నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే స్కిజోఫ్రీనియానే.!

by Daayi Srishailam |

ఇది దయ్యం కాదు.. భూతం కాదు.. మానసిక సమస్య.

నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే స్కిజోఫ్రీనియానే.!
X

ఉన్నట్టుండి ఎవరైనా అనారోగ్యానికి గురైతే..

"దయ్యం పట్టిందేమో" అనుకుంటారు.

ఇరుగు పొరుగు భయపడతారు.

ఐతే.. ఇది దయ్యం కాదు..

భూతం కాదు..

మానసిక సమస్య.. దానిపేరు స్కిజోఫ్రీనియా అని చెప్తున్నారు మానసిక నిపుణులు.

దేశంలో ఆరోగ్యం గురించి ఇంతలా చర్చలు జరుగుతున్నప్పటికీ స్కిజోఫ్రీనియా ఇంకా నీలి నీడల్లోనే ఉంది.

జనాల్లో ఉన్న అపోహలు తొలిగిపోతేనే వాస్తవ జీవితంలోకి వస్తారు.

ముందు ఆ అపోహలేంటో చూద్దాం.

- దిశ, ఫీచర్స్

అపోహ 1: స్కిజోఫ్రీనియా అంటే స్ప్లిట్ పర్సనాలిటీ

స్కిజోఫ్రీనియా అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఒక మూఢ నమ్మకం. దీనిని డిస్సోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో గందరగోళం చేస్తారు. ఈ గందరగోళం కళంకానికి.. భయానికి చికిత్సలో జాప్యానికి దారితీస్తుంది. ఇందులో ఊహాజనిత దృశ్యాలు.. శబ్దాలు.. భ్రాంతులు.. అస్తవ్యస్త ఆలోచనలు.. సామాజిక విముఖత వంటి లక్షణాలు ఉంటాయి. ఎవరికీ వినపడని గొంతులు వీళ్లకు వినిపిస్తాయి. ఎవరో గమనిస్తున్నారే భ్రమతో ఉంటారు. వాస్తవికతను గ్రహించే.. స్పందించే విధానాన్ని మారుస్తుంది. సినిమాల్లో చూపించినట్లు వ్యక్తిత్వాలను మార్చుకోరు.. పూర్తిగా వేరొకరిగా మారరు.

అపోహ 2: స్కిజోఫ్రీనియా ఉన్నవారు చాలా డేంజర్

సినిమాలు చూసి ఇలా అనుకుంటారు జనాలు. సినిమాల్లో స్కిజోఫ్రీనియా ఉన్నవారిని హింసాత్మకంగా.. కోపంతో దాడిచేసినట్లుగా చిత్రీకరించి చూపిస్తారు. మనం అదే నిజం అనుకొని దయ్యం పట్టిందనుకుంటాం. వాస్తవానికి స్కిజోఫ్రీనియాతో ఉన్నవాళ్లు చాలా నిశ్శబ్దంగా.. సంక్లిష్టంగా.. ముభావంగా కనిపిస్తారు. సౌమ్యంగా.. ఒంటరిగా ఉంటారు. దూర ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపిస్తారు. ఎవరో తమను గమనిస్తున్నారనీ.. ఇంకెవరితోనో గుసగుసలాడుతున్నారనీ అనుకుంటారు. ఇది చూసి వాళ్లను డేంజర్ అని భావిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే.. తమకు అపరిచితంగా.. ఒత్తిడిగా అనిపించే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు నిపుణులు.

అపోహ3: సాధారణ జీవితం గడపలేరు

స్కిజోఫ్రీనియా నిర్ధారణ అయిందంటే జీవితం పూర్తిగా ఆగిపోతుందని కాదు. సరైన రక్షణ అందుబాటులో ఉంటే.. చాలామంది ఉద్యోగాలు చేస్తారు. మంచి మానవ సంబంధాలను కలిగి ఉంటారు. కుటుంబంతో చాలా చక్కగా ఉంటారు. స్వతంత్రంగ జీవిస్తారు. స్కిజోఫ్రీనియా శారీరక వ్యాధిలా కాదు. దానికి నివారణ ఉంటుంది. కోలుకోవడం ద్వారా ఈ మార్పు కనిపిస్తుంది. ఇక్కడ కోలుకోవడం అంటే లక్షణాల తగ్గింపు.. మెరుగైన పనితీరు.. అర్థవంతమైన జీవితంలోకి తిరిగిరావడం. ఇవన్నీ సాధ్యమయ్యేవే.. సాధారణ స్థితికి తీసుకొచ్చేవే.

అపోహ 4: మందులేస్తే సరిపోతుంది

మందులు వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కానీ స్కిజోఫ్రీనియా అనేది కేవలం వైద్య సమస్య కాదు. ఇది జీవ, మానసిక, సామాజిక కారకాల సమ్మేళనం. జీవశాస్త్ర పరంగా మెదడులో రసాయన అసమతుల్యత ఉంటుంది. మానసికంగా బాల్యంలో గాయం లేదా ఒత్తిడిని ఎదుర్కునే సామర్థ్యం లేకపోవడం. సామాజికంగా కుటుంబం.. సమాజం వ్యక్తిని చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టీ కోలుకోవడానికి మందులతో పాటు సైకోథెరపీ.. సామాజిక మద్దతు.. కుటుంబ అంగీకారం అవసరం. స్కిజోఫ్రీనియా అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్.

అపోహ 5: వారు ఎన్నటికీ కోలుకోరు

ఇది తప్పు. స్కిజోఫ్రీనియా దీర్ఘకాలిక స్థితి అయినప్పటికీ సరైన సంరక్షణ.. మద్దతుతో చాలామంది గణనీయంగా మెరుగుపడతారు. కొందరు ఫంక్షనల్ రికవరీ సాధిస్తారు. స్కిజోఫ్రీనియా అంటే అంతా అయిపోయిందనీ.. దయ్యం పట్టిందనీ అనుకోవద్దు. ముందు అదేంటో అర్థం చేసుకోవాలి. అదొక దీర్ఘమైన ప్రయాణం. సరైన మద్దతు ఉంటేనే దాంతో ఫైట్ చేయొచ్చు.. ఎక్కువ కాలం జీవించొచ్చు.

వీళ్లందరికీ దయ్య పట్టినట్లేనా.?

నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ఇండియాలో ప్రతి 1000 మందిలో ముగ్గురు స్కిజోఫ్రీనియాతో జీవిస్తున్నారు. అంటే 40 లక్షల మందికి పైగా. వీళ్లందరికీ దయ్యం పట్టినట్టేనా మరి.? వీరిలో చాలామంది అధికారిక రోగ నిర్ధారణ లేదా స్థిరమైన చికిత్స పొందలేరు కాబట్టే ఇలాంటి అపోహలు వస్తు్న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇండియాలో తీవ్రమైన రుగ్మతలతో బాధపడేవారిలో 75% మంది ఎలాంటి మానసిక ఆరోగ్య సంరక్షణను పొందడం లేదు. వ్యాధి కంటే దయ్యం పట్టిందని భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story