- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా చూస్తే అర్థమైంది.. కొడుకులకు ఆస్తి రాసివ్వకుండా దగ్గర పెట్టుకుంటేనే వృద్ధులకు బతుకు..
‘తాయి కిళవి’ సినిమాలో.. పావున్ తాయ్ లాగా ఉండాల్సిందే.. ఒక్క పైసా దొరికిన దాచిపెట్టే ముసలవ్వ.. బంగారానికి ఆశపడే లక్షలు పోసి బతికించిన కొడుకులు.. ఆస్తి దగ్గర పెట్టుకుంటేనే ముసలోళ్లకు రక్ష

దిశ, ఫీచర్స్ : సీనియర్ హీరోయిన్ రాధిక కొత్త సినిమా ‘తాయి కిళవి’.. పావున్ తాయ్‌గా అదరగొట్టేసింది ఆమె. ముసలమ్మ వేషధారణలో జీవించేసింది. ముగ్గురు కొడుకులు, ఓ కూతురికి తల్లిగా ఒక్క చోట కూడా నటించినట్లు అనిపించలేదు. ఇక కథ విషయానికి వస్తే మన ముసలోళ్ల జీవితాలకు దగ్గరగా ఉంటుంది. పావున్ తాయ్.. అంటే రాధిక.. వడ్డీల వ్యాపారం చేస్తది.. ఊళ్లో డబ్బులు వడ్డీకి ఇచ్చి వచ్చే ఒక్కో రూపాయిని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. పైసా కూడా పోనివ్వదు. ఒకవేళ ఇవ్వలేదంటే చీల్చి చెండాడుద్ది. పిచ్చి తిట్లు తిట్టుద్ది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరైనా సరే ఒకరి కింద బతికితే బానిస బతుకేనని.. ముఖ్యంగా మహిళలకు ఈ సందేశాన్నిచ్చింది. భర్త కొట్టినా తిట్టినా వాడితోనే పడి ఉండకుండా.. మీకు తెలిసిన పనితోనే ఆర్థికంగా ఎదగాలని చెప్పింది. కూతురిని భర్త టార్చర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి.. ఆమె బతుకు ఆమె బతికేలా టైలరింగ్ నేర్పించింది. స్కూల్‌కు తీసుకపోయి రెండు అక్షరాలు కూడా నేర్పించింది. ఇది ఓ తల్లి కూతురికి ఇచ్చిన భరోసా. అంతేకాదు బిడ్డకు రెండో పెళ్లి చేసి లైఫ్ ఇక్కడితోనే ఎందుకు ఎండ్ అయిపోవాలనే మెసేజ్ ఇచ్చింది.
ఆస్తి రాసిస్తే అంతే..
ఇక నాకు బాగా నచ్చిన సీన్ విషయానికి వస్తే పావున్ తాయ్ ఓ ఇంటికి వడ్డీ వసూల్ చేసేందుకు వెళ్తుంది. ఇంటి ముందు ఓ పాడైన మంచంలో కూర్చుని నీళ్ల గంజి తాగుతున్న ముసలవ్వను చూసి.. ఏం తింటున్నవే అని అడుగుడు.. లోపల ఆ ముసలావిడ కోడలు స్పెషల్ కర్రీ చేసుకునుడు.. చంకలో ఉన్న పోరని చేతిలో చాక్లెట్, ఓ పైసా.. పావున్ తాయ్ రాగానే ఆ కోడలు తన మెడలో నుంచి బంగారం చైన్ తీసేసి యాక్ట్ చేసుడు.. కారణం వడ్డీ ఇప్పుడు ఇవ్వకపోతే పొట్టు పొట్టు తిట్టుద్ది.. బంగారం ఏసుకుని ఊరేగుతారు కానీ వడ్డీ కట్టరా అని.. ఆ సమయంలో పిల్లాడి చేతిలో ఉన్న పైసాను తీసుకుని.. దీన్ని వడ్డీ కింద లెక్కల్లో జమ చేసుకుంటా అని చెప్పుడు. ఇక్కడ హైలెట్ ఏందంటే.. తాను కొడుకులకు ఆస్తి ఇస్తే తన గతి కూడా ఇలాగే ఉండేదనే ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుడు. మొత్తానికి ఇలా చాలా మందిని వడ్డీలకు వేధించి పావున్ తాయ్ చనిపోవాలని ఊరు ఊరంతా కోరుకుంటది.. ఒక్క తన కూతురు తప్ప. అందుకే పావున్ తాయ్ ఇంటి నుంచి బయలుదేరుతుందంటే అప్పులు తీసుకున్నోళ్లంతా దాక్కుంటారు.
ముసలమ్మా.. మజాకా..
భర్త చనిపోయాక ఆస్తిని తమ పేరు మీదకు రాసి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో నెల బతుకమని చావు సలహా ఇస్తరు పావున్ తాయ్ ముగ్గురు కొడుకులు. ఇందుకు ససేమిరా అన్న పావున్ తాయ్.. ఆస్తి తాను కష్టపడి సంపాదించిందని.. ఊరోళ్లందరి కన్నా కొంచెం తెలివిగా ఉండబట్టే మన ఊళ్లో ఇంత పెద్ద ఇల్లు కట్టిన ఒకే ఒక్క ఆడది పావున్ తాయ్ అని చెప్పుద్ది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదని కొడుకులను వెళ్లిపోమ్మంటది. మొత్తానికి ఊరంతా కోరుకున్న గడియలు రానే వచ్చేశాయ్. పావున్ తాయ్ మంచం పట్టేస్తది. దీంతో ఊరు ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటది. ఎప్పుడు చనిపోతదా అని వెయిట్ చేస్తారు అంతా. కొడుకులు అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడరు. కానీ ఓ బంగారం వ్యాపారి వచ్చి ఆమె దగ్గర 160 తులాల బంగారం ఉందని చెప్పగానే.. ఆ బంగారం కోసం కొడుకులు వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపోతరు.. లక్షలు ఖర్చు పెట్టి.. నెలల తరబడి ఆమెను దగ్గరుండి చూసుకుని.. మొత్తానికి బతికిస్తారు.
ఆస్తి దగ్గర పెట్టుకునుడే రక్ష
ఈ సినిమా చూశాక నాకు అయితే మా ఊరిలో ముసలాళ్ల పరిస్థితి గుర్తొచ్చింది. ఉన్న ఆస్తిని కొడుకుల పేరు మీద రాయించుకుని.. చివరి అంకంలో అన్నం పెట్టకుండా ఎడిపిస్తరు. వాళ్లు సంపాదించిన ఆస్తి నుంచే వాళ్లకు బువ్వ పెట్టేందుకు భారంగా భావిస్తారు. కన్న తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోతారా అని వెయిట్ చేసిన మహానుభావులను కూడా చూశా. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. నిజంగా పావున్ తాయ్ లాగా ఉండటమే బెటర్ అనిపించింది ఈ సినిమా చూశాక. అప్పుడే కనీసం పేరెంట్స్ దగ్గరున్న ఆస్తి కోసమైనా మంచిగా చూసుకుంటరని అనిపించింది.
హా.. ఇంకోటి.. పావన్ తాయ్ ప్రతి శుక్రవారం.. తనకు నచ్చినట్లుగా హ్యాపీగా ఉండేందుకు.. టౌన్‌కు వెళ్తది. సినిమా చూస్తది.. బిర్యానీ తింటది.. గిరుక కొనుక్కుంటది.. కళ్లద్దాలు పెట్టుకుని.. గొడుగు నీడన.. ఓ మహారాణిలా గడిపేసి వస్తది. ఇది కదా జీవితమంటే.. ఏమంటరు.. మన కోసం మనం బతకాలి.. మన కోసం మనమే సంపాదించుకోవాలి.. అప్పుడే గౌరవం..
- సుజిత రాచపల్లి






