కాన్పుల మధ్య అంతరం ఎంత ఉండాలి?

by Disha Web Desk 6 |
కాన్పుల మధ్య అంతరం ఎంత ఉండాలి?
X

దిశ, ఫీచర్స్ : ప్రతి జంట ఆరోగ్యకరమైన గర్భధారణను కోరుకుంటుంది. ఇక్కడ మొదటి కాన్పు సంగతి పక్కనబెడితే రెండో బిడ్డ విషయంలో మాత్రం సరైన ప్రెగ్నెన్సీ గ్యాప్ అవసరం. అయితే ఇది మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు చాయిస్‌గా ఉంటే, మరికొన్నిసార్లు చాన్స్‌గా ఉంటుంది. వాస్తవానికి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 6 నెలల్లోపు గర్భం దాల్చకూడదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ కూడా సలహా ఇస్తున్నారు. కానీ అంతకంటే తక్కువ వ్యవధిలో రెండోసారి గర్భందాల్చితే అది తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో రైట్ ప్రెగ్నెన్సీ గ్యాప్‌ అంటే ఏమిటి? తక్కువ గ్యాప్ వల్ల తలెత్తే ప్రమాద కారకాలు ఏంటి? వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి?

గర్భాల మధ్య అంతరం కుటుంబ నియంత్రణలో ముఖ్యమైన భాగం. ఎందుకంటే మొదటి కాన్పు నుంచి తల్లి కోలుకునేందుకు, మరొక బిడ్డ కోసం తన శరీరాన్ని సిద్ధం చేసేందుకు ఇది అనుమతిస్తుంది. కాగా ఈ గ్యాప్ తక్కువగా ఉంటే కలిగేటువంటి కొన్ని ప్రమాద కారకాలు :

* అకాల జననం

* పుట్టుకతో వచ్చే రుగ్మతలు

* తక్కువ బరువుతో జననం

* ప్రసూతి రక్తహీనత

* ప్లాసెంటల్ అబ్‌రప్షన్

ఇవే కాకుండా ఈ రకమైన గర్భధారణ వల్ల రెండో కాన్పులో పుట్టిన పిల్లల్లో ఆటిజం ప్రమాదం పెరిగే అవకాశం ఉందని డాక్టర్ గోమ్స్ వెల్లడించాడు. 12 నెలల కంటే తక్కువ వ్యవధిగల గర్భాల విషయంలో ఈ తరహా లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువని ఆయన తెలిపారు. అంతేకాదు గర్భాల మధ్య అంతరం తక్కువైతే తల్లిపాలలో పోషక నిల్వలు క్షీణిస్తాయని, ఇది ఆయా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

జంట ఎంతకాలం వేచి ఉండాలి?

మరొక బిడ్డ కోసం ప్లాన్ చేసే ముందు మునుపటి గర్భం నుంచి తల్లి శరీరం సరిగ్గా కోలుకుందని నిర్ధారించుకోవాలి. అంతేకాదు భవిష్యత్‌తో గర్భధారణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు నివారించేందుకు గర్భాలకు మధ్య 18 నుంచి 24 నెలల విరామం తీసుకోవాలి. అలాగే అంతర వ్యవధి ఐదేళ్ల కంటే తక్కువగా ఉండాలి. ఇక 35 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న జంటలు తమ ప్రెగ్నెన్సీస్ మధ్య 12 నెలల అంతరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి మొదటి బిడ్డ లేదా రెండో బిడ్డ ఎప్పుడు కావాలో ఎంచుకోవడం అనేది వ్యక్తిగత ఎంపిక. ఈ విషయంపై భాగస్వాములిద్దరూ చర్చించుకోవాలి. ఆరోగ్యంగా ఉండి గర్భధారణకు సిద్ధమని భావిస్తే.. ఇదే విషయాన్ని డాక్టర్ కూడా ఆమోదిస్తే కాన్పు తర్వాత మరోసారి గర్భం దాల్చేందుకు రెండేళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కానీ అడ్వాంటేజెస్, డిస్‌అడ్వాంటేజెస్‌ను జాగ్రత్తగా బ్యాలన్స్ చేసుకోవాలి.

హెల్తీ ప్రెగ్నెన్సీని ఎలా నిర్ధారించాలి?

తల్లి శరీరం మరొక గర్భం కోసం తగినంత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకునేందుకు గర్భం దాల్చడానికి ముందే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమయంలో ఆహారంతో పాటు శారీరక, మానసిక శ్రేయస్సును కూడా పర్యవేక్షించాలి. ఆరోగ్యకరమైన గర్భధారణ కలిగి ఉండాలనుకుంటే ప్రినాటల్ కేర్ పొందడం కీలకమైనదే కాక ప్రభావవంతమైనది కూడా. ఎందుకంటే ఇది మీకు అవసరమైన మద్దతుతో పాటు సరైన డైరెక్షన్‌ను అందిస్తుంది.

Also Read : స్త్రీ పురుష సమానత్వం.. సాధ్యమేనా?



Next Story

Most Viewed