- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుమన్ సుఖీజా.. కీడా జాడీ.!
ఆరెంజ్ హెర్బ్ బ్రాండ్‌తో ఏటా రూ.40 లక్షలు సంపాదిస్తోంది

దిశ, ఫీచర్స్: గృహిణిగా ఉన్నవాళ్లను తక్కువచేసి చూడొద్దు. వారిలో కూడా సరికొత్త ఐడియాలు.. టాలెంట్ ఉంటుందనే విసయం గుర్తుంచుకోవాలి. ఢిల్లీలో సాధారణ గృహిణిగా జీవితం గడిపిన సుమన్ సుఖీజానే దీనికి చక్కటి ఉదాహరణ. పిల్లలు పెద్దయ్యాక ఖాళీగా ఉండలేక ఇంట్లోనే అరుదైన ‘కీడా జాడీ’ పుట్టగొడుగుల సాగు మొదలుపెట్టింది. ఇప్పుడు ‘ఆరెంజ్ హెర్బ్’ బ్రాండ్‌తో ఏటా రూ.40 లక్షలు సంపాదిస్తోంది.
యూట్యూబ్‌లో చూసి..
హర్యానాలో పుట్టిన సుమన్ సుఖీజా ఎనిమిదేళ్ల వయసు నుంచి డిల్లీలో పెరిగింది. చదువు.. పెళ్లి.. పిల్లలు.. ఇంటి బాధ్యతలు అన్నీ తానే చూసుకునేది. ఐతే. పిల్లలు పెద్దయ్యాక తన చేతికి పని తక్కువైంది. ఖాళీగా ఉంటున్నానా అనే భావన మొదలైంది. ఆ నిశ్శబ్దం నుంచి నెగెటివ్ ఆలోచనలో పడొద్దని ఏదో ఒకటి సృష్టించాలనుకుంది. అక్కడి నుంచే మొదలైంది సుఖీజా ప్రయాణం. పుట్టగొడుగుల సాగు ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి తెలుసుకుంది. ముర్థల్‌లో కొంతకాలం శిక్షణ తీసుకుంది. అక్కడే మొదటిసారి ‘కీడా జాడీ’ గురించి తెలుసుకుంది. దానితోనే తన జీవితాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయింది.
మొదటి బ్యాచ్ ఫెయిల్..
2018లో మీరట్ వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుంది సుమన్ సుఖీజా. పుట్టగొడుగుల సాగు కోసం కనీసం 100-150 గజాల స్థలమైనా ఉండాలి. కానీ.. తమకు అలాంటి స్థలాలేవీ లేవు. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తుండగా ఇంట్లోనే ఒక గదిలో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే ఇంట్లో 100 చదరపు అడుగుల గదిని ల్యాబ్‌గా మార్చింది. ఆటోక్లేవ్.. లామినార్ ఫ్లో హుడ్.. ఏసీలు అమర్చి మొత్తం రూ.11 లక్షలతో పెట్టుబడి పెట్టింది. మొదటి బ్యాచ్ పూర్తిగా పాడైంది. ఐనా కూడా వదల్లేదు. రెండోసారి పెట్రీ డిష్‌లు ఆర్డర్ చేసి మళ్లీ మొదలు పెట్టగా 200-250 గ్రాములతో బ్యాచ్ సక్సెస్ అయింది.
రూ.40 లక్షల టర్నోవర్..
సక్సెస్ అయిన బ్యాచ్‌లో వచ్చింది మోతాదు ఉత్పత్తే అయినా సుమన్ సుఖీజాకు అదొక బంగారంలా అనిపించింది. రెట్టింపు ఉత్సాహంతో సాగులో నిమగ్నమైంది. కట్‌చేస్తే.. ఇవాళ ద్వారకాలో 250 చదరపు అడుగుల ల్యాబ్.. పార్టనర్‌షిప్‌లో మరో రెండు ల్యాబ్‌ల ద్వారా మొత్తం 16-20 కేజీల కార్డిసెప్స్ ఉత్పత్తి చేస్తోంది. సంవత్సరానికి రూ.40 లక్షల టర్నోవర్. కొడుకు రాహుల్‌ను పూర్తిగా బిజినెస్‌లోనే దించింది సుఖీజా. కీడా జాడీ టీ.. క్యాప్సూల్స్ కూడా అమ్ముతున్నారు. వీటిని జిమ్ చేసేవాళ్లు.. అథ్లెట్లు.. వృద్ధులు. ఆస్థమా.. డయాబెటిస్ పేషెంట్లు అందరూ వాడుతున్నారు.
1000 మందికి శిక్షణ..
తనలాగే మహిళలు వ్యాపారంలోకి రావాలి.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో 2019 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. ఇలా ఇప్పటివరకు 1000 మందికి పైగా శిక్షణ ఇచ్చింది. మహిళలు డబ్బు కోసం మాత్రమే కాదు గౌరవం.. ఆత్మవిశ్వాసం.. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇలాంటివి స్టార్ట్ చేయాలి అనేది తన ఆలోచన. మహిళ పని చేస్తేనే కుటుంబం బలపడుతుంది.. సమాజం తెలివిగా మారుతుంది అని చెప్తోంది సుమన్ సుఖీజా. చిన్న గది నుంచి ప్రారంభమై ఇప్పుడు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న సుఖీజా సంకల్పం ఎంతో గట్టిదని చెప్పొచ్చు.






