మీలో ఈ సంకేతాలు కనిపి‌స్తే బీ అలర్ట్..! శరీరానికి విశ్రాంతి అవసరమని అర్థం.

by Javid Pasha |   (  Updated:2025-08-25 14:06:34  IST  )

మీలో ఈ సంకేతాలు కనిపి‌స్తే బీ అలర్ట్..! శరీరానికి విశ్రాంతి అవసరమని అర్థం.
X

దిశ, ఫీచర్స్ : మనుషులన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండరు. వాతావరణాన్ని బట్టి, పనిని బట్టి, ఆలోచనలను బట్టి, అవసరాన్ని బట్టి, అనారోగ్యాలను బట్టి మానసిక, శారీరక లక్షణాలు మారుతుంటాయి. కొన్నిసార్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తే.. మరికొన్ని సార్లు నీరసంగా, నిరాశగా కనిపిస్తుంటారు. కొన్నిసార్లు అలుపెరుగని వ్యక్తిలా శ్రమిస్తూ ఉంటే.. మరికొన్నిసార్లు అలసటకు గురై ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు మీ మనసు ఏదో కోరుకుంటుంది. మీ శరీరం ఏదో ఒక సంకేతాన్ని కనబరుస్తుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు కనబడే శారీరక లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రీతింగ్ ప్రాబ్లమ్స్

సాధారణంకంటే ఎక్కువగా టెన్షన్‌కు గురైనప్పుడు లేదా పని ఒత్తిడి పెరిగినప్పుడు అది పరోక్షంగా లంగ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంలో మీ శరీరంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా శ్వాస అందకపోవడం, రెస్పిరేషన్‌రేట్‌లో అనుకోకుండా హెచ్చు తగ్గులు సంభవించడం కూడా కొందరిలో కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే ఆస్తమాకు దారితీస్తుంది. కాబట్టి మీ శరీరంలో శ్వాస పరమైన ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే పని నుంచి విశ్రాంతి, అలాగే హెల్త్ పరమైన జాగ్రత్తలు అవసరమని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

ఆహారపు అలవాట్లలో మార్పులు

ఏమవుతుంది లే అని కొందరు అలసటలోనూ వర్క్ చేస్తుంటారు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రెస్ట్ లెస్‌గా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆకలిపై ప్రభావం చూపుతుంది. దీంతో సమయం మించిపోతున్నా ఆకలి వేయకపోవడం లేదా అతిగా ఆకలి వేయడం, అలాగే తింటున్నప్పుడు చాలా తక్కువగా లేదా అతిగా తినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఏదో అనారోగ్యం బారిన పడుతున్నట్లు లేదా మీకు దీర్ఘకాలిక విరామం అవసరం ఉందని మీ శరీరం ఇచ్చే సంకేతాలివి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి సంకేతాలను బట్టి తీవ్రమైన అలసటకు గురైతే వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతికూల ఆలోచనలు

రోజువారీ పనులు, వివిధ కార్యకలాపాల్లో మీరు అలసిపోవడంవల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో ఆందోళన, కుంగుబాటు పెరుగుతాయని, క్రమంగా అవి ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కండరాలపై ఒత్తిడి కూడా మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది. దీంతో అధిక ఆందోళన, అధిక రక్తపోటు వంటివి సంభవించవచ్చు. క్రమంగా ప్రతీ విషయంలో ఓవర్ థింకింగ్ చేయడం, ఓవర్‌గా రియాక్ట్ అవడం, ఎదుటి వ్యక్తులు ఏదైనా చిన్నగా మాట్లాడుకుంటే.. తన గురించే అని భ్రమ పడటం, అనుమానించడం వంటివి లక్షణాలు డెవలప్ అవుతాయి. కాబట్టి అతి ఆలోచనలు మీలో కనిపిస్తున్నాయంటే.. మీ శరీరానికి విశ్రాంతి చాలా అవసరం.

ఎనర్జీ లెస్‌గా ఉంటే..

ఎవరైనా సరే.. ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలంటే శారీరకంగా, మానసికంగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. అయితే ఉద్యోగం, వ్యాపారం లేదా వివిధ పనులవల్ల మానసిక ఒత్తిడికి గురైన సందర్భాల్లో అందుకు భిన్నమైన సంకేతాలు కనిపిస్తుంటాయి. శరీరం బలహీనంగా లేదా శక్తి హీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిద్రలేమి, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం లేదా పెరగడం వంటివి కూడా జరగవచ్చు. మీ శరీరం ఈ సంకేతాలను పంపిందంటే పనిని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాల్సిందే!

జీర్ణ క్రియలో మార్పులు

పనిలో లీనమైపోయి సమయానికి తినకపోవడం, అలాగే వర్క్ బర్డెన్ పెరగడం వంటివి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ప్రాబ్లం ఏర్పడ్డాక సమయానికి తిన్నా ఒక్కోసారి మెటబాలిక్ సిస్టం పనితీరు మందగిస్తుంది. అలాగే కడుపులో ఉబ్బరం, స్టమక్ పెయిన్, మలబద్ధకం, వాంతులు విరేచనాలు వంటివి లక్షణాలు కూడా సంభవించవచ్చు. కాబట్టి శరీరం అటువంటి సంకేతాలను కనబరిస్తే మీ శరీరానికి రెస్ట్ అవసరమని గుర్తించాలి. ఆ తర్వాత లక్షణాలను బట్టి అవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించినా తగిన సూచనలు ఇస్తారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Read More..

మూడింట ఒకవంతు టీనేజ్ అమ్మాయిల్లో అవే ప్రాబ్లమ్స్.. పరిష్కారం ఏమిటి?

Next Story