స్పెషల్ పీరియడ్.. రుతుస్రావ పాఠాలు.!

by Daayi Srishailam |

అందరికీ రుతుక్రమం గురించి క్రమం తప్పకుండా బోధిస్తోంది

స్పెషల్ పీరియడ్.. రుతుస్రావ పాఠాలు.!
X

దిశ, ఫీచర్స్: టీచర్లు కొందరు స్కూలుకు వచ్చామా.? అటెండెన్స్ వేసుకున్నామా.? అనేదే చూసుకుంటారు. మిగతా ధ్యాసంతా సైడ్ బిజినెస్ మీదే ఉంటుంది. కానీ.. కొందరు సామాజికంగా కూడా ఆలోచిస్తారు. టీచర్ జాబ్‌ను ఒక వృత్తిగా కాకుండా.. ఒక బాధ్యతగా భావించి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో యూపీకి చెందిన జరీన్ గార్సియా ఒకరు.

పీరియడ్స్‌పై చర్చ..

ఉత్తరప్రదేశ్‌లోని మాలిహాబాద్‌లో విద్యాస్థలి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది జరీన్ గార్సియా. "పీరియడ్స్" గురించి విద్యార్థులతో బహిరంగంగా చర్చిస్తోంది ఆమె. అబ్బాయిలు.. అమ్మాయిలు.. మగ టీచర్లు ఎవ్వరున్నా అందరికీ రుతుక్రమం గురించి క్రమం తప్పకుండా బోధిస్తోంది. ఆమె అలా చెప్తున్నప్పుడు కొందరు మౌనంగా ఉండిపోతారు. ఇంకా కొందరు భయపడతారు. కొందరైతే ముఖానికి పుస్తకాలు అడ్డంపెట్టుకొని నవ్వుతుంటారు. ఇదేమీ చెప్పకూడని.. మాట్లాడకూడని అంశం కాదు అని జరీన్ మాత్రం ఆపకుండా ఆ విషయాలు చెప్తూనే ఉంటుంది.

భయాలను పోగొడుతూ..

లక్నోలోని స్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్లో యూత్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా జరీన్ పనిచేస్తుంది. ఈ సంస్థ అమ్మాయిల హక్కులు, సామాజిక న్యాయం మీద దృష్టి పెడుతుంది. జరీన్ దీంట్లో పనిచేస్తూనే టీచర్‌గా సేవలందిస్తోంది. అంతేకాదు.. ఆమె అడ్వకేట్ కూడా. పిల్లలకు ఒక మెంటార్‌గా ఉండి.. పాఠపుస్తకాల డయాగ్రామ్‌లు కాకుండా గౌరవం, స్వాతంత్ర్యం, హక్కుల గురించి బోధిస్తూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలామంది అమ్మాయిలకు తమ శరీర అవయవాల పేర్లు కూడా తెలియవు. సిగ్గు పడతారు. మొహమాట పడతారు. అలాంటి భయాలన్నింటినీ పోగొడుతోంది జరీన్.

సమాజం నుంచి కొత్త పాఠం..

జరీన్.. రుతుక్రమ పాఠాలు చెప్పడానికి దేశమంతా తిరుగుతుంది. తన జీవితంలోని అనుభవాల సారంగా ఆమె ఈ పంథాను ఎంచుకున్నది. వాళ్ల నాన్న వెనిజ్వులన్. అమ్మ ఇండియన్. అమెరికాలో పుట్టి పెరిగింది జరీన్. హోండ్రోస్‌లో చదువుకున్నది. ఒక ఎనిమిదేండ్లుగా యూపీలో ఉంటోంది. ఆమె తీవ్రమైన మెనుస్ట్రువల్ క్రాంప్స్‌ సమస్యను ఎదుర్కుంది. ఎంతో ఆందోళన చెందింది. డాక్టర్లు తేలిగ్గా తీసుకున్నారు. "స్త్రీలు నొప్పిని సహించాల్సిందేకదా" అనేది వాళ్ల ఉద్దేశం కావచ్చు. భరించలేని ఆ నొప్పి.. సమాజం దృష్టి నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకుంది. ఇదే నేటి యువతకు బోధించాలి అనుకున్నది.

4500 మందికి..

కోవిడ్-19 లాక్‌డౌన్‌లో సానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. పాత టవల్స్, దుస్తులతో రీయూసబుల్ క్లాత్ ప్యాడ్లు ఎలా చేయాలి అని ఒక సింపుల్ వీడియో తీసింది. దానివల్ల ఎంతోమంది ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. సంక్షోభ స్పందనగా మొదలై కమ్యూనిటీ మూవ్‌మెంట్‌గా మారింది. ఇది రుతుస్రావం, సంరక్షణ గురించి చర్చలకు అవకాశం కల్పించింది. ఇంతకు ముందు మాట్లాడని ఇళ్లలో.. దీని గురించి మాట్లాడేలా చేసింది. రుతుస్రావం పట్ల ఉన్న మూఢ నమ్మకాలను పటాపంచలు చేసింది. 35 పైగా స్కూళ్లు, కమ్యూనిటీలలో 4,500 మందికి పైగా పీరియడ్స్ పాఠాలు చెప్పి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

Next Story