Sleep Medicine : వారాంతాల్లో అదనపు నిద్ర.. ఆరోగ్యానికి చేసే మేలేంటో తెలుసా?

by Javid Pasha |

6 గంటలకంటే తక్కువ నిద్రపోయేవారు వీకెండ్స్‌లో సగటున 1-2 గంటల అదనపు నిద్ర పొందినప్పుడు గుండె జబ్బుల రిస్క్ 20% వరకు తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

Sleep Medicine : వారాంతాల్లో అదనపు నిద్ర.. ఆరోగ్యానికి చేసే మేలేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ ఉరుకులూ పరుగుల బిజీ జీవితంలో ప్రతిరోజూ కంటి నిండా కునుకు తీయలేకపోతుంటారు చాలామంది. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, తీరిక లేని వర్క్ షెడ్యూల్ వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హార్ట్ ఎటాక్ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే ఇలాంటి వారు వీకెండ్స్‌లో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆ ప్రమాదానికి చెక్ పెట్టవచ్చునని, అదనపు నిద్ర వీరిలో గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుందని పరిశోధలను చెబుతున్నాయి. దీనినే ‘క్యాచ్ - అప్ స్లీప్‌’గా పేర్కొంటున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..

ఇటీవలి అధ్యయనాలతో పాటు 60 వేలమందిపై కొనసాగిన చైనా కాంగ్‌నన్ హెల్త్ స్టడీ ప్రకారం కూడా వారంలో ఆరు గంటలకంటే తక్కువ నిద్రపొందే వ్యక్తులు కూడా, వీకెండ్స్‌లో సగటున 1-2 గంటల అదనపు నిద్ర పొందినప్పుడు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం 20% వరకు తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే యూరోపియన్ హార్ట్ జర్నల్ మెటా - అనాలిసిస్ ప్రకారం చూస్తే.. ప్రతిరోజూ తక్కువ నిద్రపోయేవారు వారాంతాల్లో అధిక నిద్రపోవడంతో దానిని భర్తీ చేసినప్పుడు38% అనారోగ్యాలు, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతున్నట్లు తేలింది.

గుండె జబ్బులకు చెక్

మొత్తానికి వీకెండ్స్‌లో అదనపు నిద్ర(Extra sleep on weekends) అధిక రక్తపోటును, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌(వాపు)ను, అధిక ఒత్తిడిని, మానసిక రుగ్మతలను తగ్గించడంతోపాటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అలాగనీ రోజూ నిద్రపోకుండా వారాంతాల్లో మాత్రమే నిద్రను భర్తీ చేయడం మాత్రం సరైంది కాదు. తప్పని పరిస్థితుల్లో అదనపు నిద్ర 20 నుంచి 38 శాతం వరకు అనారోగ్యాలు, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. కానీ రోజూ తగినంత నిద్రపోవడం మాత్రం వంద శాతం రిస్క్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజూ ప్రశాంతంగా సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

Next Story