Health tips: స్లోగా పదివేల అడుగులు వేయడం కంటే వేగంగా నడవడమే మేలు

by Disha Web Desk 22 |
Health tips: స్లోగా పదివేల అడుగులు వేయడం కంటే వేగంగా నడవడమే మేలు
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజు ఓ అరగంట నడిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్పే మాట. కానీ ఒక రోజులో ఎన్ని అడుగులు నడిచారనేది ముఖ్యం కాదని, ఎంత వేగంగా నడిచారనేది ప్రయోజనం కలిగిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. సిడ్నీ యూనివర్సిటీ చార్లెస్ పెర్కిన్స్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ మేరకు 40 నుంచి 79 ఏళ్ల వయసు గల 78,500 మంది యూకే అడల్ట్స్ నుంచి సేకరించిన స్టెప్ కౌంట్ డేటా ఆధారంగా వారి ఏడేళ్ల ఆరోగ్య ఫలితాలను విశ్లేషించి ఈ రిజల్ట్‌ పొందారు.

వ్యక్తులు ఏడు రోజుల వ్యవధిలో కనీసం మూడు రోజుల పాటు తమ శారీరక శ్రమను కొలిచేందుకు మణికట్టు యాక్సిలరోమీటర్‌ ధరించారు. నిద్రపోతున్నపుడు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగింది. అయితే రోజుకు 10,000 అడుగులు వేయడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం 50 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. శారీరక శ్రమ గుండె, మెదడు ఆరోగ్యానికి సంబంధించి గరిష్ట ప్రయోజనాలను కలిగి ఉందని అధ్యయనం హైలైట్ చేసింది. వాస్తవానికి రోజుకు 3,800 అడుగులు మాత్రమే చిత్తవైకల్య ప్రమాదాన్ని 25 శాతం తగ్గించడంతో పాటు హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదాన్ని 8 నుంచి 11 శాతం తగ్గించాయి. అయినప్పటికీ నడకలో వేగం మొత్తం అడుగుల గణన కంటే ఎక్కువ ప్రయోజనాలను చూపింది. కేవలం 30 నిమిషాలు నడిచే వ్యక్తులు కూడా వేగంగా నడవడం వల్ల డైలీ 10,000 అడుగులు వేయడంతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందారు.

ఇవే విషయాన్ని వివరించిన అధ్యయన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ అహ్మదీ.. 'కొన్నిసార్లు 10,000 అడుగులను పూర్తిచేయడం చాలా కష్టం. కాబట్టి కొద్దిపాటి సమయంలోనే వేగంగా నడవగలిగితే 10K మార్క్‌‌ను పూర్తిచేస్తున్నవారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆ 10 వేల అడుగులను సైతం వేగంగా నడవగలిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు సొంతమవుతాయి' అని చెప్పారు.



Next Story

Most Viewed