Fashion Psychology : ప్రతి రోజూ అది ఆలోచించడానికే 17 నిమిషాల సమయం కేటాయిస్తున్న మహిళలు..!!

by Javid Pasha |   (  Updated:2025-05-21 06:39:14  IST  )

Fashion Psychology : ప్రతి రోజూ అది ఆలోచించడానికే 17 నిమిషాల సమయం కేటాయిస్తున్న మహిళలు..!!

Fashion Psychology : ప్రతి రోజూ అది ఆలోచించడానికే 17 నిమిషాల సమయం కేటాయిస్తున్న మహిళలు..!!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ క్షణం, ప్రతీ నిమిషం, ప్రతీ రోజు మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే జీవితమే ఆలోచనల మయం. అయితే ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయనే దానిని బట్టి కూడా మానవ జీవితాలు ప్రభావితం అవుతుంటాయి. ప్రతి కూల ఆలోచనలు, సానుకూల దృక్పథాలు, ఆనందమయ క్షణాలు వంటివి కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. అయితే ఎవరేం ఆలోచిస్తారు? అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయమే.. అయినప్పటికీ కొన్ని సామాజిక మార్పులు, ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి ఆయా సంస్థలు సర్వేలు, అధ్యయనాలు నిర్వహిస్తుంటాయి. రీసెంట్‌గా మార్క్స్ & స్పెన్సర్ కూడా అదే చేసింది. ఫ్యాషన్ సైకాలజీలో భాగంగా మహిళల వస్త్రధారణ విషయమై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవేమిటో చూద్దామా!

మనకు ఆహారం ఎంత అవసరమో, జీవితంలో స్టైల్ అండ్ ఫ్యాషన్ కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు చాలామంది. ముఖ్యంగా మహిళలు వస్త్రధారణ విషయంలో ఆధునికతకు, అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని మార్క్స్ & స్పెన్సర్ అధ్యయనం పేర్కొంటున్నది. తాము ఎలా రెడీ అవ్వాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి? అనే విషయాన్ని తేల్చుకోవడానికే అత్యధికమంది మహిళలు ప్రతిరోజూ 17 నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వారి జీవితకాలంలో దాదాపు ఆరు నెలలుగా సమానంగా ఉంటుందని తెలిపింది.

అధ్యయంలో భాగంగా మార్క్స్ & స్పెన్సర్ తరఫున స్టడీలో పాల్గొన్న నిపుణులు పని, సామాజిక కార్యక్రమాలు(Social events), సెలవులు, డేట్స్ వంటి వివిధ సందర్భాల కోసం మహిళల దుస్తుల ఎంపికను(choice of clothing) పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఇటువంటి సందర్భాల్లో సరైన నిర్ణయం కోసం మానసిక శక్తి ఎలా వినియోగించబడుతుందో కూడా వారు విశ్లేషించారు. ఇది మహిళల రోజువారీ జీవనశైలిని ప్రతిబించడమే కాకుండా, వారిలో సానుకూల భావాలకు, మానసిక ఆనందానికి దారితీస్తుందని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే వ్యక్తిగత అలంకరణ, సరైన దుస్తుల ఎంపిక వంటి నిర్ణయాలు తరచూ సామాజిక నిబంధనలు, సాంస్కృతిక ప్రమాణాలు, వ్యక్తిగత గుర్తింపుతో ముడిపడి ఉంటాయి. తాము సరైన నిర్ణయం తీసుకున్నామనే ఆలోచన మహిళల్లో ఆనందంతోపాటు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది.

Next Story