- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: చలికాలం వచ్చిందంటే గొంగడి జ్ఞాపకం వస్తుంది. గొంగడి అంటే ఒక సంప్రదాయం. ఒక ఆరోగ్య రక్షిణి. మరిచిపోలేని బాల్యపు స్మృతి. గొంగడి వేసుకుంటే చాలా ఏ డాక్టరూ అవసరం లేదు అని అనేవాళ్లు పెద్ద మనుషులు. నిజంగానే గొంగడి ఏ డాక్టర్ ప్రిస్కిప్షన్ కాదు. మన పెద్దవాళ్లిచ్చిన ఆరోగ్య ఆయుధం. నాకు గొంగడి చుట్టూ పెద్ద మెమొరీయే ఉంది. అది అందరికీ చెప్పుకునే మధుర జ్ఞాపకం.
అచ్చం చీర నేసినట్లు..
మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ గొంగడి నేసేవారు. వాళ్లకు గొర్రెలు ఉండేవి. ఆ గొర్రెల ఉన్నిని కత్తిరించి, వేరే ఊర్లో పట్టించుకుని తెచ్చి ఇంటి ముందు ఆరబెట్టేవారు. ఆ ఉన్నిని శుభ్రంగా కడిగి, ఎండలో ఆరబెట్టి, మా తాతయ్య సన్నని దారాలుగా మార్చేవాడు. ఆ దారాలు కాలుపై వేసుకుని, చేత్తో పగ్గం నేసినట్లు నేసేవారు. పొడవాటి రెండు కర్రలు పెట్టి, చక్రాలు అమర్చి పొడుగు దారాలు.. అడ్డం దారాలు అల్లి.. ఒక్కో గొంగడికి రూపం ఇచ్చేవాళ్లు. యంత్రాలు లేని ఆ రోజుల్లో ఇదంతా చేత్తోనే చేసేవాళ్లంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అమ్మమ్మ చేతులు గొంగడికోసం అల్లుకునే దృశ్యం.. అచ్చం చీర నేసినట్లు కనిపించేది.
చింత గింజల అంబలి..
ఊరూరా తిరిగి నాణ్యమైన ఉన్ని సేకరించి వేరుచేసి... గొంగళ్లు నేసేవాళ్లు మా అమ్మమ్మ.. తాత. గొంగడి అల్లిక అయిపోయాక... గంటల తరబడి చింత గింజలు ఉడకబెట్టేవారు. ఆ గింజల నుంచి వచ్చే అంబలిని "చింత గింజల అంబలి" అనేవారు. ఆ అంబలిలో గొంగడిని ముంచి తీసి ఆరబెట్టేవారు. అప్పుడు గొంగడి గట్టిగా, మన్నికగా మారేది. చివరికి తెల్లటి ఉన్నితో అంచులు చేసేవారు. ఇప్పటి మార్కెట్ గొంగళ్లలా సన్నగా, తేలికగా ఉండేది కాదు. లావుగా, బరువుగా ఒక్కో గొంగడి 3 నుంచి 4 వేల రూపాయలు ధర పలికేది. తొవ్వ కిరాయి, చింత గింజలు, ఉన్ని కిరాయి... అన్నీ పోగా వెయ్యి రూపాయల వరకు మిగులుతుండేది. ఆ డబ్బుతోనే మా స్కూలు ఫీజులు, ఇంటి ఖర్చులు తీర్చేవారు.
గొంగళ్ల మధ్యలో సరదాలు..
మేం చిన్నప్పుడు... ఆ గొంగళ్ల మధ్యలో తిరిగేవాళ్లం. నేస్తున్న గొంగళ్లు తీసుకుని మెడలో వేసుకునేవాళ్లం. మీసాలుగా చుట్టుకునేవాళ్లం. గడ్డంగా పెట్టుకునేవాళ్లం. తలపై విగ్గులా అమర్చుకునేవాళ్లం. వాళ్లు ఎంతో కష్టపడి చేసిన ఉన్నిని... మా సరదా కోసం చిందరవందరగా చేసి పడేసేవాళ్లం. అయినా అమ్మమ్మ, తాతయ్య ఏమీ అనేవారు కాదు. "అరె వద్దురా... కరాబ్ అయితది రా" అని మాత్రమే చెప్పేవారు. ఆ మాటల్లో ప్రేమ ఉండేది. ఓర్పు ఉండేది. ఆ గొంగడి చుట్టూ మా బాల్యమంతా తిరిగింది. గొర్రెల ముందు.. గొంగడి చుట్టూ... అన్నీ ఒక్కటిగా ముడిపడి ఉండేవి.
అమ్మ వెచ్చదనం..
గొంగడి... కేవలం చలి తప్పించే వస్తువు మాత్రమే కాదు. పుట్టిన పిల్లలను వెచ్చదనం కోసం దానిలో చుట్టేవారు. అమ్మ ఒడిలో అడ్డం ఒరిగితే వెచ్చదనం ఆ గొంగడిలో మాత్రమే వచ్చేది. దేవుళ్ల పూజల్లో కూడా గొంగడి ప్రధాన పాత్ర పోషించేది. ఇప్పటి గొంగళ్లు వెచ్చదనం ఇస్తాయి కానీ... ఆ మన్నిక, ఆ ఆరోగ్యం, ఆ ప్రేమ... ఇవ్వలేవు. చలికాలం వచ్చిందంటే... అమ్మమ్మ చేతులు, తాతయ్య కష్టం, మా సరదాలు... అన్నీ కళ్ల ముందు కదలాడతాయి. ఆ గొంగడి... ఇప్పుడు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలింది. చలికాలం గుర్తొస్తే... తీపి గుర్తుగా మనసులో నిండిపోతుంది. గొంగడి నేయడం మన సంస్కృతి, మన వారసత్వం. దాన్ని కాపాడుకుందాం.
- గొరిగె వెంకటేశ్, పోచారం, రంగారెడ్డి జిల్లా






