రైతు కళ్లలో ఆనందం నింపే ఆరుద్రలు.!

by Daayi Srishailam |   (  Updated:2025-06-01 03:02:09  IST  )

ఎవుసం తీరు మారినా ఆరుద్రల రాక మారలేదు.

రైతు కళ్లలో ఆనందం నింపే  ఆరుద్రలు.!
X

ఎన్కటికి ఎవుసంతోనే బతుకుదెరువు.

వానలెప్పుడు పడ్తయి..

వడగండ్లెప్పుడు పడ్తయనేది వాతావరణం శాఖ చెప్తే కాదు..

కార్తె చెప్తే తెలిసేది.

విత్తనాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడే వేసెటొళ్లు కాదు.

కార్తెబలం ఉంటది కాబట్టీ..

ఏ విత్తేసినా బలమైన కార్తెలోనే వేసెటొళ్లు.

అసొంటి కార్తెలల్ల "ఆరుద్ర కార్తె" ముఖ్యమైనది.

ఆరుద్రకార్తె వచ్చిందని "ఆరుద్ర"లు చెప్పేవి.

- దిశ, ఫీచర్స్

కార్తెను చూసి విత్తనమేసెటొళ్లు మన రైతులు. కత్తెర పంట అయిపోంగనే "ఆరుద్ర కార్తె"లో దుక్కులు రెడీ చేసిపెట్టుకుంటారు. నాగలి.. గొర్రు.. గుంటుక.. దంతె మొనవెట్టించుకునేందుకు వడ్రంగి దగ్గరికి లైన్లు కడ్తుండె. కానీ ఇప్పుడు ఎద్దెక్కడిది..? ఎవుసమెక్కడిది.? అన్నీ చిన్న చిన్న కమతాలే. ఆ ముత్యమంత సాగుకోసం దుక్కులకు.. నాట్లకు.. కోతకు అన్నింటికీ మెషిన్లనే వాడుతుండ్రు. ఎవుసం తీరు మారినా.. రైతు చేత మారినా.. ఆరుద్రల రాక మారలేదు.. కార్తె బలం తగ్గలేదు.

రైతు నేస్తాలు


ఆరుద్రలతో ఆడుకుంటున్న బాలుడు (ఫైల్ ఫొటో)

జూన్ నెలలో ఎర్రటి పొలాలల్ల.. ఎంతో సక్కని రూపంతో ఆరుద్ర కార్తెను తీసుకొస్తాయి "ఆరుద్రలు". ఒకరకంగా కాలాన్ని మోసుకొచ్చే రైతు నేస్తాలు. కానీ ఈ సారి రోహిణి కార్తెలో పడ్డ వానలకే ఆరుద్రలొచ్చాయి. కలికాలం కదా.? ఆరుద్రలు రాంగనే వాతవరణం పూర్తిగా మారిపోతుంది. ఏడాదికొక్కసారి మాత్రమే కనిపించే ఈ రైతు నేస్తాలు ఆరుద్ర కార్తె అయిపోంగనే మల్లా కనబడవు. అప్పుడే మొలకెత్తుతున్న పచ్చటి గడ్డి చాటున.. భూమిని చీల్చుకుంటూ ఆరుద్రలు పుడతాయి. వాటినట్లా సుకుమారపు నడకలో చూస్తుంటే లేగ దూడెలు పరుగెత్తినట్లు సంబరమైతది. అందుకే "ఆరుద్ర కురిస్తే దారిద్రం ఉండదు" అందురు భూమిని నమ్ముకున్న రైతన్నలు.

ముడుచుకునే పురుగులు


ఆరుద్రలతో ఆడుకుంటున్న బాలుడు (ఫైల్ ఫొటో)

ఇప్పుడంటే హాలిడేస్ అయిపోయేదాక "సమ్మర్ క్యాంప్స్"కి వెళ్తున్నారు పిల్లలు. కానీ అప్పట్ల స్కూల్స్ స్టార్టయ్యే వరకు "బాయికాడ"నే అల్లనేరడి చెట్టుకింద "కట్టె మంచం" మీద కథలు వింటూ సాగేది. తొలకరి పలకింత.. మట్టి వాసన పులకరింతను మనసారా ఆస్వాదించెటొళ్లు. ఆ జర్నీలో వానల్ని.. వాతావరణ మార్పుల్ని ఎన్నో చూస్తుండె. అండ్లకెల్లి పుట్టుకొచ్చిన "మురిపెమే" ఆరుద్ర పురుగులు. ముట్టుకుంటే ముడుచుకునే అత్తిపత్తి మొక్కనే కాదు.. ఆరుద్రలు కూడా ముట్టుకుంటే ఇన్నోసెంట్‌గా ముడుచుకునేవి. ఇన్ని ఉంటాయి కాబట్టే "ఆరు కార్తెలు పోయినా ఆరుద్ర దిక్కు" అనే నమ్మకం ఉండేది రైతులకు.

ఆకులల్ల వేసుకొని..


ఆరుద్ర కార్తెలో పడిన వర్షాలకు పొలాల్లోకి వచ్చిన ఆరుద్రలు (ఫైల్ ఫొటో)

"ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడ్తయి" అనే ధీమా ఉండేది కాబట్టీ కార్తె కోసం కాపుగాసి.. ఆరుద్రల ఆగమనం కోసం ఎదురుచూస్తుండెటొళ్లు. పిల్లలు వాటిని అగ్గిపెట్టెలల్ల.. ఆకులల్ల పెట్టుకొని ఆడుకుంటందుకు ట్రైజేస్తుండె. అవేమో కిందేస్తేనేమో కిర్రుకిర్రుమని ఉర్కేవిగానీ.. చేతిలకు తీస్కుంటే ఏం తెల్వనట్లు ముడ్సుకుంటుండె. ఒక్కొక్క జాగలల్ల ఆరుద్రలను ఒకొక్క పేరుతోని పిలుస్తుంటరు. "బాపని పురుగులు","కుంకుమ పురుగు", "బిరువబోటి", "ఎర్రపురుగు" అని తీరొక్క పేర్లతో పిల్శెటొళ్లు. చిత్రం ముచ్చటేందంటే.. అవి ఏడికెళ్లొస్తయో.. ఎట్లొస్తయో తెల్వదుగానీ.. కరెక్టు కార్తె సమయానికి వచ్చి రైతు కళ్లలో ఆనందాన్ని చూపిస్తయి.

గుర్తుకొస్తున్నాయి..

90s కిడ్స్‌కైతే ఆరుద్ర పురుగులతో మంచి అనుబంధం ఉంటుంది. అందుకే వాటిని ఫొటోలు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బిజీలైఫ్‌లో కాలాన్ని.. కార్తెలను.. వాటిని మోసుకొచ్చే ఆరుద్రల్లాంటి రైతు నేస్తాలను మరచిపోయిన ఎంతోమంది వాటిని చూసి మురిసిపోతున్నారు. ఒక్కసారిగా బాల్యంలోకి తొంగిచూసి గమ్మతయిన ఆరుద్రల గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. టెక్నాలజీ ఎంతొచ్చినా.. వాతావరణ శాఖ ఎన్ని సూచనలు చేసినా.. ఆరుద్రల్లాంటి కార్తె ఇండికేటర్స్ ఇచ్చే సమాచారమే రైతుకు విలువైనది కాబట్టే "ఆరుద్రలో అడ్డెడు చల్లితే పుట్టెడు పండుతయి" అనే నమ్మకం ఎప్పటికీ ఉంటుంది.




Next Story