గృహ కొనుగోలుదారులకు అండగా టీజీ రెరా

by Sujitha Rachapalli |

దేశంలోనే మొదటి గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్.. గృహ కొనుగోలుదారులకు TG RERA భరోసా.. ప్రమోటర్లు, ఏజెంట్లకు సైతం సాయం.. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

గృహ కొనుగోలుదారులకు అండగా టీజీ రెరా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ రెరా మరో అడుగు ముందుకువేసింది. ఇళ్లు కొనేవారు, బిల్డర్లు, ఏజెంట్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ సెల్(పీజీజీసీ)'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మెన్ సంతోష్ రెడ్డి దీన్ని ప్రారంభించగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా టీజీరెరా ఈ సెల్‌ను ఏర్పాటు చేయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, ఫిర్యాదులను వేగంగా స్వీకరించేందుకు వీలుగా ఈ సరికొత్త వ్యవస్థ పని చేయనుండగా.. గృహ కొనుగోలుదారులకు మరింత భరోసా ఇచ్చేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జాతీయ స్థాయి చర్చల అనంతరం.. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సహకారంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశం.

పీజీజీసీ పనితీరు ఇలా..

రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం (రెరా) చట్టం-2016 పారదర్శకతను నిర్ధారిస్తున్నప్పటికీ… ప్రాజెక్టుల జాప్యం, బిల్డర్ల నుంచి కమ్యూనికేషన్ లోపం వంటి సమస్యలు బాధితులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కొత్త సెల్ ద్వారా ఫిర్యాదుదారులకు వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు, రీఫండ్, నష్టపరిహారం, గడువులోగా స్వాధీనం వంటి అంశాల్లో సహకారం అందనుంది. కేవలం కొనుగోలుదారులకే కాకుండా, ప్రాజెక్ట్ ప్రమోటర్లు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఈ సెల్ సహాయకారిగా ఉంటుంది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చట్టపరమైన నిబంధనలు, డిస్‌క్లోజర్స్ వంటి అంశాల్లో స్పష్టతనిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి నైపుణ్యం పెరగడమే కాకుండా… అనవసరమైన వివాదాలు తగ్గే అవకాశం ఉంది.

మూడు డెస్క్‌లు…

గ్రీవెన్స్ సెల్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం మూడు డెస్క్‌లలో ఒక టీమ్ లీడర్, డెస్క్ ఆఫీసర్లు, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, అసిస్టెంట్లు ఉన్నారు. వీరు ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదులను క్రమబద్ధీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. ఈ సెల్ కేవలం సమస్యల పరిష్కారానికే కాకుండా.. భవిష్యత్తులో కొత్త పాలసీల రూపకల్పనకు అవసరమైన ఫీడ్‌బ్యాక్‌ను కూడా ప్రభుత్వానికి అందిస్తుంది.

కొనుగోలుదారులకు మరింత భరోసా..

సాధారణంగా ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనే సమయంలో సామాన్యులకు అనేక సందేహాలు ఉంటాయి. ప్రాజెక్ట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? బిల్డర్ చెబుతున్న వివరాలు నిజమేనా? వంటి విషయాల్లో ఈ ప్రత్యేక సెల్ మార్గదర్శనం చేస్తుంది. ‘రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు, భాగస్వాములందరినీ సమన్వయం చేసేందుకే ఈ విభాగాన్ని ప్రారంభించాం’ అని టీజీ-రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ తెలిపారు.

Next Story