- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మతో గడిపే ప్రతీ క్షణం.. ఆమె ఆయుష్షును పెంచే ఆనంద రాగం..!
కూతుళ్లు తల్లితో ఎక్కువ సమయం గడపడంవల్ల తల్లుల్లో జీవించే అవకాశం 25% ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

దిశ, ఫీచర్స్ : అమ్మ అంటేనే ఓ అనిర్వచనీయ ఆనందం. అమ్మ అంటేనే ఓ మధురమైన అనుబంధం. అమ్మ అంటేనే కొండంత ధైర్యం. ప్రపంచంలో దేనితోనూ పోల్చలేనంత ప్రేమను పంచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. కేవలం అమ్మ మాత్రమే. అందుకే అంటారు పెద్దలు.. అమ్మలాలనలోని వాత్సల్యం ఇంకెక్కడా దొరకదని, అమ్మ అనురాగం వంటి ప్రేమానుబంధం దేవుడైనా ఇవ్వలేడని. అలాంటి అమ్మ గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది అమెరికాలోని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ (WHI) నిపుణుల అధ్యయనం. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధ్యయనం చెప్పిందేమిటి?
అమ్మ ప్రేమను పొందడమే కాదు, అమ్మకు ప్రేమను పంచడం కూడా మీ జీవితానికి నిజమైన సార్థకతను చేకూరుస్తుందని, ఆమెకు సైతం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షు ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కూతుళ్లైనా, కుమారులైనా అమ్మతో టైమ్ స్పెండ్ చేయడంవల్ల ఆమె జీవిత కాలాన్ని పొడిగించవచ్చునని, ముఖ్యంగా కూతుళ్లతో ఈ ప్రయోజనం మరింత అధికంగా ఉంటుందని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ (WHI) అధ్యయనం స్పష్టం చేసింది.
ప్రతీ క్షణం విలువైనదే..
అమ్మతో ఎక్కువ సమయం గడపడం, ముఖ్యంగా ఆమెకు చేతగాని వయసులో ఆమెతో స్పెండ్ చేయడం చాలా మేలు చేస్తుంది. ఆ సందర్భంలో కూతుళ్లు లేదా కొడుకుల ప్రతీ నవ్వు, ప్రతీ సంభాషణ, ప్రతీ సానుకూల భావోద్వేగం, నీకు మేమున్నామనే భరోసా అమ్మలో కలిగించే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా ఇటువంటి క్షణాలు ఆమెలో మానసిక ఆనందాన్ని పెంపొందించడమే కాకుండా దీర్ఘాయుష్షును జోడిస్తాయని పరిశోధనలో తేలింది.
25% పెరుగుతున్న ఆయుష్షు
అధ్యయనంలో భాగంగా అమెరికాలోని వుమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ (WHI) పరిశోధకులు కూతుళ్లు తల్లితో స్పెండ్ చేయడం ఆమెను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. అందుకోసం 22,000 మంది మహిళల డేటాను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు 90 సంవత్సరాల వరకు జీవించిన మహిళల ఆయుఃప్రమాణానికి గల కారణాలను విశ్లేషించినప్పుడు, కూతుళ్లు వారితో స్పెండ్ చేయడం వల్లే ఇది సాధ్యమైందని తేలింది. సాధారణ మహిళలతో పోలిస్తే.. కూతుళ్లు తల్లితో ఎక్కువ సమయం గడపడంవల్ల తల్లుల్లో జీవించే అవకాశం 25% ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు.
అనారోగ్యాలు దూరం..
అమ్మతో స్పెండ్ చేయడం కేవలం ఆమె జీవిత కాలాన్ని పొడిగించడం మాత్రమే కాదు, క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుందని, వారు ఆరోగ్యంగా జీవించే అవకాశం కూడా పెరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. అలాగే కార్నెల్ యూనివర్సిటీ పరిశోధనలో సైతం వివిధ ప్రాణులు, మానవుల్లో – మాతృ సంరక్షణ (Mother Care) ఎక్కువ కాలం ఉంటే, ఆ స్పీసీస్ (Species) దీర్ఘాయుష్షును పొందుతుందని తేలింది. అందుకే అమ్మతో గడిపే సమయం ఆమెకు మాత్రమే కాకుండా, మీ మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి, దీర్ఘాయువుకునకు సైతం మేలు చేస్తుంది. బలమైన సంబంధాలను, జీవితంలో సంతోషాలను పెంచుతుంది.






