చేనేత అవార్డుల పుట్టపాక.. మరో ఇద్దరికి జాతీయ పురస్కారాలు.. ఆగస్టు 7న ప్రదానం

by Javid Pasha |

చేనేత అవార్డుల పుట్టపాక.. మరో ఇద్దరికి జాతీయ పురస్కారాలు.. ఆగస్టు 7న ప్రదానం

చేనేత అవార్డుల పుట్టపాక.. మరో ఇద్దరికి జాతీయ పురస్కారాలు.. ఆగస్టు 7న ప్రదానం
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : పుట్టపాక .. జాతీయ, రాష్ట్ర చేనేత పురస్కారాలకు అడ్డాగా మారింది. ప్రతి ఏటా ఆ గ్రామవాసులు లేకుండా చేనేత అవార్డుల జాబితా లేదంటే అతిశయోక్తి కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో అత్యధిక కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. చేనేత రంగంలో కొత్త ఒరవడులను సృష్టిస్తూ వరుసగా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారాలు - 2024కు పుట్టపాక గ్రామానికి చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద , యువ చేనేత విభాగంలో గూడ పవన్ ఆగస్టు 7న రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోనున్నారు.

రూ. 8 కోట్ల టర్నోవర్

పుటపాక గ్రామానికి చెందిన గజం నర్మద హైదరాబాదులో నరేందర్ హ్యాండ్లూమ్స్ పేరుతో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నది. ప్రతిఏటా చేనేత వస్త్రాల అమ్మకంలో 8 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత అవార్డుల-2024 పురస్కారంలో మార్కెటింగ్ విభాగంలో ఆమెకు అవార్డు వరించింది. ఆమె 2013 సంవత్సరం నుంచి చేనేత వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు.

సహజరంగుల చీర

పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ సహజ సిద్ధమైన రంగులను పట్టుదారానికి అద్ది జిఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్ తో పట్టుచీరను నేశారు. ఈ చీరలు ప్రాచీన సంప్రదాయం ప్రతిబింబించి ఆకృతులు అద్ది ముడతలు పడని మృదుత్వంతో చీరను రూపొందించారు. మార్చి నెలలో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట మగ్గంపై వస్త్రాన్ని నేశారు. ఇందుకుగాను పవన్ ను జాతీయ చేనేత పురస్కారం 2024 లో యువ చేనేత విభాగంలో ఎంపిక చేశారు. ఇతని తండ్రి శ్రీను కూడా 2010 సంవత్సరంలో జాతీయ చేనేత పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

40 మందికి పైగా పురస్కారాలు

చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకుగాను ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అవార్డులను ప్రకటిస్తున్నాయి. అందులో పుట్టపాక గ్రామానికి చెందిన సుమారు 40 మందికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. చేనేత కళా రంగంలో విశేష కృషి చేసినందుకుగాను గజం అంజయ్య, గజం గోవర్ధన్ కు పద్మశ్రీ అవార్డులు కూడా వరించాయి. చేనేతరంగానికి చెందిన కొలను రవీందర్,వెంకయ్యలు కూడా గతంలో రాష్ట్రపతి అవార్డులను పొందిన వారిలో ఉన్నారు. వీరంతా కూడా ప్రత్యేక డిజైన్ ను రూపకల్పన చేయడంతోనే అవార్డులు పొందారు.

సరికొత్త డిజైన్లతో : - గజం నర్మద, పుట్టపాక, జాతీయ చేనేత అవార్డుకు ఎంపికైన మహిళ

సరికొత్త డిజైన్లను రూపొందించడంతో చేనేత వస్త్రాలలో మంచి మార్కెటింగ్ పొందవచ్చు. నా భర్త నరేందర్ నా నైపుణ్యాన్ని గుర్తించి ఈ రంగంలో ప్రోత్సహించారు. ఆయన సహకారంతోనే రూ. 8 కోట్ల బిజినెస్ చేయగలిగాను. సుమారు 300 మంది చేనేతలు నాకు పూర్తిగా సహకరించడంతోనే ఈ విజయం వరించింది. ఆ కుటుంబాలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుంది. మహిళలు తమ సరికొత్త ఆలోచనలతో చేనేత వస్త్రాల మార్కెటింగ్ లోకి రావాలని ఆశిస్తున్నా. జాతీయ అవార్డుకు ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది.

నాన్న స్ఫూర్తితోనే : - గూడ పవన్, పుట్టపాక, జాతీయ యువ చేనేత అవార్డుకు ఎంపికైన వ్యక్తి

సహజసిద్ధమైన రంగులతో చేనేత వస్త్రాలను తయారు చేయడంతో మంచి మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి. పవర్లూమ్,రసాయన రంగుల జోలికి వెళ్లకుండా చేనేత వృత్తి చేపట్టాలి. నేను ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపి వేసి మా నాన్న స్ఫూర్తితో ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. 26 సంవత్సరాల వయసులో నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. యువత సరికొత్త డిజైన్ లను రూపొందించి సహజ సిద్ధమైన రంగులను వాడితే ఈ వృత్తిలో మంచి భవిష్యత్తు ఉంటుంది.


Next Story