- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకమా..? ఎందుకు వస్తుంది.. ఏం చేయాలి?

దిశ, ఫీచర్స్ : స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) ఇటీవల అనేక మందిని భయపెట్టిస్తున్న వ్యాధి ఇది. ఏపీలోని విజయనగరంలో ఓ మహిళ దీనిబారిన పడి మరణించినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆ వ్యాధిపట్ల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఇంతకీ అది ఎందుకు వస్తుంది? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల సమాధానాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య నిపుణుల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) అనేది ఒక తీవ్రమైన సంక్రమణ వ్యాధి. ఓరియెంటియా సుట్సుగముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది గ్రామ్-నెగెటివ్ ఆల్ఫా-ప్రోటియోబ్యాక్టీరియం ఫ్యామిలీకి చెందిన ఇంట్రాసెల్యులర్ పారాసైట్. గులాబీ, ఎరుపు, నీలం వంటి రంగుల్లో కనిపిస్తుంది. దీనిని మొదట 1920లు, 1930ల ప్రారంభంలో జపాన్‌లో కనుగొన్నారు. 1935 నాటికి ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో గుర్తించారు. కాగా ఓరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ఆగ్నేయ ఆసియా, చైనా, జపాన్, ఇండియా, ఉత్తర ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణంగానే ఉంటుంది. ఇది గడ్డి పొదలు, జంగిల్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 'స్క్రబ్' టైఫస్ అని పేరు వచ్చింది. స్క్రబ్ (scrub)అంటే ఇంగ్లీష్‌లో గడ్డి పొదలు అని అర్థం. టైఫస్ అంటే.. జ్వరం, తలనొప్పి, రాష్ వంటి లక్షణాలను సూచించే ఒక రకమైన ఇన్‌ఫెక్షన్.
ఎలా వస్తుంది?
స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్టెడ్ చిగర్స్ (Larval trombiculid mites) కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ చిగర్స్ గడ్డి పొదలు, రూరల్ ప్రాంతాల్లో ఉంటాయి. అవి కాటు వేసే సమయంలో బ్యాక్టీరియాను శరీరంలోకి పంపుతాయి. అది రక్తంలో చేరి, శరీరమంతా వ్యాపించి వ్యాధిని కలిగిస్తుంది. కాటు వేసిన 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఇది మనిషి నుండి మనిషికి వ్యాపించదు.
లక్షణాలు
జ్వరం, చలి, తలనొప్పి, బాడీ పెయిన్స్, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఆ కీటకం కాటు వేసిన స్థానంలో చిన్నపాటి నల్లటి గడ్డ లేదా పొక్కు వంటిది కనిపిస్తుంది. 70–90% కేసుల్లో ఇది కనిపిస్తుంది. చంకలు, ఛాతీ, వీపు, కడుపు భాగాల్లో కూడా ఇవి ఏర్పడవచ్చు. కండరాల నొప్పి వేధిస్తుంది. మొదట నొప్పి లేకపోయినా తర్వాత నల్లగా మారి పొక్కు ఏర్పడుతుంది. ఒక్కసారిగా అధిక జ్వరం (102–104°F) రావచ్చు. స్కాబ్-లాంటి గాయం (ఎస్కార్), రాష్, గ్లాండ్స్ వాపు వంటివి కనిపిస్తాయి. చలిక గగుర్పాటు, పొడి దగ్గు, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో ఇది మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, మెనిన్‌జైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. చికిత్స చేయకపోతే మరణాల రేటు 70% వరకు ఉండవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారిస్తే చికిత్స అందిస్తారు.
నివారణ/చికిత్స
స్క్రబ్ టైఫస్ ప్రధానంగా చిగర్స్ కీటకాల ద్వారా వస్తుంది. కాబట్టి అవి కాటు వేయకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో నివసించేవారు కేర్ తీసుకోవాలి. గడ్డి, పొదలు వంటి ఏరియాలో నడుస్తున్నప్పుడు లాంగ్ స్లీవ్స్, ప్యాంట్స్ ధరించడం, ఇన్‌సెక్ట్ రిపెలెంట్స్ (DEET) ఉపయోగించడం. గడ్డిపై కూర్చోకపోవడం వంటివి చేయాలి. ప్రస్తుతానికైతే దీనికి ప్రత్యేకించి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ట్రీట్మెంట్ కోసం యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా డాక్సీసైక్లిన్ (Doxycycline) లేదా అజిథ్రోమైసిన్ వంటివి ఈ బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. త్వరగా డయాగ్నోస్ చేసి చికిత్స చేస్తే పూర్తిగా కోలుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






