూతి కలిగిస్తూ ఆవేదన, ఆనందం, ఆలోచన, ఆవేశంతో ఉత్తేజితమవుతాము. తన కవిత్వంలోని సృజనాత్మకత, భావ పటిమతో రూపాంతరం చెంది వారి నిగూఢ అంతరంగాన్ని ఇందులోని కవితలు ఆవిష్కరించాయి. కార్పొరేట్ శక్తులకు, రాజకీయ - ఆర్థిక సామాజిక సాంస్కృతిక దోపిడీ వ్యవస్థలకి సవాలు చేయబడ్డాయి..

సరళ పదబంధాలు..

పద ప్రయోగ చాతుర్యం, కవితా సంపుటిలోని ప్రత్యేకత. శిల్పం విషయానికి వస్తే, తనదైన సరళ శైలి మార్గంలో భాష పద బంధాలలో కనిపించే ప్రత్యేకత, భాష వివిధ భావ రూపాలతో చైతన్య పరుస్తూ స్ఫూర్తినిస్తాయి. కవిత్వం అర్థం చేసుకోవాలన్నా పూర్తిగా ఆనందించాలన్నా ప్రతీకలు తెలిసి వుండాలి. కవయిత్రి భావనలో ప్రకృతి ఎంత చైతన్యవంతంగా రూపుదిద్దుకుంటుందో 'నూతన స్వప్నాలు' అన్న కవితలో పువ్వులు దుఃఖించవు అవి వాటి పరిసరాలను దుఃఖాల నుండి మేల్కొలుపుతాయి అవి రాలిపోతూ కూడా రాగాలాపన చేస్తూ విశ్వ వ్యాప్తి చెందుతవి.

జనాన్ని తట్టి లేపే చైతన్యం!

ఈ కవిత్వం అంతా కూడా ప్రపంచాన్ని తాత్వికంగా అన్వేషిస్తుంది. ఈ అన్వేషణ అనేక రకాల వివరణలతో ప్రశ్నలతో వస్తుంది. ఇది ఒక రకంగా మేధో మేలుకొలుపు. విశ్వాసాలతో పాటు శక్తివంతమైన అంతర్లీన సందేశాన్ని అందిస్తున్న కవిత్వం. అందుకే నేమో స్టాలిన్ అంటారు ''కళాకారులు మానవ హృదయ నిర్మాతలు,కళ జానపద రీతులలో, సౌమ్యవాద భావాలతో విలసిల్లాలి''. నిజమే! జనాన్ని తట్టి లేపే చైతన్యం కవిత్వంలో అంతర్లీనంగా వ్యక్తం అవుతుంది.

మానవత్వంపై ప్రేమే కవిత్వం..

కామ్రేడ్ సాయిబాబా స్మృతిలో రాసిన మహోన్నతం కవితలో నీ కుర్చీని కాపాడుకోవడం మాత్రమే తెలిసిన నీకు మహోన్నత మానవ మేధావి చక్రాల కుర్చీ విలువేం తెలుసు అని ఈ ఫాసిస్ట్ పాలకులకు తన మౌనాన్ని ఛేదించుకొని ఒక మనిషిగా చేసిన హెచ్చరిక. 'బిగి పిడికిటి సందేశం' అనే కవితలో నిట్టూర్పులకు కన్నీళ్లకూ ఇది సమయం కాదు. అల్లంత దూరంలో ఆఖరి శ్వాస కూడా విడిచిన అమరుల పిడికిళ్లింకా బిగించే ఉన్నాయి నీ కోసం మనకోసం పదిల పరిచిన ఆ సందేశం అంటూ కవియిత్రి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింప చేస్తాయి.

దారి దీపాలు వెలిగించు..

వీరి సునిశిత దృష్టికి సాక్షులుగా అమరులైన విప్లవకారులు, యుద్ధాన్ని కొనసాగిస్తున్న విప్లవకారులు, నేటి సమాజానికి ప్రతినిధులుగా ఒకరి తర్వాత ఒకరు ప్రత్యక్ష మవుతారు. కవర్ పేజీలోని చివరి కవితా చరణాలు చదువుతున్నప్పుడు శివసాగర్ చారు బాబుపై రాసిన కవిత గుర్తుకు వస్తోంది. ఆ కవిత ప్రభావం కింద పేర్కొన్న కవితపై గాఢంగా కనిపిస్తోంది. నీ బిడ్డ వంటి అనేకమంది బిడ్డలు కోసం దారి దీపాలు వెలిగించు నీ గుండె గూడులో ఎప్పటి వలనే నన్ను కాపాడుకో వీరుడు గానే లేచి వస్తాను''

అవును ఈ ప్రపంచం ప్రజలది - ప్రజల విముక్తి పోరాటాలు తప్పక జయించి తీరుతాయి అన్న ఆశావహ దృక్పథం ఈ కవిత్వం నిండా కనిపిస్తుంది. ముగించే ముందు చలం మ్యూజింగ్స్‌లో కమ్యూనిస్టుల పట్ల అన్న మాటలు గుర్తు చేసుకుంటూ.... ''నా మనసు కమ్యూనిస్టుల కాళ్ల మీద పడుతోంది. నమ్మిన ఆశయాల కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజిస్తున్నారు.'' 75 సంవత్సరాల కిందట ఆయన అన్న మాటలు నిత్యనూతనమై నేటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.


పుస్తకం: చివరాఖరి జవాబు

కవయిత్రి: వసంత నెల్లుట్ల

పేజీలు 96, వెల రూ.125/

ప్రచురణ: ఎన్నెల పిట్ట

పత్రులకు: ప్రముఖ పుస్తక షాపులనుండి


సమీక్షకులు

ఎం.ఏ. సత్యనారాయణ రావు

94940 52775

Next Story