తల్లికి క్యాన్సర్ వస్తే.. ఆమె కోసం ఖప్లీ గోధుమలకు పునరుజ్జీవం పోసింది.!

by Daayi Srishailam |

దీనినొక వ్యవసాయ ఉద్యమంగా మార్చింది

తల్లికి క్యాన్సర్ వస్తే.. ఆమె కోసం ఖప్లీ గోధుమలకు పునరుజ్జీవం పోసింది.!
X

దిశ, ఫీచర్స్: వైశాలీ పాటిల్ తన తల్లి పట్ల ప్రేమతో జల్గావ్‌లో ఖప్లీ గోధుమల పునరుజ్జీవనం పోసింది. రెండు ఎకరాల నుంచి ప్రారంభమై.. ఇప్పుడు 1500 ఎకరాల వరకు ఖఫ్లీ గోధుమల సాగు విస్తరించింది. దీనినొక వ్యవసాయ ఉద్యమంగా మార్చింది.

పురాతన ధాన్యం..

జల్గావ్‌లోని రావేర్ తాలూకాలోని దస్నూర్ గ్రామం. వారసత్వ ధాన్యాలపై ఎటువంటి అనుభవం లేని వైశాలీ పాటిల్.. ల్యూకేమియాతో పోరాడుతున్న తన తల్లిని బతికించుకునేందుకు 2018లో రెండు ఎకరాల్లో ఎమ్మర్ గోధుమలను సాగుచేసింది. వీటినే స్థానికంగా ఖప్లీ అని పిలుస్తారు. తల్లిపై ప్రేమతో మొదలైన ఈ ప్రయత్నం తదనంతరం జల్గావ్ వ్యవసాయ గుర్తింపును మార్చే ఒక ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఖప్లీ గోధుమ ప్రపంచంలోని అతి పురాతన ధాన్యాలలో ఒకటి. వీటిలో అధిక ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

వ్యవసాయ బాధ్యత..

ఖఫ్లీ గోధుమలను మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె రోగులకు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తారు. తన తల్లి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైశాలి రెండు ఎకరాలలో ఖఫ్లీ సాగు స్టార్ట్ చేసింది. ఇది అంత సులభమైనది కాదని తనకూ తెలుసు. కాకపోతే అదితప్ప ఆమెకు వేరే ప్రత్యామ్నాయం లేదు. 2000లో వాళ్ల నాన్న చనిపోయాడు. వ్యవసాయ బాధ్యత తన అన్నపై పడినప్పటికీ అతడు మద్యానికి బానిసై కొంతకాలానికి చనిపోయాడు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసిన వైశాలి కుటుంబ.. వ్యవసాయ బాధ్యతను తీసుకుంది. తన అన్న చేసిన అప్పులను తీర్చి.. కుటుంబాన్ని చక్కదిద్దింది.

నిపుణుల సూచనతో..

అంతా బానే ఉంది అనుకునే సమయానికి 2016లో వైశాలి తల్లికి ల్యూకేమియా నిర్ధారణ అయింది. ఖఫ్లీ గోధుమలతోనే దానికొక పరిస్కారం అని చెప్పారు వైద్యులు. వైశాలీ ఖప్లీ గోధుమల కోసం అన్వేషించింది. ఒకప్పుడు విస్తృతంగా పండించబడినప్పటికీ ఇప్పుడది అందరూ మరచిపోయిన పురాతన ధాన్యం. సాధారణ గోధుమ రకాల కంటే ఖప్లీలో ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉండి జీర్ణం కావడం సులభం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి సున్నితంగా ఉంటుంది. శరీరంలో శక్తిని నెమ్మదిగా విడుదల చేసి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

1500 ఎకరాలలో..

వైశాలి తన తల్లి ఆరోగ్యం కోసం 2018లో ఖప్లీ విత్తనాలను నాటింది. విత్తనాలను పూనేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి 40 కిలోలను సమకూర్చుకుంది. 2019 జనవరిలో మొదటి పంట 20 క్వింటాళ్లు దిగుబడిని ఇచ్చింది. అది కుటుంబ అవసరాలకు.. విత్తనాలను ఆదా చేయడానికి సరిపోయింది. 2019లో వ్యవసాయ శాఖ ఈవెంట్‌లో తన సాగు విధానం రైతుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2020 నాటికి జల్గావ్, బరామతి, నాసిక్, మధ్యప్రదేశ్, తెలంగాణ నుంచి రైతులు వైశాలీ నుంచి విత్తనాలను సమకూర్చుకున్నారు. ఇప్పుడామె 1500 ఎకరాలలో ఖఫ్లీ గోధుమల సాగు చేస్తోంది.

వందలాది రైతులకు..

2021లో వైశాలీ భారతదేశంలో ఖప్లీ గోధుమ కోసం సీడ్ డీలర్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ప్రభురామ్ బచత్ గట్ స్వయం సహాయక గ్రూప్ ద్వారా జల్గావ్‌లోని వ్యవసాయ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి 20 క్వింటాళ్ల విత్తనాలను.. అమరావతి ఆత్మా ప్రాజెక్టుకి 10 క్వింటాళ్లను విక్రయించింది. ఇప్పుడు జల్గావ్‌లో 12 కేంద్రాలలో ఖప్లీ గోధుమ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వందలాది రైతులకు ఈ పంటను అందుబాటులోకి తెచ్చాయి. ఆత్మా ప్రాజెక్టు ద్వారా విత్తనాలను అందించే సౌకర్యం అందుబాటులో ఉంది.

Next Story