పగిలిపోయిన వస్తువులను జపనీస్ కళతో తోటగా మారుస్తోంది.!

by Daayi Srishailam |

ఇక్కడొక తల్లీకూతురు పెద్ద తోటనే నిర్మించారు.

పగిలిపోయిన వస్తువులను జపనీస్ కళతో తోటగా మారుస్తోంది.!
X

ఇరిగి కుర్చీలు..

పలిగిన పైపులు..

పాతా డబ్బాలు..

కోటర్ సీసాలు..

అని పొద్దు పొద్దున్నే మైకుల మోతలు మోగుతుంటయి బస్తీల్లో.

వాటితో ఏం చేస్తారు.?

వాళ్లేం చేస్తరో ఏమోగానీ.. ఇక్కడొక తల్లీకూతురు పెద్ద తోటనే నిర్మించారు.

- దిశ, ఫీచర్స్

"కొకెడామా" అనేది జపనీస్ పదం. "మాస్ బాల్" అని దీనర్థం. దీంట్లో మొక్క వేర్లు మట్టి.. నాచుతో చుట్టి పోర్టబుల్ గార్డెన్‌‌ను తయారు చేస్తారు. కుండల అవసరం లేకుండా మొక్కను ప్రదర్శించడానికి ఇది ఉపయోగపడుతుంది. పచ్చదనం.. సౌందర్యం.. ఆహ్లాదకరం అన్నింటికీ ఇదొక మార్గం.

పాత వస్తువులతో..

తోటల పెంపకంలో "కొకెడామా" సరికొత్త ట్రెండ్‌గా నిలుస్తోంది. గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్టింగ్ ఉన్న మహిళలకు ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది. జపాన్లో ప్రతీ ఇంటికీ.. ప్రతి పెరటికీ ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తుంటాయి. ఈ గార్డెనింగ్ పట్ల ఆకర్శితులైన ఇండియన్స్.. ఆసక్తితో టెర్రాస్ గార్డెన్లను కొకెడామాగా మార్చేసుకుంటున్నారు. పాత బాటిల్స్.. టైర్లు.. పెయింట్ డబ్బాలు.. పాత బట్టలు.. ఇవన్నీ మనం ఎప్పుడో చెత్తలో పారేసేవే కదా. కేరళకు చెందిన అంజలి తన తల్లితో కలిసి వీటితోనే ఆకర్షనీయమైన తోటను రూపొందించింది. దీనికి ప్రేరణే జపాన్ కొకెడామా కళ.

స్థిరమైన సాగుబడి

ఒకరోజు అంజలి చుట్టాల ఇంటికి వెళ్లింది. అక్కడామెకు ఒక ప్రత్యేకమైన కొకెడామా తోట కనిపించింది. మొక్కల వేర్లను మట్టి.. మొక్కజొన్నతో చుట్టి తాటి పొదలతో కట్టిపారేసే జపాన్ శైలి ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో దాని గురించి అడిగిందట. అది జపాన్ శైలి తోట అని వాళ్లు చెప్పారు. అలాంటిదొకటి చేయాలనే ఆసక్తి పెరిగిందట అంజలికి. ఆ ఆసక్తి శోధనగా మారింది. యూట్యూబ్.. ఇన్‌స్టా వీడియోలు చూసి మొత్తానికి ఆ కళ నేర్చుకుంది. తన ఇంట్లోనే మొదటి కొకెడామా తయారుచేసింది. ఉత్సాహం కొద్ది అలా స్టార్ట్ చేసిన కొకెడామా ఆమెను స్థిరమైన సాగుబడి వైపు నడిపించింది.

మక్రమే కళ తోడై..

అంజలికి తల్లి ద్వారా అద్భుతమైన మద్దతు దొరికింది. ఇద్దరూ కలిసి వాడిపోయిన.. పాడైపోయిన వస్తువులతో తోట పని చేయడం మొదలుపెట్టారు. బాటిల్స్.. డ్రమ్ములు.. పెయింట్ డబ్బాలు.. పాత టైర్లు.. కొబ్బరి చెక్కలు.. ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ వారి తోటలో అందమైన మొక్కలకు బూడిద గుల్లలుగా మారిపోయి అద్భుతంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాళ్ల ఆసక్తి.. నైపుణ్యం అక్కడితో ఆగలేదు. "మక్రమే" కళను ఉపయోగించి మొక్కల హ్యాంగర్లను తయారుచేయడం ప్రారంభించారు. "మక్రమే" అనేది నేత లేదా అల్లికకు బదులుగా వాడే ముడికట్టే పద్ధతి.

ప్రకృతి పాఠం..

ప్లాస్టిక్.. ఖాళీ డబ్బాలు ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పనికొచ్చే వస్తువులతో మొక్కల బూడిదగుల్లలను తయారుచేస్తున్నారు. అలా తమ కళా నైపుణ్యంతో తోటకు ప్రత్యేకమైన శోభను తీసుకొచ్చారు. ప్లాంటర్ల కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేకపోవడంతో పని మరింత ఈజీ అయింది. ప్రకృతిని కాపాడటమే కాదు.. మనకు ఖర్చును కూడా కొకెడమా తగ్గి్స్తుందన్నమాట. తన తల్లిచూపిన మార్గం ద్వారా అంజలి తోటను కేవలం మొక్కల పెంపకానికి మాత్రమే కాకుండా సృజనాత్మకతకు.. పర్యావరణ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పాత వస్తువుల్ని జీవితంతో నింపే ఓ ప్రకృతి పాఠంగా మారింది.

Next Story