- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవిత సత్యాల తాత్విక అన్వేషణ..
Ashokavanamlo Tellapulu Book Review

సమాజంలో మనకు కనిపించే సాధారణ దృశ్యాల వెనుక అసాధారణమైన సత్యాలు దాగి ఉంటాయి. జర్నలిస్ట్ రాజేందర్ దామెర (దారా) రాసిన 'అశోకవనంలో తెల్లపూలు' అటువంటి నిగూఢ సత్యాలను ఆవిష్కరించే వ్యాసాల సమాహారం.
2020-21 మధ్య కాలంలో ఆయన రాసిన 'బ్లాక్ ఇంక్' శీర్షికతో ప్రచురితమైన పది వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. రచయిత తన అనుభవాలు, సంఘర్షణలు మరియు లోతైన ఆలోచనలను పాఠకులతో పంచుకుంటూ, సమాజపు ద్వంద్వ ప్రవృత్తిని నిర్మొహమాటంగా ప్రశ్నించారు.
మనిషి జీవితం మరణంతోనే పరిపూర్ణ మంటూ..
ఈ పుస్తకంలోని మొదటి వ్యాసం "మరణించటం నేర్చుకోవాలి" మనిషికి చావు పట్ల ఉన్న భయాన్ని పటాపంచలు చేస్తుంది. సాధారణంగా చావును ఒక విషాదంగా చూసే సమాజంలో, మరణాన్ని జీవిత పరిపూర్ణతగా చూడాలని రచయిత సూచించారు. ఒక ప్రయాణం గమ్యాన్ని చేరుకున్నప్పుడే ఎలా పూర్తవుతుందో, మనిషి జీవితం కూడా మరణంతోనే పరిపూర్ణమవుతుందని ఆయన విశ్లేషించారు. "మళ్లీ మళ్లీ మరణించాల్సిన అవసరం లేని విధంగా చనిపోవటం నేర్చుకున్నాడు కబీరు" అన్న కలేకూరి ప్రసాద్ మాటలను ఉటంకిస్తూ, చావు పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాడే బతికున్న కాలాన్ని ఆస్వాదించగలడని నిరూపించారు.
వర్తమానంలో జీవించడమే నిజమైన స్వేచ్ఛ
"స్లో పాయిజన్" అనే వ్యాసం మనిషిని బానిసగా మార్చే మానసిక సంకెళ్లను చర్చిస్తుంది. మరణ భయమే అన్ని భయాలకు మూలమని, ఆ భయం వల్ల మనిషి జీవితాన్ని అనుభవించలేకపోతున్నాడని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. "సింహంలా స్వేచ్ఛ గర్జన చేయాలంటే, ఇతరుల అభిప్రాయాల పట్ల భయాన్ని వీడాలి" అన్న ఓషో తత్వాన్ని రచయిత ఇందులో లోతుగా విశ్లేషించారు. సమాజం విధించిన కృత్రిమ కట్టుబాట్లను ధిక్కరించి, వర్తమానంలో జీవించడమే నిజమైన స్వేచ్ఛ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచం మనకెలా కనిపిస్తుంది?
పుస్తక శీర్షికకు ప్రాణం పోసిన వ్యాసంలో, సత్యం అనేది వ్యక్తిగత దృష్టి కోణంపై ఆధారపడి ఉంటుందని రచయిత వివరించారు. అశోకవనంలో సీతమ్మను చూసేందుకు వెళ్లిన హనుమంతుడికి అక్కడి పూలు ఆగ్రహం వల్ల ఎర్రగా కనిపిస్తే, ప్రశాంతంగా కథా కాలక్షేపం చేసే హరిదాసుకి అవి తెల్లగా కనిపిస్తాయి. అంటే, ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుంది అనేది మన అంతర్గత స్థితిపైనే ఆధారపడి ఉంటుందని, మనం చూసే దృక్కోణమే మన వాస్తవికతను నిర్మిస్తుందని ఈ వ్యాసం ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.
మనలోకి మనం తొంగి చూస్తే...
'అశోకవనంలో తెల్లపూలు' కేవలం ఒక వ్యాస సంపుటి మాత్రమే కాదు, ఇది పాఠకుడిని తనలోకి తాను తొంగి చూసుకునేలా చేసే ఒక అద్దం. రచయిత తన సూటితనంతో, లోతైన విశ్లేషణతో జీవితం, స్వేచ్ఛ, మరణం, మానవ సంబంధాల పట్ల ఒక కొత్త అవగాహనను కల్పించారు. సత్యం కోసం వెతికే ప్రతి పాఠకుడు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలైనప్పటికీ, సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఇవి ప్రతిబింబిస్తాయి.
పుస్తకం: అశోకవనంలో తెల్లపూలు'
రచయిత: రాజేందర్ దామెర
వెల : 50/-
ప్రచురణ : పెన్‌డ్రైవ్ ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో...
పరిచయ కర్త
-కోగిల చంద్రమౌళి
9573187218






