- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్యంలో ఎదుర్కొనే ఒత్తిడి.. పెద్దయ్యాక మెదడును ప్రభావితం చేస్తుందా?
బాల్యంలో ఎదురయ్యే ఒత్తిడి లేదా గాయపరిచే ఎక్స్‌పీరియన్స్ మెదడులోని ప్రధాన భాగాలైన అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్‌లో దీర్ఘకాలిక మార్పులను కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి

దిశ, ఫీచర్స్ : బాల్యమంటే.. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా కొనసాగుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందరి అనుభవాలూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొందరు సరదా సరదాగా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తే.. మరికొందరు కుటుంబ పరిస్థితులవల్ల లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఏవైనా సంఘటనలవల్ల చేదు అనుభవాలను సైతం ఎదుర్కొని ఉండవచ్చు. ఏది ఏమైనా బాల్యంలో మనం ఎదుర్కొనే దీర్ఘకాలిక ఒత్తిడి, చేదు అనుభవాలు మెదడును ప్రభావితం చేస్తాయని, తర్వాతి జీవితంలో సైతం కొనసాగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మెదడు భాగాల్లో మార్పులు
‘జర్నల్ ఆఫ్ సైకియాట్రి & న్యూరోసైన్స్ జర్నల్’లో పబ్లిషైన గత పరిశోధనల ప్రకారం.. బాల్యంలో ఎదురయ్యే అనుభవాలు, ముఖ్యంగా ఒత్తిడి లేదా గాయపరిచే ఎక్స్‌పీరియన్స్ మెదడులోని ప్రధాన భాగాలైన అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్‌లో దీర్ఘకాలిక మార్పులను కలిగిస్తాయి. బాల్యంలో ఈ భాగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో, అమిగ్డాలా భావోద్వేగాలు, భయాన్ని ప్రాసెస్ చేస్తుంది. అయితే హిప్పోకాంపస్ జ్ఞాపకశక్తికి, నేర్చుకునే సామర్థ్యానికి సంబంధించినది. కాబట్టి బాల్యంలో దీర్ఘకాలిక ఒత్తిడికి గురికావడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి, ఈ నిర్మాణాల అభివృద్ధిని మార్చేస్తాయి. అందుకే చిన్నప్పుడు ప్రతికూల అనుభవాలు ఎదుర్కొన్న వయోజనులలో అమిగ్డాలా ఓవర్ యాక్టివ్‌గా ఉండి, హిప్పోకాంపస్ చిన్నదిగా ఉండే అవకాశం కూడా ఉంటుందని, ఈ శారీరక మార్పులు భావోద్వేగాలను నియంత్రించడం, ఒత్తిడిని నిర్వహించడం కష్టతరం చేస్తాయని, ఫలితంగా తరచుగా డిప్రెషన్ వంటి పరిస్థితులకు గురయ్యే అవకాశం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
అర్థం చేసుకోవడం ముఖ్యం
బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు తర్వాత జీవితంలో ప్రభావితం చేయడమనేది అందరికీ ఒకేలా వర్తిస్తాయని కూడా చెప్పలేం. వ్యక్తిగతంగా ఫలితాలు మారుతూ ఉంటాయని, మానసిక ఆరోగ్య ఫలితాలపై అనేక కారకాలు కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు అంటున్నారు. అయితే మెదడు జీవితాంతం అద్భుతమైన ప్లాస్టిసిటీని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మెకానిజమ్‌లను అర్థం చేసుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎవరైనా బాల్యంలోని కష్టతర అనుభవాలను ఇప్పటికీ మర్చిపోలేకపోవడం, వాటిని ప్రాసెస్ చేస్తున్న అనుభూతి లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతుండటం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే.. మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






