తాగు నీటిలో మైక్రోప్లాస్టిక్‌లను తొలగించే అద్భుత మార్గం.. బెండకాయలు చాలు!

by Javid Pasha |

బెండకాయలోని సహజమైన జిగట గుణం నీటి కాలుష్యాన్ని తొలగిస్తుందని అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధనలో వెల్లడైంది.

తాగు నీటిలో మైక్రోప్లాస్టిక్‌లను తొలగించే అద్భుత మార్గం.. బెండకాయలు చాలు!
X

దిశ, ఫీచర్స్ : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్ ఉండవచ్చనే అనుమానాలున్నాయా? అయితే బెండకాయలలోని జిగట లాంటి పదార్థాన్ని తగిన మోతాదులో అందులో వేయండి. తర్వాత వడబోసి వాడండి అంటున్నారు కెమిస్ట్రీ సైంటిస్టులు. ఎందుకంటే బెండకాయ(okra)లో వాటిని తొలగించే సహజమైన లక్షణాలు ఉన్నాయని అమెరికన్ కెమికల్ సొసైటీ(ACS) పరిశోధనల్లో తేలింది. బెండకాయలోని సహజమైన జిగట గుణం నీటి కాలుష్యాన్ని కూడా తొలగిస్తుందని వెల్లడైంది.

జిగటలో దాగున్న అద్భుతాలు

బెండకాయల్లో జిగట(slime)గా ఉండే పదార్థం వాస్తవానికి పాలిసాకరైడ్స్‌తో నిండి ఉంటుంది. కాబట్టి ఇది నీటి కాలుష్యాన్ని తొలగించే శక్తివంతమైన పదార్థంగా ఉద్భవించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ జిగట నాన్-టాక్సిక్ ఫ్లాక్యులెంట్‌గా పనిచేసి, కాలుష్యం ఉన్న నీటిలో చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలను వేరు చేసి, వాటిని ఒక దగ్గర బంధించి(clump), నీటి దిగువకు చేరేలా చేస్తుంది. దీంతో నీటిని సులభంగా వడగట్టి మైక్రో ప్లాస్టిక్స్‌ను, ఇతర కాలుష్యాలను వడగట్టి తొలగించవచ్చు. ఇది సమద్రాలు, నదులు, భూ గర్భ జలాల నుంచి మైక్రోప్లాస్టిక్స్‌ను 90% వరకు తొలగించగలదని కూడా నిర్ధారణ అయినట్లు పరిశోధనలు పేర్కొంటున్నాయి.

సురక్షితమైన మార్గం

ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్స్ ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. లోతైన సముద్రాల నుంచి రోజువారీగా ఉపయోగించే తాగునీటి వరకు నీరు కలుషితం అవుతోంది. సాంప్రదాయ నీటి శుద్ధి పద్ధతుల్లో వాడే పాలీఅక్రిమైడ్ (polyacrylamid) వంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ హానికరమైన అవశేషాలను వదిలి మరిన్ని సమస్యలు సృష్టిస్తాయి. కానీ బెండకాయ ఎక్స్‌ట్రాక్ట్ పూర్తిగా బయోడిగ్రేడబుల్‌గా, సురక్షితమైనదిగా ఉంటుంది. తాజా నీటికి, సముద్ర పర్యావరణాలకు హాని చేయదని అమెరికన్ కెమికల్ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది.

నీటి వనరుల శుద్ధిలో..

బెండకాయ నీటికాలుష్యాన్ని తొలగిస్తుందని తెలియజేసిన పరిశోధన 2022లో జరిగింది. అయితే 2025 తర్వాత వచ్చిన ఫాలో అప్ స్టడీస్ ప్రకారం.. మెంతుల(Fenugreek)తో కలిపి ఉపయోగించడంవల్ల ఇది మరింత ఎఫెక్టివ్‌గా (సముద్ర నీటిలో 80%, భూగర్భ జలాల్లో 90% వరకు) పనిచేస్తుందని తేలింది. కాబట్టి ఈ ప్లాంట్ బేస్డ్ మెథడ్ పర్యావరణ హితమైనదే కాకుండా ప్రకృతి ప్రేరేపితమైనది కూడాను. పైగా సింథటిక్ రసాయనాలకంటే సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. భవిష్యత్తులో నీటిశుద్ధి (water treatment plants) ప్లాంట్లలో ఇలాంటి సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా సముద్రాలు, తాగునీరు శుభ్రంగా, కాలుష్య రహితంగా మార్చవచ్చునని, ఇది మైక్రో‌ప్లాస్టిక్ సమస్యకు ఒక ఆశాజనకమైన ఎకో-ఫ్రెండ్లీ పరిష్కారంగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.

Next Story