చరిత్ర మిగిల్చిన కన్నీటి గాథ.. అగమ్య గమ్యాలు

by Ravi |   (  Updated:2026-03-09 01:16:03  IST  )

నిరంతర పరిశోధకుడు, సుప్రసిద్ధ అనువాదకుడు, కవి, రచయిత అయిన ముకుంద రామారావు రచించగా, ప్రముఖ విమర్శకుడు ఏ.కే. ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువరించిన మానవీయ పరిశోధనా గ్రంథం ఇది.

చరిత్ర మిగిల్చిన కన్నీటి గాథ.. అగమ్య గమ్యాలు
X

నిరంతర పరిశోధకుడు, సుప్రసిద్ధ అనువాదకుడు, కవి, రచయిత అయిన ముకుంద రామారావు రచించగా, ప్రముఖ విమర్శకుడు ఏ.కే. ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువరించిన మానవీయ పరిశోధనా గ్రంథం ఇది. ఈ పుస్తకం చదువుతూంటే గుండెను పిండే ఆవేదన మనల్ని ఆవహిస్తుంది. మనకు ఇంతవరకూ తెలిసిన కొలబద్దలూ, గీటురాళ్లూ, ప్రమాణాలూ తుడిచిపెట్టుకు పోతాయి.

సమాచారం నిరంతర తరంగాలుగా తాకి, మన నేల క్రింది భూమిని తొలుస్తుంది. ఈ సమీక్షకుడికి పదేపదే గుర్తుకువచ్చిన కవిత - శ్రీ శ్రీ ‘దేశచరిత్రలు’. ముఖ్యంగా - ఈ రెండు పంక్తులు: గతమంతా తడిసె రక్తమున, కాకుంటె కన్నీళులతో… పరిశోధనా గ్రంథం చదువుతూ, తటస్థంగా, పొడిపొడిగా ఉండే అకాడమిక్ ప్రపంచానికి పరిమితం కాకుండా పునాదులు కదిలిపోవడం, ఉద్విగ్నతకు లోను కావడం, తడిగా తాకే కవిత్వాన్ని ప్రస్తావించడం - ఇదంతా ఏమిటనే సందేహం పాఠకులకు కలగవచ్చు. ఆ సందేహానికి సమాధానం ఈ సమీక్ష.

బానిసల స్థానంలో ఒప్పంద శ్రామికులు..

1834లో బానిస వ్యవస్థ రద్దయ్యాక కూడా వ్యవసాయ రంగంలో పనిచేయగల శ్రామికుల అవసరం కొనసాగింది. నిజానికది పెరిగిపోయింది. అప్పటికే వలసలు ప్రపంచమంతటా విస్తరించి, సామ్రాజ్యవాద దేశాల పాలనలో సుస్థిరంగా ఉన్నాయి. శీతల దేశాలకు చెందిన యజమానులు విస్తారమైన ఉష్ణ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. పంచదార, టీ, కాఫీ, పత్తి, రబ్బరు వంటి ఉష్ణ ప్రాంతాలు ఉత్పత్తులు 'నాగరిక’ దేశాల్లో మంచి ధరలు పలుకుతున్నాయి. అప్పనంగా లభించిన లక్షలాది ఎకరాల భూమి విదేశీ పాలకుల ఆధీనంలో ఉంది. మరోవైపు వ్యవసాయక ఉత్పత్తులకు విశేషమైన గిరాకీ ఏర్పడింది. పంటలను రాబట్టగల శ్రామికులు కావాలి. 'దురదృష్టవశాత్తూ' వివిధ చారిత్రక పరిణామాల ఫలితంగా బానిస వ్యవస్థ రద్దయిపోయింది. అప్పుడేం చెయ్యాలి? వ్యవసాయంలో నైపుణ్యం కలిగిన శ్రామికులు ‘స్వచ్ఛందంగా’ వ్యవసాయోత్పత్తిలో ప్రవేశించగల ఏర్పాటు చెయ్యాలి. ఈ నేపథ్యంలో ‘ఒప్పంద శ్రామిక వ్యవస్థ’ను చట్టబద్ధమూ, వ్యవస్థీకృతమూ చేశారు విదేశీ పాలకులు..

ప్రలోభాలతో దేశాంతర యానం!

'గిర్మెట్లు’ అనే అపభ్రంశం అప్పుడే పుట్టింది. దానికి మూలం 'అగ్రిమెంట్' (ఒప్పందం). భారతదేశపు నలుమూలల నుండి, కరువు బాధితులు, భూమిలేని నిరుపేదలు, గిర్మిట్ లేబర్ మార్కెట్ ప్రధాన వనరుగా, ఎడతెగని ప్రవాహంగా అవతరించారు. నిరక్షరాస్యులైన ఈ అట్టడుగు వర్గాల జనం ఏజెంట్ల ప్రలోభాలకు లొంగి, మోసపోయి, ఎక్కడికి, ఎందుకు తీసుకెళుతున్నారో తెలియకుండానే, ఒప్పందాలపై వేలిముద్రలు వేసి, కూలీ ఓడల్లో, అమానుషమైన పరిస్థితుల్లో, నెలల తరబడి సముద్రయానాలు చేశారు.. అంతవరకూ తమ ఉత్పత్తులను మార్కెట్ ధరలకు అమ్ముకున్న ఆసియా ఖండపు రైతు బిడ్డలు, పూర్తిగా చితికిపోయి, పరాయిదేశాల్లో ఊడిగం చేసే శ్రామికులుగా, కేవలం తమ శ్రమను అమ్ముకొనే నిస్సహాయ సమూహంగా అవతరించారు. అటు భూమి మీద గాని, ఇటు ఉత్పత్తి మీద కాని వారికి ఎటువంటి హక్కూ లేదు.

నిరక్షాస్యులపై అర్థశాస్త్రం గెలుపు..

శ్రమదోపిడీ ఎల్లప్పుడూ నాలుగడుగులు ముందే ఉంటుందని ఒప్పంద శ్రామిక వ్యవస్థ మరోసారి నిరూపించింది. శ్రమ... నిత్యం మారుతూ ఉండే పెట్టుబడి అవసరాలకు స్పందిస్తూ, వ్యవస్థను నమ్ముకొని, వెంట నడుస్తుంది. ఎప్పుడైతే దోపిడీ దుర్భరంగా, క్రూరంగా మారుతుందో, అప్పుడే పోరాటాలు మొదలౌతాయి. శ్రామికులు నష్టపోతారు. ఉత్పత్తి దెబ్బ తింటుంది. సంస్కరణలు తప్పనిసరి అవుతాయి. అవికూడా పెట్టుబడి కనుసన్నలలోనే రూపొంది అమలవుతాయి.

మూలాలను వెతుక్కొనే అన్వేషణ..

ఈ పరిణామాలన్నింటినీ, సవివరంగా, గణాంకాలతో సహా నమోదుచేసిన సామాజిక చరిత్ర పునాదిగా సాగిన పరిశోధన ఈ రచన. అందుకే ఇది ‘దిగువనుండి ఎగువకు’, పాలితుల దృక్కోణం నుండి పాలకుల చర్యలను పరిశీలిస్తూ, ఆయా పరిణామాలను విశదీకరిస్తుంది. విశ్లేషిస్తుంది. పైగా దీని వెనుక రచయిత తన మూలాలను వెతుక్కొనే అన్వేషణ ఉన్నది. నిజానికి ముకుంద రామారావు పూర్వీకులు ఒప్పంద శ్రామికులుగా దక్షిణాఫ్రికా వెళ్లిన వాళ్లు. వారిలో కొంతమంది కుటుంబ సభ్యులు అక్కడే స్థిరపడ్డారు.

అక్షరాల్లో నిస్సహాయుల ఆక్రందనలు..

అందుకే ఈ రచన ఏక కాలంలో రాజకీయ ఆర్థిక శాస్త్ర పరిశోధన, సామాజిక చరిత్ర, ఆత్మకథ, మూలాల అన్వేషణ. అంతేకాదు, ఇది 'శనిదేవత రథచక్రపుటిరుసులలో పడి నలిగిన’ నిస్సహాయులు ఆక్రందనలను వారి మాటల్లోనే, పాటల్లోనే, కవితల్లోనే నమోదు చేసే ప్రయత్నం కూడా. స్వయంగా కవి, కవిత్వ పక్షపాతి అయిన ముకుంద రామారావు, ఎంతో శ్రమకోర్చి అలనాటి ఒప్పంద కార్మికులు పాడుకున్న గీతాలను, తరువాతి తరాల్లో చదువుకొనే అవకాశం పొందినవారు ప్రచురించిన కవితలను సేకరించారు. వాటిని అనువదించి ఈ రచనలో విస్తారంగా ప్రస్తావించారు. ఆ ఖండాంతర ప్రకంపనలు మన హృదయాలను తాకుతాయి. ఉదాహరణకి, మారిషస్ కవి తోరాబుల్లీ ఇలా అంటాడు (పే. 106):

నేను దేశభ్రష్టుడిని, నన్ను నేను/ వెలివేసుకున్న పరదేశీని/ రహస్యంగా దాచిన ఒప్పంద పత్రంలో/ నాకు నేనుగా కోల్పోవాలని/ ఎవరు నిర్ణయించారు?

పనిలో చేర్చుకొనేవాడికీ/ వాణిజ్య దౌత్యాధికారికీ మధ్య/ పరదేశీ పాలకుడికీ/ హింసించే స్థానికులకూ మధ్య/ కరువు నడిపించిన దారుల్లో/ చెరకు పొలాల గుండెల్లో/ నేను ముందే తప్పిపోయాను.

13 లక్షల మంది ప్రవాస భారతీయులు

ఒప్పంద శ్రామికులుగా వెళ్లిన 13 లక్షలమంది భారతీయులలో అధిక శాతం అక్కడే స్థిరపడిపోయారు. తరువాతి తరాలకు అందిన మెరుగైన జీవనం, చదువు, ఉద్యోగావకాశాలు, భూవసతి, ముఖ్యంగా కులవివక్ష లేకపోవడం వారిని అక్కడే ఉండిపోయేందుకు ప్రోత్సహించాయి. సుమారు ఎనభై ఏళ్లపాటు కొనసాగిన ఒప్పంద శ్రామిక వ్యవస్థ, చరిత్ర మిగిల్చిన కన్నీటి గాథ, స్వేద కాసారం, నెత్తుటి చారిక, సమిష్టి విషాదం. ఖండాలను జోడించే సాగరఘోష ఈ రచన.

రక్తసిక్త చరిత్రను చదవాల్సిందే!

గాంధీజీ తన సామ్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని దక్షిణ ఆఫ్రికాలో మొదలుపెట్టి, భారతదేశంలో కొనసాగించడం యాదృచ్ఛికం కాజాలదని ఈ రచన తెలుపుతుంది. ప్రతీ గ్రంథాలయంలోనూ ఉండాల్సిన, ఇతర భారతీయ భాషల్లోకి, ఇంగ్లీషులోకి అనువదించాల్సిన ప్రామాణిక రచన ఇది. రెండు వందలేళ్ల నాటి ఖండాంతర ప్రవాస భారతీయుల రక్తసిక్త చరిత్రకు ఎంతోకొంత న్యాయం చెయ్యాలంటే ఇటువంటి పరిశోధనాత్మక రచనలు సర్వవ్యాప్తితమై సమస్త జాతులనూ చేరుకోవాల్సి ఉంది. రచయితకి అభినందనలు.

పుస్తకం : అగమ్య గమ్యాలు

(బ్రిటిష్ కాలంనాటి ఒప్పంద కార్మికుల వలసలు).

రచయిత: ముకుంద రామారావు;

352 పేజీలు. వెల రూ. 350/-

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,

సెల్: 9000413413


సమీక్షకులు

-ఉణుదుర్తి సుధాకర్

90006 01068

Next Story