- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిమగల్ల.. మలీద ముద్దలు.!
ప్రేమలు వర్ధిల్లినంత కాలం మలీద ముద్దల రుచి మన నోటికి తాకుతూనే ఉంటుంది

దిశ, ఫీచర్స్: తెలంగాణది ప్రత్యేకమైన సంస్కృతి. కల్లుసాక ఎల్లమ్మ గుడే కాదు. బువ్వలేని అమ్మ బోనం వండి పోచమ్మకు పొర్లు దండాలు పెడతది. ఏరడ్డమొచ్చినా తన చెల్లెండ్లను బతుకమ్మ పండుగకు తీసుకొచ్చేందుకు ఏటికి ఎదురీదే అన్నలుంటరు. అమ్మచేత్తో చేసిన కమ్మని మలీద ముద్దలను కండ్లకద్దుకొని తింటరు. బతుకమ్మ బతికినంత కాలం.. ప్రేమలు వర్ధిల్లినంత కాలం మలీద ముద్దల రుచి మన నోటికి తాకుతూనే ఉంటుంది.
ప్రసాదం పంచుకొని..
బతుకమ్మ పండుగకు పూలెంత ముఖ్యమో.. ఆడబిడ్డల గాజుల సప్పుళ్లెంత ముఖ్యమో మలీద ముద్దలు కూడా అంతే ముఖ్యం. పూలకు పోతం. తంగేడు కోసం తపిస్తం. అందంగా బతుకమ్మను ముస్తాబు చేసి ఆడిపాడతం. "ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరీ ఉయ్యాలో" అని పాడుతూ బతుకమ్మను గంగమ్మలో కలిపేందుకు వెళ్లినప్పుడు వాగు ఒడ్డున అందరూ కలిసి పాటలు పాడతారు. ప్రతీ బతుకమ్మకు అగరబత్తీలు ముట్టించి "పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా.. మల్లొచ్చె యేడాది మల్లరావమ్మా" అని స్మరిస్తారు. ఈ క్రమంలో ఒకరికొకరు ప్రసాదాలు పంచుకుంటారు.
మలీద ముద్దల కోసం..
బతుకమ్మ వాయినంలో ఎక్కువగా "మలీద ముద్దలు" పెడతారు. ఇవెంతో రుచిగా ఉంటాయి. ఇప్పుడంతా తగ్గిపోయింది కానీ.. అప్పట్లో ఈ మలీద ముద్దల ప్రసాదం కోసమే పోరగాళ్లు బతుకమ్మల కాడికి పోతుండె. "అక్కా.. నీ బతుకమ్మ నేనేసొస్తా.. ప్రసాదం నాకే పెట్టాలె" అని ఇంటికాడనే ఒప్పందం చేసుకొని పోయేది. మామూలుగా అయితే సజ్జలు, తైదలు, బెల్లం, చెక్కరి, పూల పుట్నాల పప్పుతో ప్రసాదం చేసేటొళ్లు. ఎక్కువగా మలీద ముద్దలు చేద్దురు. మలీద ముద్దలు రొట్టె, బెల్లంతో చేస్తుండె. ఇప్పుడు పప్పు బెల్లాల రుచే చూస్తలేం ఇక మలీద ముద్దలెక్కడివి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ మలీద ప్రసాదమే చేస్తుండ్రు.
అచ్చుకుందాం.. పుచ్చుకుందాం..
బతుకమ్మల కాడికి తెచ్చిన ఏ ప్రసాదమైనా ఇంటికి తీసుకపోవద్దు.. అక్కడనే తినాలి అనేది అప్పుడు. అందుకే ఒకరి ప్రసాదం ఒకరు "అచ్చుకుందాం.. పుచ్చుకుందాం" అనుకుంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకునేది. వాగులకు తీసుకొచ్చిన ప్రసాదం తిరిగి ఇంటికి తీస్కపోతే మూతికి పండ్లయితయి.. గజ్జి తగులుతది అని అక్కడిదక్కడ్నే సాఫ్ చేసెటొళ్లు. అందుకనే పోరగాళ్లు పెద్ద బతుకమ్మ ఎవరిది ఉందో వాళ్ల దగ్గర లైన్లు కట్టేది. పెద్ద బతుకమ్మలు చేసెటొళ్లు ప్రసాదం రెండు గిన్నెలల్ల తీస్కొద్దురు. అలా వాళ్లు అచ్చుకుందాం పుచ్చుకుందాం అనేలోపే మల్లొకసారి పొయ్యి "అక్కా ప్రసాదం" అంటుండె.
పీర్లకాడ ఇదే ప్రసాదం..
మలీద ముద్దలు ఒక్క బతుకమ్మ కాడనే కాదు. పీర్ల పండుగకు అసలు ఇంటింటా మలీద ముద్దల ఘుమఘుమలు వచ్చేవి. అందరూ పీర్లకు ఈ మలీదతోని నైవేద్యం పెడుతుండె. ఇంకా పీర్ల సవార్లు ఉన్నొళ్లయితే పీర్లను నిమజ్జనం చేసినంక ఈ మలీద ప్రసాదం పంచిపెట్టెటొళ్లు. "ఏయ్.. నాకు.. నాకు" అని పోరగాళ్లు ఒకరిమీద ఒకరు పోటీలు పడి ఈ ప్రసాదం తీసుకొని కండ్లకద్దుకొని తింటుండె. వీటిని జొన్నరెట్టెలతోని, సజ్జ రొట్టెలతోని, చపాతీ రొట్టెలతోని చేస్తరు. కొందరు దర్గా దగ్గర "ప్యాతాలు" ఇస్తరు. దాంట్లో భాగంగా మలీద నైవేద్యం పెడతారు. పండగకు వచ్చినొళ్లందరికీ దీన్ని పంచిపెట్టి.. పవిత్ర పదార్థంగా భావిస్తరు.






