- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనదంతా ‘చెత్త’ ధోరణే.. ఇది చదివితే మీరు మారకతప్పదు..!
పేరుకుపోయిన చెత్తతో పేరూరు ఉద్ధరించని చెత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు.

భూ తగాదాలు..
నీటి తగాదాలు..
చాలా చూసి ఉంటాం.
కానీ..
ఫస్ట్ టైమ్ చెత్త తగాదాలు చూడాల్సి వస్తోంది.
చెత్త చేత.. చెత్త కొరకు.. చెత్త మనుషులు చేసే పరమ చెత్తే ఈ చెత్త పంచాయతీలు.!
వాళ్లింట్లో చెత్త వీళ్లింట్లో..
వీళ్లింట్లో చెత్త వాళ్లింట్లో.
అమ్మా తల్లీ మీరెందుకు కొట్టుకుంటారు ఆ చెత్తేంటో నా మొఖాన కొట్టండీ అని..
చెత్త కుండీలు ఎంత మొత్తుకున్నా వాటి జోలికిపోరు.
పైగా..
నువ్వుండవోయ్ చెత్తకు లేని దురద చెత్తకుండీకెందుకూ అన్నట్లు ఫేస్ పెడతారు.
పేరుకుపోయిన చెత్తతో పేరూరు ఉద్ధరించని చెత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు.
- దాయి శ్రీశైలం
చెత్త మూడు రకాలు. తడి చెత్త.. పొడి చెత్త.. ప్రమాదకర చెత్త. జనాల దృష్టిలో చెత్త వేరేగా ఉంది. అదికూడా మూడు రకాలే. మీ చెత్త.. మా చెత్త.. మంది చెత్త. ఎల్లమ్మ చెత్తంటే మల్లమ్మకు కోపం.. మల్లమ్మ చెత్తంటే మారమ్మకు చిరాకు. ఇదే కథ ఇక రోజూ. ఉత్తగా పొయ్యే చెత్త కోసం ఊరందరినీ పిలిచి పంచాయతీ పెట్టేదాక తీస్కెళ్తారు మహానుభావులు.!
చెత్త పనులు చేటు
మన ఇల్లు నీట్‌గా ఉండాలి. మనింట్లో చెత్తంతా పక్కోడింట్లో పడాలి. ఇలాంటి చెత్త పనులు చేసి మస్తు మురిసిపోతుంటారు మనొళ్లు. గుడ్లుకొట్టి గుభాళించే కూర వండుకుంటారు. ఆ గుడ్ల పొట్టును అటూ ఇటూ చూసి అమాంతం ఇంటి పక్కనో లేదా ఇంటి ముందో ఉన్న ఖాళీ జాగాలోకి జావెలిన్ థ్రో ఇసిరేసినట్లు ఇసిరేస్తారు. పిల్లల ముక్కు తుడిచి.. ముడ్డి తుడిచి డైపర్లు.. పాంపర్లు గోడవతల పడేస్తారు. అది ఎటు పోతుంది.. ఎవరింట్లో పడుతుందీ అనే కనీస పట్టింపు ఉండదు. ఇంట్లో పెద్ద దావత్ చేస్తారు. యాటను కోసి మటన్ మంచిగా వండుతారు. కానీ యాటను కోస్తే వచ్చే కసరు ఎక్కడ పడేస్తున్నాం.. పేగులు.. తోలు ఎక్కడ విసిరేస్తున్నాం అనే ఆలోచనే ఉండదు.
సోయి లేనే లేదు
ప్రతీ బస్తీలో లేదా ప్రతీ చౌరస్తాలో చెత్త కుండీలు ఎన్నో చూస్తుంటాం. కానీ అమ్మలక్కలు వాటిలో కాకుండా రోడ్డు పక్కన చెత్తను పడేసి పోతుంటారు. అంతెందుకు సర్కారు తడిచెత్త.. పొడిచెత్త కోసమని బకెట్స్ ఇచ్చింది కదా.? వాటిలో ఎప్పుడైనా చెత్తను వేసే పాపాన పోయారా మనొళ్లు.? పచ్చ బకెట్లో తడిచెత్త.. నీలం రంగు బకెట్లో పొడిచెత్త.. ఎరుపు రంగు బకెట్లో ప్రమాదకర చెత్తను వేర్వేరుగా వేయాలి. గ్రామ పంచాయతీ.. మున్సిపాలిటీ అధికారులు ఇలా చెప్పే ఈ బకెట్లను ఇంటింటికీ ఇచ్చారు. తడిచెత్త అంటే ఎంగిలి మెతుకులు.. కుళ్లిన పండ్లు.. ఆకులు.. కూరగాయల వేస్టేజీ. పొడి చెత్త అంటే కాగితాలు.. రేపర్లు.. వాటర్ బాటిల్స్.. చెక్కలు వంటివి. ప్రమాదకర చెత్త అంటే నాప్కిన్స్.. గ్లౌజులు.. కాటన్.. సిరంజీలు వంటివి.
వాటికేం తక్కువ లేరు
చెత్త నిర్వహణలో మనొళ్లకు నాలెడ్జ్ ఉండదుగానీ.. చెత్త కోసం ఇచ్చిన వస్తువులను వేరే పనికి ఉపయోగించడంలో కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. ప్రభుత్వమో స్వచ్ఛంద సంస్థలో చెత్తపై అవగాహన కల్పిస్తూ ఇచ్చిన బకెట్లను వంటింట్లో పప్పులు.. ఉప్పుల కోసం వాడుతుంటారు. వాటిని ఇచ్చింది వంటింటి దినుసుల కోసమా లేదా సక్రమంగా చెత్త నిర్వహణ చేసేందుకా అనే ఆలోచనే రాదు. చెత్తకోసం సపరేట్‌గా బకెట్లు తెచ్చి పెట్టుకునే సాహసం ఎలా చేయరు. కనీసం సర్కారిచ్చిన వాటినైనా సక్రమంగా వినియోగించాలి కదా.? ఏదో మాటవరసకు ఓ కవర్లో చెత్తనంతా నింపేసి మూలన పడేస్తారు. అదెక్కడైనా కొట్టుకుపోనీ.. ఎవరింట్లయినా పడనీ మాకేం సంబంధం అన్నట్లుంటారు.
అలా చేయడం నేరమే
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం చట్టరీత్యా నేరం. ప్రత్యేకించి కొన్ని సెక్షన్లు.. శిక్షలు.. జరిమానాలు ఉన్నాయి. అయితే అది జనాల మెదళ్లకు ఎక్కడం లేదు. ఎంతసేపూ మేమొక్కరం వేస్తే ఏమవుతుందీ అనే వాదిస్తుంటారు. ఇంట్లో చెత్తను చెత్తకుండీల్లో వేయండి అని పక్కవాళ్లు చెప్పాలా.? పోనీ.. వాళ్లు చెప్పిందయినా వింటున్నారా అంటే అదీ లేదు. ఇంట్లో చెత్తనే కాదు. ఫ్యాక్టరీలు.. పరిశ్రమలు నిర్వహిస్తున్నవాళ్లూ ఇలానే తయారయ్యారు. రోడ్డుపై బస్సో.. కారో వెళ్తుంటది. లోపలున్నొళ్లు పండ్లో లేదా ఇంకేదైనా పానీయమో తీసుకొని అయిపోగానే ఆ చెత్తను కిటికీలోంచి బైటికి విసిరేస్తారంతే. అదెక్కడైనా పడని నాకేంటి అనుకుంటారు. ఇక పబ్లిక్ పార్కులు.. సినిమా టాకీస్లు.. చెరువులను వ్యర్థాలు విసిరేసే ప్రదేశాలుగా భావిస్తున్నారు.
పర్యావరణం కరాబ్
చెత్తే కదా దానికంత సినిమా చేస్తారెందుకు.? ఎవరికీ ఇబ్బంది లేకుండా దానిని కాల్చేస్తున్నాం కదా అనేవాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చెత్తను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలవుతాయి. గాలి కలుషితమై శ్వాసకోస సమస్యలు వస్తాయి. చెత్త నుంచి వచ్చే లిచేట్ నీటిని కూడా పాడుచేస్తుంది. ఒకేచోట రోజులకొద్దీ చెత్తను ఉంచడం వల్ల విషపూరిత రసాయనాలు భూమిలోకి చేరి మొక్కల పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. దోమలు ఎక్కువయి మలేరియా.. డెంగ్యూ.. జికా వైరస్ లాంటి వ్యాధులు వస్తాయి. చెత్తకు ఎలుకలు ఆకర్షితమైతే ఎలుకల వల్ల లిప్టోస్పిరోసిస్.. హంటా వైరస్ వంటి వ్యాధులను వ్యాపిస్తాయి.
చెత్తంటే విషమే
చెత్త వ్యర్థాలలో సీసం.. ఆర్సెనిక్.. కాడ్మియం వంటి భారీ లోహాలు ఉంటాయి. బెంజీన్.. జిలీన్ వంటి రసాయనాలు ఉంటాయి. తక్కువస్థాయి రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయి. అస్బెస్టాస్ ఫైబర్ వంటివి కూడా ఉంటాయి. మీథేన్.. హైడ్రోజన్ సల్ఫైడ్.. అమోనియా వంటి వాయువులను విడుదల చేస్తాయి. ఇవన్నీ విషపూరితమైనవే. వీటివల్ల క్యాన్సర్.. శ్వాసకోస సమస్యలు.. నాడీ సంబంధిత సమస్యలు.. పునరుత్పత్తి సమస్యలు.. ఆస్తమా.. చర్మ వ్యాధులు.. లుకేమియా.. లింఫోమా వంటి తీవ్రమైన వ్యాధులు చెత్త వ్యర్థాల నుంచి వచ్చే ప్రమాదముంది. అంతేకాదు మానసికంగా చెత్త ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. చెత్త మనసులో ప్రతికూల ప్రభావాలను ప్రేరేపిస్తుందట.
జీవనం ప్రమాదం
మీ ఇంటివద్దకే చెత్తబండి వచ్చింది. త్వరగా రండీ అని విజిలేస్తూ మరీ పొద్దు పొద్దున్నే మన ఇంటిముందు చెత్తబండి వచ్చి నిలబడుతుంది. మన చెత్త గురించి వాళ్లు బాధ్యత తీసుకున్నా మనకు మాత్రం ఆ బాధ్యతనేది గుర్తుకే రాదు. పైగా అబ్బబ్బా ఈ చెత్త బండోడొకడు పొద్దున్నే వచ్చి కొంపలు మునిగిపోయినట్లు మొత్తుకుంటడూ అని చిరాకు పడతారు. ఔను.. నిజంగానే చెత్తను నిర్లక్ష్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి. ముఖ్యంగా మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు ఏర్పడి గర్భస్రావాలు.. మృత జననాలు.. జనన లోపాల వంటి సమస్యలొస్తాయి. ఆ ఊరు కంపు అని తెలిస్తే పెండ్లీలు చేసుకోవడానికి కూడా ముందుకు రారు. ఇంకా విద్య.. ఉపాధి అవకాశాలకు పరిమిత ప్రాప్యత ఉండే అవకాశముంది.
జీహెచ్ఎంసీ కొత్త రూల్
జీహెచ్ఎంసీ తాజాగా మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కాలువల్లో చెత్తవేస్తే రూ.1000, దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే రూ.1000-2000 జరిమానా విధించనుంది. దీనికోసం ఒక యాప్‌ను కూడా రూపొందిస్తోంది. ఇక భారత ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో క్లీన్ ఇండియా మిషన్‌ను ప్రారంభించింది. 2030 నాటికి దేశాన్ని క్లీన్‌గా మార్చడమే దీని లక్ష్యం. ఇంకా ఐదేళ్లే ఉంది. ప్రజలు దీనిని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో వారికే తెలియాలి. ₹100- ₹25,000 జరిమానా కూడా పెట్టారు. చట్టాలు.. జరిమానాలతో మాత్రమే ఈ మార్పు రాదు. మార్పు రావాల్సింది ప్రజల్లో.. చెత్త నిర్వహణలో.
వారికి ప్రధానాంశం
- 1. అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే $25- $1,000 జరిమానా విధిస్తారు.
- 2. చైనాలో 50 RMB- 5,000 RMB ఫైన్ వేస్తారు. అంటే ఇది సుమారు $7-$720 USD.
- 3. ఇంగ్లండ్‌లో £150 లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తారు. నేరస్థులు కొంతకాలం సమాజ సేవ చేయాలి.
- 4. ఆస్ట్రేలియాలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే AUD 50- AUD 11,000 వరకు జరిమానా వేస్తారు.
- 5. మలేషియాలో MYR 500- MYR 10,000 వరకు ఫైన్ వేస్తారు.
- 6. సింగపూర్‌లో అయితే SGD 10,000 వరకు జరామానా ఉంటుంది.
వ్యర్థాల సేకరణ
- 1. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యర్థాల, చెత్త సేకరణ అద్భుతంగా ఉంటుంది.
- 2. అమెరికా.. కెనడా.. ఆస్ట్రేలియా.. యూకే.. జర్మనీలో మున్సిపల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇండ్ల నుంచి రోజూ చెత్తను సేకరిస్తారు.
- 3. స్వీడన్.. స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వ్యర్థాలను భూగర్భ డబ్బాలలో జమ చేసి వాక్యూమ్ ట్రక్కులలో ఎక్కిస్తారు.
- 4. సింగపూర్.. జపాన్ వంటి దేశాల్లో సెన్సార్లు.. ఇతర సాంకేతికత మార్గాల ద్వారా స్మార్ట్ నిర్వహణ చేస్తారు.
- 5. వాంకోవర్.. డెన్మార్క్.. కోపెన్ హాగన్ వంటి దేశాల్లో కమ్యూనిటీ రీసైక్లింగ్.. కంపోస్టింగ్ పద్థతులతో జీరో వేస్టేజ్‌కి చొరవ తీసుకుంటారు.
- 6. ఐర్లాండ్.. ఇటలీ వంటి దేశాలు ఇండ్లలోని చెత్త పరిమాణం ఆధారంగా సేకరించి రీసైక్లింగ్ చేస్తారు.
- హానికారకాల శాతం
- 1. సీసం: 0.1-5%
- 2. పాదరసం: 0.01-1%
- 3. ఆర్సెనిక్: 0.01-0.1%
- 4. కాడ్మియం: 0.01-0.1%
- 5. బెంజీన్: 0.1-1%
- 6. టోలున్: 0.1-1%
- 7. జిలీన్: 0.1-1%
- 8. ఇథైల్ బెంజీన్: 0.01-0.1%
- 9. పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (PCB): 0.01-0.1%
- 10. డయాక్సిన్లు్: 0.001-0.01%
- చెత్త నిర్వహణ ర్యాంకు
- గ్లోబల్ వేస్ట్ ఇండెక్స్- 2022 ప్రకారం వ్యర్థాల చెత్త వ్యర్థాల నిర్వహణలో స్విట్జర్లాండ్.. స్వీడన్.. డెన్మార్క్ దేశాలు టాప్‌లో ఉన్నాయి. 99% కంటే ఎక్కువ వ్యర్థాల పునరుద్ధరణ రేటు ఉంది. రీసైక్లింగ్‌లో 2021 ప్రకారం 66.1%తో జర్మనీ ముందంజలో ఉంది. సింగపూర్ వంటి దేశాలు "వేస్ట్ టు ఎనర్జీ" వ్యవస్థలను అమలుచేసి చెత్తతో విద్యుత్ తయారీచేస్తోంది.
- గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఔట్‌లుక్ 2024 ప్రకారం ఘన వ్యర్థాల ఉత్పత్తి 2023లో 2.1 బిలియన్ టన్నులు ఉండగా అది 2050 నాటికి 3.8 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. వ్యర్థాల నిర్వహణ ప్రపంచ ప్రత్యక్ష ఖర్చు 2020లో USD 252 బిలియన్లు. వ్యర్థాల తగ్గింపు కోసం 2050 నాటికి నికర వార్షిక ఖర్చులు USD 270.2 బిలియన్లకు పరిమితం కావచ్చు.
చిన్న విషయం కాదు: బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదిబట్ల
చెత్త రోడ్డుమీద పడకముందే ప్రజల ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో పొద్దున్నే సిబ్బందిని బండ్లు ఇచ్చి పంపిస్తున్నాం. కొందరైతే మావాళ్లు వేసే విజిల్‌తోనే నిద్రలేస్తారు. అంత అలర్ట్ చేసినా ఇంకా చాలామంది చెత్తను చాలా చిన్న విషయంగానే తీసుకుంటున్నారు. ప్రజల్లో మార్పు ఇంకా రావాలి. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తున్న మా ప్రయత్నానికి ఫలితం ఉంటుంది.
చెత్తే సమస్య: డాక్టర్ సుదర్శన్, ఈఎన్టీ స్పెషలిస్ట్
ఏ చిన్న కవర్ అయినా.. వాడేసిన వస్తువైనా.. కూరగాయల వేస్టేజీ అయినా మనవాళ్లు గోడవతల పారేసి చేతులు దులుపుకుంటారు. కానీ దానివల్ల ఎంత సమస్య అవుతుందనేది గ్రహించరు. ఈ రోజుల్లో మెజార్టీ అనారోగ్య సమస్యలు.. సీజనల్ వ్యాధులు ఈ చెత్తా చెదారం.. వ్యర్థాలతోనే వస్తున్నాయి. సక్రమమైన చెత్త నిర్వహణ ఉంటే ఇలాంటి సమస్యలు రావు.
క్యాన్సర్ కారకం: సుధ కొనకళ్ల, సామాజిక కార్యకర్త
చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు.. వాటిని కచ్చితంగా చెత్త కుండీల్లోనే వేయాలి అని అవగాహన కల్పిస్తుంటాం. మా దగ్గర ఉన్నవాళ్లకు కూడా పరిశుభ్రతే ప్రధానం అని చెప్తుంటాం. ప్లాస్టిక్ వస్తువులను కాల్చేటప్పుడు డయాక్సిన్లు అనే క్యాన్సర్ కారక పదార్థం విడుదలవుతుంది.
అక్కడే వేస్తా: మణమ్మ, గృహిణి
మిగతావాళ్ల గురించి ఏమోగానీ నేను చెత్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడపడితే అక్కడ వేయడం అనేది నేనస్సలు చేయను. మా పిల్లలకు కూడా ఇదే నేర్పించాను. ఇంట్లో చిన్న కాగితం ముక్క కనిపిస్తేనే ఏదో అనిపిస్తుంది. అలాంటిది ఇంట్లో చెత్తను బయటేసి చేతులు దులుపుకుంటామా చెప్పండి.?
పాటించాలి: మోహన్, ఆర్టీసీ డ్రైవర్
బస్సెక్కిన ప్రయాణికులను చూస్తుంటాం కదా. ఏదో ఆదరాబాదరగా నాలుగైదు పొట్లాలు తీసుకొని ఎక్కుతారు. వాటిని తినేసి ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. కనీసం బస్టాండ్లలో చెత్తకుండీలు ఉంటాయి కదా అక్కడైనా వేయొచ్చనే ఆలోచన చేయరు. కాబట్టీ నియమాలను పాటించాల్సిందే.
- ప్రాచీణ నాగరికత (3000 BCE- 500 CE)
- 1. చెత్తను వీధులు.. సందులు.. నదులు వంటి బహిరంగ ప్రదేశాల్ల వేసేవారు కాదు.
- 2. చెత్తను నిప్పులు లేదా చెత్త గుంటల వంటి ప్రదేశాల్లో కాల్చేవారు.
- 3. సేంద్రీయ వ్యర్థాలను కంపోస్ట్ చేసి ఎరువుగా ఉపయోగించేవారు.
- మధ్యయుగ కాలం (500- 1500 CE)
- 1. ముక్రాకర్లు అనే వ్యక్తులు చెత్తను సేకరించి.. నియమిత ప్రదేశంలో పారేసేవారు.
- 2. భూమికి పెద్ద రంధ్రాలు చేసి చెత్తను వాటిలోకి వదిలేవారు.
- 3. వ్యర్థాల తొలగింపు కోసం ప్రత్యేకంగా గుంతలు తీసేవారు.
ఫైనల్ పాయింట్..
అమెరికాలోనో.. చైనాలోనో అయితే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే తాట తీస్తారు. అయినా అక్కడి ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరు. అదే మనదేశంలో అయితే "మా చెత్త మా ఇష్టం" అనే చెత్త వాగుడు వాగుతారు. ఇష్టమొచ్చిన చోట చెత్తను పారేయడం "మా జన్మహక్కు" అని ఫీలవుతుంటారు. ప్రజల ధోరణి అలా ఉంది కాబట్టే అడ్డమైన రోగాలు మనల్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. అధికారులో.. సామాజిక బాధ్యతున్న వ్యక్తులో చెప్పడానికి వస్తే.. "మాది మాకు తెలవదా.. పెద్ద చెప్పొచ్చారు" అని ఫీలైపోతుంటారు. అనవసర రాద్దాంతం చేసే ఆ సమయమేదో ప్రాపర్ చెత్త నిర్వహణకు వినియోగిస్తే క్లీన్ అండ్ గ్రీన్‌లో మనల్ని మించినవారెవరూ ఉండరు. అదెప్పుడు బోధపడుతుందో.. చెత్త వేయడంలో కూడా బాధ్యత ఉంటుందని మనకెప్పుడు తెలిసొస్తుందో...






