సముద్రాలు దాటేసి.. ప్రపంచాన్ని చుట్టేసి..! యూఆర్ఎల్‌పై క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2026-01-13 11:05:23  IST  )

మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడో, ఏదైనా ఒక లింక్‌పై క్లిక్ చేసినప్పుడో అనుకున్న సమాచారం క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది. ఇంతకీ అదెలా సాధ్యం?

సముద్రాలు దాటేసి.. ప్రపంచాన్ని చుట్టేసి..! యూఆర్ఎల్‌పై క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మీరు ఏదైనా సమాచారం కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. ఏదో ఒక యూఆర్ఎల్ (Uniform Resource Locator) లింక్‌పై క్లిక్ చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు ఏమాత్రం ఆలస్యం కాకుండా సంబంధిత సమాచారం క్షణాల్లో మీ డివైస్ లేదా డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షం అవుతుంది. అసలు అంత సులువుగా, అంత స్పీడ్‌గా ప్రపంచంలోని ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇంత వేగంగా ఎలా పొందగలుగుతున్నాం? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? కానీ ఆ క్షణాల సమాచారం వెనుక ప్రపంచమంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

సముద్రాలు దాటేసి..

అవును.. మీరు ఒక లింక్‌పై క్లిక్ చేసినప్పుడు క్షణాల్లో అనుకున్న సమాచారం మనం పొందొచ్చు. కానీ దాని వెనుక మనకు కనిపించని అతి పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. క్లిక్ చేయగానే బ్రౌజర్ ముందుగా లింక్‌లోని యూఆర్ఎల్‌ను గుర్తిస్తుంది. అంటే క్లిక్ చేయగానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ ముందుగా ఆ వెబ్‌సైట్ పేరును (ఉదా: google.com) ఒక ప్రత్యేక నంబర్‌గా మారుస్తుంది. దానిని ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్ (IP address) అంటారు. ఈ పని డొమైన్ నేమ్ సిస్టమ్(DNS) అనే వ్యవస్థ చేస్తుంది. ఇది ఇంటర్నెట్‌లోని ఫోన్ బుక్ లాంటిది. తర్వాత మీ రిక్వెస్ట్ చిన్న చిన్న ప్యాకెట్లుగా (పార్సిల్స్ లాగా) విడిపోయి, మీ రూటర్ ద్వారా మీ ఇంటర్నెట్ కంపెనీ(ISP)కి వెళ్తుంది. అక్కడి నుంచి ప్రపంచంలోని 10-15 రూటర్ల మీదుగా దూసుకెళ్తుంది. కొన్నిసార్లు సముద్రం అడుగు భాగంలో ఉన్న మందపాటి ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా మహాసముద్రాలు దాటి, దూరంగా ఉన్న భారీ డేటా సెంటర్లకు సైతం చేరుకుంటుంది.

ప్రపంచమంతా చుట్టేసి..

చిన్న ప్యాకెట్లుగా విడిపోయిన రిక్వెస్ట్ సంబంధిత డేటా సెంటర్‌లోని సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లుకు చేరి, చాలా స్పీడ్‌గా ప్రాసెస్ చేసి, వెబ్‌పేజీని(HTML, photos, videos, etc) తిరిగి అదే చిన్న ప్యాకెట్లలో తిరిగి వస్తుంది. అంటే ఆ ప్యాకెట్స్ మళ్లీ అదే మార్గంలో సముద్రం అడుగున ఉన్న కేబుల్స్, రూటర్లు, మీ ఇంటర్నెట్ ప్రొవైడ్ సర్వీస్ (ISP) ద్వారా మీ డివైస్‌కు తిరిగి వస్తాయి. దీంతో వెంటనే మీ బ్రౌజర్ ఆ ప్యాకెట్లన్నీ కలిపి పేజీని మీ ముందు ప్రదర్శిస్తుంది. ఈ పూర్తి ప్రయాణం, ప్రాసెస్ అంతా మిల్లీసెకండ్లలో (In less than the blink of an eye) జరిగిపోతుంది! అంటే జస్ట్ వన్ క్లిక్ వల్ల మీ సమాచారం ప్రపంచం మీదుగా వెళ్లి, తిరిగి వచ్చి మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అది కూడా క్షణాల్లోనే!

Next Story