చోటూ కీ ఎడ్యుకేషన్.. వీధి బాలలకు విద్యా బుద్ధులు.!

by Daayi Srishailam |

వీధుల్లో భిక్షాటన చేసే పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా..

చోటూ కీ ఎడ్యుకేషన్.. వీధి బాలలకు విద్యా బుద్ధులు.!
X

దిశ, ఫీచర్స్: రోజూ చూస్తూనే ఉంటాం.బడికి వెళ్లాల్సిన పిల్లలు.. చిత్తు కాగితాలు ఏరుకుంటూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పైసలు అడుక్కుంటూ కనిపిస్తుంటారు. బడిలో పాఠాలు నేర్చుకునే వయసు.కానీ ఏం చేస్తాం దురదృష్టం. అందరూ అలా దురదృష్టం అని వదిలేస్తే ఎలా.? అందుకే కదిలారు ఇద్దరు మహిళలు. వీధి బాలలకు చదువుచెప్పి బంగారు భవిష్యత్‌ను ఇస్తున్నారు.

హైదరాబాద్ కేంద్రండా వీధి బాలల జీవితాలు మార్చుతున్న ఆ ఇద్దరు మహిళలే యువనేశ్వరి కనగసబాపతి, రమణ మాధవి శంకర. ఒకరిది తమిళనాడు. ఇంకొకరిది ఆంధ్రప్రదేశ్. వీధుల్లో భిక్షాటన చేసే పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా.. వారి భవిష్యత్‌ను మార్చే ఒక గొప్ప ఉద్యమాన్ని వీరు ప్రారంభించారు.

2016లో తొలి అడుగులు..

కూకట్‌పల్లిలో యువనేశ్వరి, మాధవి స్థాపించిన "చోటూ కీ ఎడ్యుకేషన్" నడుస్తోంది. దీనిని 2016లో ప్రారంభించారు. వీధి బాలలకు దూరపు కల అయిన, అసాధ్యమైన ఆశయంగా ఉన్న చదవడం, రాయడం, కవితలు, గణిత సమస్యలను పరిష్కరించడం వంటివి అందిస్తూ వారు కూడా కలలు కనేలా చేస్తున్నారు. యువనేశ్వరి ఫార్మాసూటికల్ రీసెర్చీలో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడింది. చెన్నయ్‌లో పోస్ట్ గ్రాడ్యయేట్ చేస్తున్న సమయంలో అనాథాశ్రమాలు, ఆశ్రయ గృహాలను సందర్శించేది. మాధవి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌‌లో పనిచేస్తూ తన జీవితంలో ఏదో చేయాలని అన్వేషిస్తుంది.

ఇద్దరి లక్ష్యం ఒకటే..

మాధవి కుటుంబంలో చాలామంది డాక్టర్లుగా స్థిరపడి వైద్యపరంగా పేదల కోసం ఉచిత శిబిరాలు నిర్వహించేవాళ్లు. అలా చిన్నప్పుడే విద్యార్థుల సమస్యలేంటో స్వయంగా చూసింది. యువనేశ్వరి కూడా ఆశ్రమాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తూ ఉండేది. వీధుల్లో భిక్షాటన చేస్తున్న పిల్లలను చూసినప్పుడు చదువొక్కటే ఇలాంటి సామాజిక అసమానతలను రూపుమాపగలదని వారు అనుకున్నారు. ఒక మహిళా దినోత్స కార్యక్రమంలో వీళ్లిద్దరూ కలుసుకున్నారు. మాధవి ఆసక్తిని తెలుసుకున్న యువనేశ్వరీ "వీధి బాలల కోసం విద్యా కార్యక్రమం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది" అనే ప్రతిపాదన తీసుకొస్తే "ఓకే" చెప్పింది మాధవి.

భిక్షాటనకు భంగం లేకుండా..

"చోటూ కీ ఎడ్యుకేషన్" 2016లో ప్రారంభించినప్పుడు ఒక అధికారిక సంస్థగా కాకుండా వారాంతాల్లో పనిచేసే సంస్థగా ఉండేది. పాఠశాల డ్రాపవుట్స్, ఎన్నడూ తరగతి గదిలోకి అడుగే పెట్టని పిల్లల కోసం పనిచేసేది. ఉదయం 7:30 గంటలకే తరగతులు ప్రారంభమయ్యేవి. కేపీహెచ్‌బీ కాలనీలోని పేదల ఇండ్లలోకి వెళ్లి తమ పిల్లలకు చదువుచెప్తామని తల్లిదండ్రులను అడిగితే వారొక షరతు పెట్టారు. పిల్లల భిక్షాటన సమయానికి భంగం చేయకూడదనే షరతుకు కట్టుబడి ఉదయం 7:30కే క్లాస్లులు ప్రారంభించారు. 10 గంటల తర్వాత వదిలేస్తే ఆ పిల్లలకు భిక్షాటనకు వెళ్లేవారు.

అయినా డ్రాపౌట్స్..

అధికారిక తరగతి గది లేకపోవడంతో ఫుట్‌పాత్‌లపై, తాత్కాలిక షెల్టర్ల కింద, లేదా ప్రశాంతమైన ప్రదేశమేదైనా ఉంటే అక్కడ తరగతులు నిర్వహించారు. క్రమంగా ఈ కార్యక్రమం గురించి తెలిసి, ఆసక్తిగలవారు ఆగి చూసేవాళ్లు. కొందరు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 2019 నాటికి అది అధికారిక సంస్థగా రూపుదిద్దుకుంది. జీడిమెట్ల, బొల్లారం, మియాపూర్, నిజాంపేట్లో కొత్త లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించారు. అయితే వృద్ధితో పాటు కొత్త సవాళ్లు కూడా వచ్చాయి. బ్రిడ్జింగ్ క్లాసెస్ తర్వాత స్కూళ్లలో చేరిన చాలామంది పిల్లలు ఇతర విద్యార్థులతో సర్దుకోలేక మళ్లీ డ్రాపవుట్ అయ్యారు.

చదువొక్కటే కాదు..

తాత్కాలిక విద్య సరిపోదని తెలుసుకొని ఫుల్ టైం లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించారు. 10వ తరగతి ఓపెన్ పరీక్షలకు సిద్ధం చేసేలా ఒక పూర్తిస్థాయి పాఠశాలగా మారింది. నాలుగు లెర్నింగ్ సెంటర్లు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. ప్రతీ సెంటర్లో ఒక పుల్ టైం టీచర్ విద్యా బోధనతో పాటు పిల్లలతో సన్నిహిత సంబంధాల్ని పెంపొందిస్తారు. "మీ టైమ్" అనే రిఫ్లెక్టివ్ సెషన్ కూడా ఉంటుంది. పిల్లలు తమ ఆలోచనలను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే సెషన్ ఇది. చదువుతో పాటు వ్యక్తిగత శుభ్రత, లింగ సమానత్వం, విలువలు నేర్పస్తున్నారు.

Next Story