సిలికాన్ చిప్‌లతో క్వాంటం కంప్యూటర్.. భవిష్యత్ సాంకేతికతకు అదే కీలకమంటున్న నిపుణులు

by Javid Pasha |   (  Updated:2025-09-16 08:47:07  IST  )

క్వాంటం కంప్యూటర్లు ఔషధ రూపకల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయని నిపుణులు అంటున్నారు.

సిలికాన్ చిప్‌లతో క్వాంటం కంప్యూటర్.. భవిష్యత్ సాంకేతికతకు అదే కీలకమంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ఏఐ టెక్నాలజీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు క్వాంటం టెక్నాలజీని మానవ అవసరాలకు ఎలా రూపొందించాలి?, ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కూడా పరిశోధకులు ఫోకస్ చేశారు. క్వాంటం టెక్నాలజీ అంటే క్వాంటం సూత్రాలను ఉపయోగించి అభివృద్ధి చేసే సాంకేతికత. ఇది అణు, సబ్ అటామిక్ స్థాయిలో కణాల ప్రవర్తన (సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్ వంటివి) ఆధారంగా పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం సెన్సార్లు ఇందులో భాగం. ఇవి సంక్లిష్ట గణనలు, సురక్షిత డేటా బదిలీ, కచ్చితమైన కొలతలను తెలుసుకోవడం, రూపొందించడం సాధ్యం చేస్తాయి. కాగా ఇటీవల ప్రపచంలోనే మొట్టమొదటిసారిగా సిలికాన్ చిప్‌లతో రూపొందించిన మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను లండన్‌కు చెందిన క్వాంటమ్ మోషన్ (Quantum Motion) స్టార్టప్ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు డెవలప్ చేయగా, ఆ సంస్థ దానిని 2025 సెప్టెంబర్ 15న యూకే నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (NQCC)కు అందజేసింది. ఇంతకీ దీనివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.

సిలికాన్ చిప్‌లను ఉపయోగించి క్వాంటం కంప్యూటర్‌ను రూపొందించడం ఒక గొప్ప సాంకేతిక విప్లవంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ సిలికాన్ చిప్‌లు అంటే సిలికాన్ అనే అర్ధ-వాహక పదార్థంతో తయారు చేసిన చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు. క్వాంటం కంప్యూటర్ వ్యవస్థ నిజానికి రోజువారీ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే సిలికాన్ చిప్ సాంకేతికతను ఆధారంగా చేసుకుంటుంది. అయితే సాంప్రదాయ కంప్యూటర్‌లతో పోలిస్తే, క్వాంటం కంప్యూటర్‌లు సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో అసాధారణ వేగాన్ని (Extraordinary speed), సామర్థ్యాన్ని అందిస్తాయి. సిలికాన్ చిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ కంప్యూటర్ల ఉత్పత్తి ఖర్చు తగ్గడమే కాకుండా, వాటిని సాధారణ కంప్యూటింగ్ వాతావరణంతో సమన్వయం చేయడం సులభమవుతుంది. ఈ ఆవిష్కరణ క్వాంటం కంప్యూటింగ్‌ను మరింత సులభతరం చేస్తూ, భవిష్యత్తులో విస్తృత వినియోగానికి దారి తీస్తుంది.

ఇటీవల రూపొందించిన క్వాంటం కంప్యూటర్ సిలికాన్-ఆధారిత క్యూబిట్‌లను ఉపయోగిస్తుంది. కాబట్టి ఇవి సాంప్రదాయ ట్రాన్సిస్టర్‌లతో పోలిస్తే సమాచారాన్ని భిన్నంగా మేనేజ్ చేస్తాయని వాటిని రూపొందించిన నిపుణులు అంటున్నారు. క్యూబిట్‌లు ఒకేసారి బహుళ స్థితుల్లో (multiple situations) ఉండగల సామర్థ్యం కలిగి ఉండటంవల్ల క్వాంటం కంప్యూటర్ సంక్లిష్ట గణనల(Complex calculations)ను వేగవంతం చేస్తుంది. కాగా ఈ సరికొత్త సాంకేతికత ఉపయోగాల విషయానికి వస్తే కొత్త ఔషధ రూపకల్పన (Drug design), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ప్రోటీన్ ఫోల్డింగ్‌లో బయాలజీ పరిశోధనలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను మెరుగుపరచడం, క్రిప్టోగ్రఫీలో భద్రతా వ్యవస్థలు, వెదర్ ప్రిడిక్షన్, న్యూక్లియర్ ఫ్యూషన్ సిమ్యులేషన్, కార్బన్ క్యాప్చర్ వంటి క్లైమేట్ చాలెంజెస్‌కు పరిష్కారాలను అందిస్తుంది. సిలికాన్ చిప్‌ల వాడకం వల్ల ఈ కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే ఉన్న సెమీకండక్టర్ తయారీ సౌకర్యాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది ఖర్చును తగ్గిస్తుంది. దీంతో ఈ ఆవిష్కరణ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ సామాన్య సాంకేతికతల(simple techniques)తో మరింత అనుసంధానమై, రోజువారీ జీవితంలో సాంకేతిక పురోగతిని వేగవంతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. Link

Next Story