అత్తరు మునక... ఊపిరాడని బురఖా!

by Ravi |   (  Updated:2026-04-27 01:14:31  IST  )

Attharu Munaka Soaked in Perfume Book Review

అత్తరు మునక... ఊపిరాడని బురఖా!
X

చీకటి జైలు గది లాంటి బురఖాలో ఊపిరాడని ఉజ్మా. అత్తరు స్నేహ పరిమళాన్ని పంచిన సాహిల్ దర్జీ దుకాణం విధ్వంసం. అమెరికాలోనూ సెంటిమెంట్ల వెనుకబాటుతనం. కరోనాని మించిన కుల పిచ్చి, మత పిచ్చి. ఖబరస్థాన్‌గా మారుతున్న అందమైన కశ్మీర్. గో సంరక్షణ పేరుతో ఘోరమైన దాడులు. ఇలాంటి ముస్లింల జీవిత అస్తిత్వ పోరాట కథల సమాహారం గీతాంజలి ‘అత్తరు మునక’ పహెచాన్-2 కథల సంపుటి.

చనిపోయిన ఆవు చర్మం ఒలుస్తుంటే, ఆవును చంపారని గో సంరక్షకుల దాడి. గుళ్ళలోకి రానివ్వరు. మా చిన్నప్పుడు రాముడు మంచి బాలుడు. ఇప్పుడు సిక్స్ పాక్ బాడీతో, ఉగ్రరూపంతో రగిలిపోతూ కనిపిస్తాడు.. గ్రామాల్లో ఒకప్పుడు కుల రాజకీయాలే. ఇప్పుడు మత రాజకీయాలు తోడైన వైనాన్ని దృశ్యమానం చేసిన కథ ‘పిలగా.. పక్కకు జరుగు’.

ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాం !

అపార్ట్ మెంట్ నిర్మాణానికి ముస్లిం కూలీలు చెమటోడ్చే పనిచేసినా, వారికి మాత్రం ఫ్లాట్ అమ్మమని ఏజెంట్ అంటాడు. దానికి నిరసనగా భార్యాభర్తలు సుధ, ఇంద్ర కొనకుండా వెనుదిరుగుతారు. అమెరికాలో ఉంటున్న వారి ఇద్దరు కూతుళ్లు తుషార్, శిశిర అక్కడి పరిస్థితులను తల్లికి ఫోన్ చేసి , ‘గత ఏడేళ్లుగా పిల్లలకు ‘జైశ్రీరాం’ అని రాసిన కాషాయరంగు రిబ్బన్లు కడుతున్నారు. గాయత్రీ మంత్రాలు, హనుమాన్ చాలీసాలు, రాముని స్తోత్రాలు చదివిస్తున్నారు. ఇండియా జెండాల పక్కన కాషాయ జెండాలు ఎగరేశారు. ‘వుయ్ ఆర్ హిందూస్’ అని చెప్పుకునే దాకా వెళ్లారు. ‘సీ బ్యాచ్’ అంటే చిరంజీవి ఫ్యాన్ బ్యాచ్ అని, ‘చౌ బ్యాచ్’ అంటే చౌదరి (బాల కృష్ణ) బ్యాచ్ అని ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు కులపిచ్చితో. అరెరే ! మనం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లిపోయాం !’ అంటూ బాధపడిపోతారు అక్కా చెల్లెళ్లు ‘రియల్ ఎ(స్టేట్)’లో.

కరోనాకంటే భయంకరం..

కరోనా విషాద కాలంలో, దాని కంటే భయంకరమైన కులం, మతం వివక్షతో కూడిన మానవ సంబంధాలు. వంటమనిషిగా ఉన్న మరియంను మానిపించేస్తేనే వస్తానని అత్త మొండికేస్తుంది. బతకలేక, చేసిన దొంగతనం బైటపడితే మరియం భర్త జేమ్స్ ఉరివేసుకుని మరణిస్తాడు. కరోనాలో గర్భిణీకి చికిత్స నిరాకరించడంతో తల్లీ బిడ్డ మరణించడం, రాకేష్‌కు ఉద్యోగం ఊడడం వంటి విషాదాలు. కరోనాకు కుల పిచ్చి లేదు. ఎవరినైనా ఎలా కాటేస్తుందో ‘దూరం...దూరం...’ కథలో కనిపిస్తుంది.

ఖబరస్థాన్‌గా కశ్మీర్ !

‘కరెంటు, ఫోన్లు, ఇంటర్ నెట్ అన్నీ బంద్. అబ్బా ఎన్ కౌంటర్ అయినప్పటి నుంచి అమ్మ ఎంత కష్టపడి పెంచిందో! తమ్ముడు(సమర్) గాయబ్ అయ్యి నెలరోజులైంది. మిలటరీ వాళ్లు కాలిస్తే, నాలుగేళ్ల చిన్నారి సహా కుటుంబం అంతా గాయపడింది. మగవాళ్లను బయటకు పంపితే కాల్చి పడేస్తున్నారు. ఎత్తుకు పోతున్నారు. ఆడవాళ్లను సతాయిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ కర్ఫ్యూనే. తమ అన్నదమ్ములను, అబ్బాలను చంపిన మిలటరీపైన పిల్లలు రాళ్లు రువ్వుతున్నారు. ఆజాదీ కోసం చనిపోయిన అబ్బాకల నిజమైతే చూద్దాం అనుకున్నాం. కానీ ఆ కల ఛిద్రమైంది. ప్రతిరోజూ మృత్యువు వస్తూ పోతూ ఉంది. ఎప్పట్నుంచో కశ్మీర్ ఖబరస్థాన్(శ్మశానం) అయిపోయింది. అడుగుకో లాష్ దాచుకున్న సమాధిభూమి.’ అంటూ కశ్మీర్‌లో ఉన్న ఒక యువతి, తన అక్కకు రాసిన ఉత్తరం ‘రాళ్లు రువ్వే పిల్లాడు..!’ కథలో నేటి కశ్మీరీల స్థితి గతులు అర్థమవుతాయి.

ఇది మునుపటి భారత్ కాదు..

‘ఒద్దు రా, కుర్తా పైజామాలో నువ్వు ముస్లింవని తెలిసిపోతుంది. వాళ్లేమైనా చేస్తారు’ అంటుంది అమ్మీ. అబ్బాజాన్‌ని కూడా కుర్తాపైజామాతో బయటకు పోనివ్వదు. ఆడవాళ్లనైతే బుర్ఖా వేసుకోనివ్వదు. బీఫ్ వ్యాపారం చేస్తున్నాడని, ఆవుల్ని చంపుతున్నాడని వాళ్ల చిన్నతమ్ముడు రఫిక్‌ను కొట్టి చంపినప్పటి నుంచి ఆ తల్లికి భయం మొదలైంది. తమ్ముళ్లిద్దరికీ గడ్డాలు తీయించేసింది. తలపై టకియా కూడా వేసుకోవద్దంటుంది. ‘మనం ముసల్మాన్లమన్న విషయం మర్చిపోండి. ఇది పాత భారతదేశం అనుకున్నావా?’ అంటుంది. రోడ్డు పక్క నమాజ్ చేస్తున్నవారిని కాళ్లతో తన్ని వెళ్లకొట్టారు. అయోధ్య తీర్పు వచ్చినప్పటి నుంచి ఆమె భయంతో వణికిపోతోంది. అనుక్షణం ముస్లింల అస్తిత్వ పోరాటమే ‘కలల రాజ్యం’ కథ.

ఇక్బాల్ గీతం పాడించినందుకు సస్పెన్షన్!

‘సారే జహాసె అచ్చా’ రాసిన ఇక్బాల్ మరో ఐక్యతా గీతం ‘లబ్ పే ఆతీ హై దువా బన్ కే తమన్నా మేరే’ను ప్రొర్థనలో పాడడానికి అంగీకరించిన హెడ్మాస్టర్ హఫీజ్ ఆలీని సస్పెండ్ చేస్తారు. హఫీజ్ ఆలీపైన ఫిర్యాదు చేసిన విహెచ్‌పి నాయకుడు మహేందర్, ఆవుల్ని చంపుతున్నారని ముస్లింలు, ఎస్సీల నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటాడు. మంచి టీచర్‌గా పేరున్న హఫీజ్‌ను సస్పెండ్ చేయడాన్ని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఆందోళనకు దిగడం ‘లబ్ పే ఆతీ హై దువా...’ కథ.

చీకటి జైలుగదిలా బురఖా..

‘బురఖా వేసుకోకపోతే కాలేజీకి మానేయ్’ అంటుంది దాదీమా. ‘బురఖాలో ఉక్కపోత. చెమటలు కారుతున్నాయి. దురదలతో పిచ్చెక్కుతోంది. బురఖాలో ఉంటే చీకటి జైలు గదిలో ఉంటూ, చిన్న కిటికీ లోంచి లోకాన్ని చూస్తున్నట్టుంది అబ్బా..’ అంటూ ఉజ్మా ఏడ్చేస్తుంది. కాలేజీ నుంచి వస్తూ పోతుంటే ‘అరేయ్ సైతాను వస్తుంది చూడరా, నల్ల దయ్యం’ అని ఒకడు, ‘ముసుగు తీసెయ్ ప్రియురాలా’ అంటూ మరొకడు. ‘బురఖా వేసుకోమని ఒత్తిడి చేసే అబ్బాకు, అసలు దీన్ని కనిపెట్టిన వాడికి ఈ బురఖా వేయాలి’ అనుకుంటుంది ఉజ్మా. సంప్రదాయానికి, పోకిరీల వేధింపులకు మధ్య నలిగిపోతున్న ముస్లిం యువతుల దీనగాథలకు సజీవ రూపం ‘ఉజ్మా’ కథ. కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన ఆవు తోలు ఒలుస్తున్న మధుకర్‌పై గోసంరక్షకుల దాడి. గోసంరక్షణ పేరుతో ముస్లింలపై చేసే దాడులు, హింసల నేపథ్యంలో కౌలసల్యావు, సీతావు, శబరి ఆవుల మధ్య సంభాషణల మ్యాజిక్ రియలిజం కథ ‘కౌ, కోబ్లర్, హంజా’

‘హమ్ హై భారత్ దేశ్ కి వాసీ’

టైలర్ సాహిల్ ముత్తాత స్వాతంత్ర సమరయోధుడు. కాబా నుంచి ‘అత్తర్ అల్ కాబా’ ను తెప్పిస్తానంటాడు లక్ష్మితో. ‘మా దగ్గరకు వచ్చిన వారికి మా నుంచి వచ్చే పరిమళం సుకూన్ ఇస్తుంది. అత్తరు పెట్టుకోవడం మమ్మల్ని మేం గౌరవించుకోవడం, ఇతరులకు ఇవ్వడం కూడా అంతే’ అంటాడు సాహిల్. పహెల్గాం సంఘటనతో సింధూరోద్యమం జోరుగా సాగుతోంది. ‘హమ్ హై భారత్ దేశ్ కి వాసీ, భారత్ అప్నా జహాన్ హై’ అని గర్వంగా చెప్పిన సాహిల్ దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు. హిందుత్వ వాదుల ఉన్మాదాన్ని, ముస్లింల నిస్సహాయతకు అద్దం పట్టే ‘అత్తరు మునక’ కథ ఈ పుస్తకానికి పేరుగా పెట్టారు.

ముస్లింల జీవన సంఘర్షణను, వారి అస్తిత్వ పోరాటాన్ని, వారి మనోవేదనలను గీతాంజలి సజీవంగా ఆవిష్కరించిన కథలివి.

పుస్తకం పేరు : అత్తరు మునక

రచయిత్రి : గీతాంజలి (8897791964)

పేజీలు: 213

వెల: 250

ప్రచురణ: అజుపబ్లికేషన్స్

ప్రతులకు: అమెజాన్ లో, అన్ని ముఖ్య బుక్ షాపుల్లో


సమీక్షకులు

- రాఘవ

94932 26180

Next Story