- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ తీరం నుంచి.. క్రికెట్ కోచ్ కల్యాణి.!
ఆంక్షల కంచెను దాటుకొని వచ్చి తన విజయంతో సమాజ అభిప్రాయాలను పటాపంచలు చేసింది

దిశ, ఫీచర్స్: క్రికెట్ అంటే మగవాళ్లదే అనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది సొసైటీలో. కొందరు దీన్ని బ్రేక్ చేసినప్పటికీ జనాల ఆలోచనా విధానంలో పెద్దగా మార్పు రాలేదు. అలాంటి ఆంక్షల కంచెను దాటుకొని వచ్చి తన విజయంతో సమాజ అభిప్రాయాలను పటాపంచలు చేసింది విశాఖపట్నానికి చెందిన క్రికెట్ కోచ్ కల్యాణి.
అమ్మాయికి క్రికెటా.?
కల్యాణికి చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఇష్టం. ఏడేళ్ల వయసులోనే గల్లీ బాయ్స్‌తో కలిసి క్రికెట్ ఆడేది. కానీ చాలామంది కామెంట్ చేసేవాళ్లు. "క్రికెట్ అబ్బాయిలు ఆడేది. అమ్మాయిలు ఆడేది కాదు. అబ్బాయిలతో నీకేం పని.. హాయిగా ఇంట్లో టీవీ చూసుకుంటూ కోర్చోక" అనేవాళ్లు. చేతిలో బ్యాట్ పట్టుకొని.. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్ కు వెళుతుంటే "అమ్మాయివి నీకెందుమ్మా" అని సూటిపోటి మాటలు అని నిరుత్సాహ పరిచేవాళ్లు. కల్యాణికేమో బ్యాట్‌తో బాల్‌ను కొడితే బౌండరీ దాటిపోవాలి అనేంత కసి ఉండేది. కల్యాణి కసిని వాళ్ల నాన్న, అన్న అర్థం చేసుకున్నారు.
ఛాలెంజ్‌గా తీసుకొని..
క్రికెట్ పట్ల కల్యాణికున్న ఆరాధన.. పట్టుదలను చూసి అప్పట్నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చింది కుటుంబం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ వచ్చింది. జిల్లాస్థాయి క్రికెట్ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు "నీతో కాదులే.. ఎంపిక అవడం కష్టమే" అని జోక్ చేశాడు వాళ్లన్న. కానీ కల్యాణి దీనిని సీరియస్‌గా తీసుకుంది. దీన్నొక ఛాలెంజ్‌గా భావించింది. జిల్లా స్థాయి ఒక్కటే కాదు.. స్టేట్ లెవల్ వరకు ఎదిగింది. ఇక తర్వాత జాతీయ జట్టుకు సారథ్యం వహించడమొక్కటే ఆమె ముందున్న లక్ష్యం. తన కల సాకారం చేసుకునేందుకు ఎంతో కఠోర సాధన చేసేది.
యాక్సిడెంట్‌తో కల చెదిరింది..
క్రికెట్లో రాణించి భారత మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే సంకల్పంతో ఉన్న కల్యాణికి పెళ్లి రూపంలో పెద్ద ఆటంకం వచ్చింది. 19 ఏళ్లకే తనకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటిదాక ఎంకరేజ్ చేస్తూ వచ్చిన పేరెంట్స్ "ఇక చాలు" అన్నారు. భర్త కూడా "క్రికెట్ వద్దు ఇంటిపట్టునే ఉండు" అని చెప్పేశాడు. క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక.. భర్త ఆఫీసుకు వెళ్లగానే గ్రౌండ్‌కు వెళ్లేది. ఆ తర్వాత కల్యాణికి పాప పుట్టింది. జట్టు యాజమాన్యం రెండేళ్లు అవకాశం ఇచ్చింది. కానీ పదకొండు నెలల తర్వాత యాక్సిడెంట్ అయ్యి భారత జట్టు జెర్సీ కలగా మిగిలిపోయింది.
కోచ్‌గా మరో మలుపు..
జీవితంలో మళ్లీ క్రికెట్ ఆడలేనని బాధపడుతున్నప్పుడు స్నేహితురాలు కవిత కోచింగ్ గురించి చెప్పింది. బీసీసీఐ ప్రోత్సాహం.. అకాడమీ అవకాశాలు చూసి ఉచిత శిక్షణ మొదలుపెట్టింది. పాఠశాలలకు వెళ్లి బాలికలను ఎంపికచేసుకొని వాళ్లకు శిక్షణ ఇచ్చింది. తర్వాత పూర్తి స్థాయి కోచ్‌గా ఎసీఏ-వీడీసీఏ అకాడమీలో చేరింది. బాలురతో ఆడిస్తూ ఫీల్డింగ్.. పవర్ హిట్టింగ్.. రన్నింగ్ స్పీడ్ మెరుగుపరుస్తుంది. లెవెల్-3 కోచ్‌లతో వన్-ఆన్-వన్ శిక్షణ ఏర్పాటు చేస్తుంది. విజయనగరాన్ని భారత మహిళల క్రికెట్ హబ్‌గా మార్చేందుకు మిథాలీ రాజ్ సూచనల మేరకు ఫుడ్.. ఫిట్‌నెస్.. ఫీల్డింగ్ మీద దృష్టి పెడుతోంది.






