- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈతొస్తే..
"జీవితాన్ని ఈదొచ్చు" అంటారు.
కానీ..
ఇప్పుడెవ్వరికొస్తుంది "ఈత".?
ఒకప్పుడు పల్లెల్లో ఉండేవాళ్ల "దినచర్య" ఈత.
ఇప్పుడేమో ఈతంటే భయం.
అంతో ఇంతో "పట్నం"లో ఉండేవాళ్లకే తెలుస్తుంది.
అదికూడా "స్విమ్మింగ్ పూల్స్" వల్ల.
అలా కాకుండా "బావుల్లో ఈతకొట్టే కల్చరొకటి" ఉండేది తెలుసుకుందామా.?
- దిశ, ఫీచర్స్
సరదా కోసం..
"ఈత"ను గుర్తుచేస్తే "తాత" యాదికొస్తడు. అప్పట్లో తాతలే కదా చెయ్యిపట్టి చెలకల వెంట తిప్పింది. భుజమ్మీదెత్తుకొని బావుల కాడికి తీసుకెళ్లింది. "అఆ"లు వస్తున్నయంటే "ఈత"గూడ రావాలె పిల్లలకు అంటుండె పెద్దొళ్లు. ఇప్పుడు "ఈత" అంటే గేటెడ్ కమ్యూనిటీలోని "స్విమ్మింగ్ పూల్". స్మిమ్ సూటు.. కళ్లద్దాలు పెట్టుకొని.. నడుముకొక ట్యూబ్ తగిలేసుకొని దూకుతున్నారు ఈ కాలం పిల్లలు. సరదా కోసమే తప్ప ఈత నేర్చుకోవాలనే ధ్యాస ఎక్కడ కనిపిస్తుంది.? ట్యూబేసుకున్నామా.? ఓ గంట ఎంజాయ్ చేశామా అనేదే ముఖ్యం. నెలల పాటు వెళ్తారు కానీ.. ఈతనైతే రాదు.
ఆముదం లొట్టలే..
90sలో ఈతకు.. స్కూల్ పిల్లోడికి.. ఎండా కాలం సెలవులకు అదో అవినాభావ సంబంధం ఉండేది. అప్పట్లో ఈ ట్యూబుల ట్రెండెక్కడిది.? ఆముదం చేను లూటీపోతే ఏరుకొచ్చిన లావులావు "ఆముదం లొట్టలే" ఈత సాధనాలు. ఎవరి మోపు వాళ్లకుండేది. ఎవరి సైజు తగ్గట్టు వారి లొట్టలు ఉండేవి. ఇంటర్వెల్ "బెల్" మోగినప్పుడు "సైకిల్‌కు ఆముదం లొట్టల మోపు" కట్టుకొని డైరెక్టుగా బావుల కాడికే పోతుండె. కొత్తగా ఈత నేర్చెటొళ్లు కూడా ఈ లొట్టల ధైర్యంతో "మోట్ల మీదికెళ్లి" కూడా దుంకుతుండేవాళ్లు. ఆముదం లొట్టలుంటే తోడుగా ఎవరూ ఉండాల్సిన అవసరం కూడా లేకుండె. ఐదారు రోజుల్లో ఈతొచ్చేది.
ఆనిగపుకాయ బుర్ర..
"ఆముదం లొట్టలు" వేసుకొని ఈత కొడితే కొందరికి ఒళ్లంతా దురద పెట్టేది. కొందరికేమో ఊడిపోతదేమో అనే భయం. అందుకే "ఆనిగపుకాయ బుర్ర"లను కట్టుకునేవాళ్లు. అసలు ఆనిగపుకాయ బుర్రలంటే తెలుసా ఇప్పటి పిల్లలకు.? బాగా పెద్దగా కాసి.. విత్తనాల కోసం వదిలేసిన ఆనిగెపుకాయ బుర్రలును సేమ్ ఆముదం లొట్టలు కట్టుకున్నట్లే కట్టుకొని ఈత నేర్చుకునేవాళ్లు. కాకపోతే ఇవి కట్టుకున్నవాళ్లు ఎక్కువ దూరం వెళ్లకుండా ఒడ్డొడ్డుకే ఈత నేర్చుకునేవాళ్లు. గట్టిగ వారం రోజులు ఒడ్డుకు నేర్చుకొని.. అటెన్క ఈ బుర్రల అవసరం లేకుండానే బావి నడిమధ్యలో ఈత కొడుతుండె కొందరు.
లొట్టపీసు కట్టెలు
ఈ మధ్య "లొట్టపీసు" అనే పదం పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తుంది. వాస్తవానికి వాళ్లనుకున్నంత "పనికిరాని" చెట్టు కాదిది. వాగుల్లో.. చెరువు కాలువల్లో పెరుగుతుంది. వీటి కట్టెలు చాలా తేలికగా ఉంటాయి. సేమ్ ఆముదం లొట్టలు ఉన్నట్లు. అయితే ఆముదం లొట్టలు చేను లూటిపోయినప్పుడు మాత్రమే లభ్యమవుతాయి కాబట్టీ అన్ని సీజన్లలో దొరకవు. అదే లొట్టపీసు కట్టెలు అయితే అన్ని సీజన్లలో లభ్యం అవుతాయి. ఆముదం లొట్టలకు ప్రత్యామ్నాయంగా ఈత నేర్చుకునే పిల్లలు ఈ "లొట్టపీసు కట్టెలను" వీపుకు కట్టుకొని బావుల్లో దుంకేవాళ్లు.
మళ్లీరాని రోజులు..
లొట్టపీసు కట్టెలు.. ఆముదం లొట్టలు.. ఆనిగపుకాయ బుర్రలు కాకుండా కొందరు "అడవి కలబంద" మొక్క మొదలును ఎండబెట్టి వాటితో కూడా ఈత నేర్చుకునేవాళ్లు. అయితే లొట్టపీసు కట్టెలుగానీ.. ఆముదం లొట్టలుగానీ.. ఆనిగపుకాయ బుర్రలుగానీ మోపులా కట్టుకుంటెనే ఈదడం వస్తుంది. ఈ "అడవి కలబంద మొదలు" మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టీ ఒకటి కట్టుకుంటే సరిపోతుంది. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు. పిల్లలు.. పెద్దలు.. తాతలు.. మనవళ్లు.. మామలు.. అళ్లుళ్లు అంతా బావుల కాడ దర్శనమిచ్చి ఈత మోతలు మోగిస్తుండేవాళ్లు. ఆ రోజులే వేరప్పా.!






