వంటింట్లో చపాతీలు చేయడం కాదు.. డ్రోన్లతో వ్యవసాయాన్నే మార్చేస్తున్నారు.!

by Daayi Srishailam |

వ్యవసాయాన్ని పండగ చేస్తూ "డ్రోన్ దీదీ" కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ విజయవంతమైన డ్రోన్ దీదీలుగా గుర్తింపు పొందుతున్నారు.

వంటింట్లో చపాతీలు చేయడం కాదు.. డ్రోన్లతో వ్యవసాయాన్నే మార్చేస్తున్నారు.!
X

దిశ, ఫీచర్స్: వ్యవసాయం ఒకప్పుడు మగవాళ్లే చేసేది. ఆడవాళ్లేమో కేవలం అన్నం తీసుకెళ్లేదంతే. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు రైతే రాజు కాదు.. రైతే రాణి. ఒకసారి ఈ డ్రోన్ దీదీలను చూడండి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సాగును ఎలా చక్కదిద్దుతున్నారో.?

పంటలకు ఎరువులు, పురుగుల మందులు చల్లడం, డ్రోన్లు నడపడం వంటి పనుల్లో మహిళలు తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా వ్యవసాయాన్ని పండగ చేస్తూ "డ్రోన్ దీదీ" కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ విజయవంతమైన డ్రోన్ దీదీలుగా గుర్తింపు పొందుతున్నారు.

మహిళా రైతులకు స్ఫూర్తి

35 ఏళ్ల షర్మిలా యాదవ్‌ది హర్యానాలోని పటౌడీ గ్రామం. ఆమె ఒకప్పుడు గృహిణి. వంటింటికే పరిమితం కాకుండా ఉన్నతమైన లక్ష్యాలతో కల సాకారం చేసుకోవాలనుకునేది. పంటల మీద డ్రోన్లు నడపడం ద్వారా తన కల సాకారమవుతుందని మాత్రం ఆమెప్పుడూ అనుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కార్యక్రమమైన "డ్రోన్ దీదీ" ద్వారా షర్మిల తమ ఊర్లో మొదటి సర్టిఫైడ్ ఉమెన్ డ్రోన్ పైలట్. ఇప్పుడామె పంటల మీద ఎరువులను వేగంగా, కచ్చితంగా చల్లుతోంది. డ్రోన్ డెస్టినేషన్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సహాయంతో షర్మిల శిక్షణ పొందింది. కేవలం ఐదు వారల్లోనే 150 ఎకరాలకు రెండుసార్లు ఎరువులు పిచికారీ చేసి సుమారు రూ.50000 సంపాదించింది. ఊర్లో "పైలట్" అని గౌరవంగా పిలుస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మార్పు సాధకురాలు

హర్యానాకు చెందిన నిషా సోలంకి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా వ్యవసాయ డ్రోన్లను నడపడానికి సర్టిఫికేషన్ పొందింది. నిషా కేవలం సర్టిఫికేట్ దగ్గరే ఆగిపోలేదు. వందలాది రైతులకు శిక్షణ ఇస్తూ డ్రోన్ల ద్వారా వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రదర్శనలు ఇస్తోంది. ఫార్మల్ డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ పొందిన తర్వాత డ్రోన్లతో పురుగుల మందులను త్వరగా పిచికారీ చేయడం గురించి, సాగు సామర్థ్యం మెరుగుపరచడం గురించి ట్రెయినింగ్ సెషన్స్ నిర్వహిస్తోంది. నిషా ఇప్పటివరకు 750 ప్రదర్శనలు ఇచ్చింది. నీటి వినియోగాన్ని 90శాతం వరకు తగ్గించడంతో పాటు ఒక ఎకరానికి కేవలం ఐదు నిమిషాల్లో చల్లడాన్ని పూర్తిచేసింది. ఒక స్థానిక రైతు నుంచి రాష్ట్రవ్యాప్త మార్పు సాధకురాలిగా మారింది నిషా.

విజయానికి నిదర్శనం

వారణాసిలో తొమ్మిదిమంది గ్రామీణ మహిళలు ఒక డ్రోన్ సేవా బృందాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ డ్రోన్లను నిర్వహించడానికి శిక్షణ తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఎరువులు, పురుగుల మందులు చల్లే సేవలను అందించడం ప్రారంభించారు. వారి డ్రోన్లు 10 నిమిషాల్లో 10 లీటర్ల పురుగుల మందును పిచికారీ చేస్తాయి. ఇది చాలా తక్కువ శ్రమతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని డ్రోన్ అకాడమీలో డ్రోన్ నిర్వహణ, భద్రత వంటి అన్ని అంశాల్లో సమగ్ర శిక్షణ పొందారు. 10 నెలల్లో వీళ్లు 2500 ఎకరాలకు సేవలందించి రూ.3.38 లక్షలు సంపాదించారు వీళ్లు. శ్రమ, ఖర్చులను తగ్గించడం, గ్రామీణ మహిళలు వ్యవసాయ టెక్నాలజీలో ముందుంటారని నిరూపించడం వారి విజయానికి నిదర్శనం.

స్వతంత్రంగా డ్రోన్ సేవలు

పంజాబ్, హర్యానాలోని 20 మందికి పైగా గ్రామీణ మహిళలు డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ విధానాన్ని మార్చేశారు. ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొంది ఎరువులు, పురుగుల మందులను చల్లుతున్నారు. యాంత్రీకరణ సౌకర్యంలేని ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మనేసర్ డ్రోన్ కేంద్రం నుంచి శిక్షణ, కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయంతో వీళ్లు సాంకేతిక నైపుణ్యాుల, ఆర్థిక మద్దతును పొంది స్వతంత్రంగా సేవలు అందించడం మొదలుపెట్టారు. ఒక ఎకరానికి రూ.200 నుంచి రూ.250 వసూలు చేస్తూ డ్రోన్ టెక్నాలజీ సరమైనదని నిరూపిస్తున్నారు. డ్రోన్ల ద్వారా సమయాన్ని ఆదాచేస్తూ సామర్థ్యాన్ని పెంచుతూ మహిళలు వ్యవసాయంలో శక్తివంతమైన టెక్ లీడర్లుగా ఉండగలరని నిరూపిస్తున్నారు.

లింగ సమానత్వం

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాల్లో 15 మంది మహిళా రైతులు వ్యవసాయ డ్రోన్లతో మార్పును తీసుకొచ్చి "లక్‌పతి దీదీలు"గా మారారు. స్థానిక రైతులకు డ్రోన్ ద్వారా మందులను చల్లడం ఎలాగో నేర్పిస్తున్నారు. 500 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కవర్ చేస్తూ సమగ్రంగా ఉత్పాదకతను అందిస్తున్నారు. డ్రోన్ సాగుతో ప్రతి మహిళ సంవత్సరానికి రూ.1 లక్ష వరకు సంపాదించింది. వాళ్లు సహాయం చేసిన రైతులు ఎకరానికి 24 నుంచి 30 క్వింటాళ్ల పంట దిగుబడి పెరుగుదలను, 15శాతం లాభాల పెరుగుదలను పొందారు. వీరి విజయం కేవలం వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా సామాజిక మార్పును, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది.

Next Story