Health Tips : ఆస్తమాతో అవస్థలా.. రిలీఫ్ కోసం ఈ ఆసనాలు ట్రై చేయండి!

by Javid Pasha |

Health Tips : ఆస్తమాతో అవస్థలా.. రిలీఫ్ కోసం ఈ ఆసనాలు ట్రై చేయండి!

Health Tips : ఆస్తమాతో అవస్థలా.. రిలీఫ్ కోసం ఈ ఆసనాలు ట్రై చేయండి!
X

దిశ, ఫీచర్స్ : ఆస్తమా.. ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇదొకటి. కలుషిత వాతావరణం, ఆహారపు అలవాట్లు, దీర్ఘకాలికంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు, రసాయనాలకు గురికావడం వంటివి కూడా క్రమంగా ఆస్తమాకు దారితీస్తాయి. బాధితుల్లో శ్వాస పరమైన ఇబ్బందులు, ఛాతీ బిగుతుగా అనిపించడం, కఫం, ఊపిరితిత్తుల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వైద్యపరంగా తగిన చికిత్స అందుబాటులో ఉంది. అయితే కొన్ని యోగాసనాలు కూడా ఆస్తమా బాధితులకు ఉపశమనం కలిగిస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

* వృత్తాసనం లేదా సెమి సర్కిల్ : ఈ ఆసనం రోజూ ప్రాక్టీస్ చేస్తే శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఒకేసారిగా కాకుండా నెమ్మదిగా ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. రోజూ మూడు నుంచి నాలుగు సార్లు ఈ ఆసనం వల్ల ఆస్తమాతోపాటు వెన్ను, భుజం నొప్పులు కూడా తగ్గుతాయి. అయితే దీనిని వేసేందుకు ముందుగా నేలపై నిటారుగా నిలబడాలి. తర్వాత రెండు కాళ్లమధ్య భుజం దూరం ఉంచాలి. అదే సందర్భంలో మీ రెండు చేతుల అరచేతులను కలిపి ఉంచాలి. తర్వాత శ్వాస పీల్చేటప్పుడు రెండు చేతులను నడుముపై ఉంచి ఊపిరి పీల్చుకుంటూ చేతులను కాస్త వెనక్కి లాగాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ నడుము నుంచి‌పై భాగాన్ని వంచి 10 నుంచి 15 సెకన్లు అదే స్థితిలో ఉంచాలి. తర్వాత శ్వాసను వదులుతూ.. పై భాగాన్ని అసలు స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత రెండు చేతులను థాయ్ దగ్గర ఉంచి, రెండు కాళ్లను ఒకే దగ్గరకు చేరర్చాలి.

*హస్తోత్తాసనం : దీనిని ప్రాక్టీస్ చేయడానికి యోగా మ్యాట్‌పై (క్షితిజ దండనాసన స్థితి) మీ రెండు పాదాలను భూమికి సమాంతరంగా ఉంచాలి. రెండు కాళ్లమధ్య భుజం దూరం ఉండాలి. దీంతోపాటు రెండు చేతులను వెనుకవైపు నుంచి బాడీకి సపోర్ట్ ఇచ్చేలా చేయండి. తర్వాత గాలి పీల్చేటప్పుడు, రెండు కాళ్లను ఒకే దగ్గరకు చేర్చి, రెండు చేతులను పక్కకు పెట్టి క్షితిజ దండనాసన స్థితిని ఏర్పర్చుకోవాలి. ఇక శ్వాస వదులుతూ.. రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి. ఈ ఆసనం చేసేవారిలో ఆస్తమాతోపాటు గర్భాశయ, నడుము నొప్పి, భుజం నొప్పి, ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

*మత్స్యాసనం : శ్వాసకోశ ఇబ్బందులను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని యోగా నిపుణులు చెబుతుంటారు. ఇది వేసేందుకు ముందుగా మీరు యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. తర్వాత క్షితిజ శవాసన స్థితిని ఏర్పర్చుకొని, రెండు పాదాలను, రెండు చేతుల అరచేతులతో కలిపి నేలవైపు ఉంచాలి. తర్వాత స్లోగా నార్మల్ బ్రీతింగ్ ప్రాసెస్‌తో రెండు చేతులను మోజేతుల నుంచి ముందు వైపునకు అంటే భుజాల దగ్గర ఉంచాలి. గాలి పీల్చేటప్పుడు శరీరాన్ని కొద్దిగా పైకి ఎత్తి, తలపై భాగాన్ని కిందకు దించాలి. రోజూ రెండుమూడుసార్లు ఇలా చేస్తే ఆస్తమా నుంచి రిలీఫ్ పొందుతారని నిపుణులు అంటున్నారు. అయితే ఆస్తమా నుంచి ఉపశమనానికి యోగాసనాలు మంచివే. కానీ ఇవి అందరి శరీర తత్వానికి ఒకేలా వర్తించకపోవచ్చు. వ్యక్తుల్లో శ్వాస స్థాయిలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహాల తర్వాత మాత్రమే ప్రయత్నించడం ఉత్తమం.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story