- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజం చిన్నచూపు చూసింది.. సవాలుగా తీసుకొని కేఫ్‌లు నడుపుతున్నారు.!
కొత్త జీవితాలను ప్రారంభించారు.!

సమాజం వాళ్లను చీదరించుకుంది.
చిన్నచూపు చూసింది.
ఛీ అన్నది.
మాతో ఉండొద్దన్నది.
నామోషీగా ఉందని తరిమేసింది.
దిక్కులేని స్థితి.
ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.
పడ్డారు.. లేచారు.
పడిలేచిన కెరటంలా..
కొత్త జీవితాలను ప్రారంభించారు.!
- దిశ, ఫీచర్స్
వాళ్లంతా సమాజంలో వెలివేయబడ్డవాళ్లు. హెచ్ఐవీ పేషెంట్లు.. ట్రాన్స్‌జెండర్లు.. ఖైదీలు.. గిరిజన మహిళలు. జీవిత ప్రయాణంలో ప్రతి అడుగూ వాళ్లకు అడ్డంకిగా మారింది. ప్రతి ప్రయాణమూ ముళ్లదారిగానే సాగింది. ఐతేనేం.. ప్రతి చీదరింపునూ చీకటితో పోరాడేలా మలుచుకున్నారు. ప్రతి చిన్నచూపునూ పెద్ద సవాలుగా తీసుకొని.. సొంతంగా "కేఫ్"లు నడుపుతున్నారు.
ఎకోస్ కేఫ్
ఇది ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో ఉంది. నిత్యం విద్యార్థులకు కాఫీ సుగంధాలతో కొత్త ఆలోచనలు రేకెత్తించే పాయింట్ ఇది. జీవ చైతన్యం ఇక్కడ జీవం పోసుకుంటుంది. ఎందుకంటారా.? ఈ కేఫ్‌ను నడిపేది 'డఫ్ అండ్ డంబ్" టీమ్. వీళ్లకు మాటలు రావు.. అవతలి వాళ్లు చెప్పింది వినపడదు. సమాజం దృష్టిలో ఇదొక వైకల్యమే అయుండొచ్చు. కానీ ఇక్కడెప్పుడు సంభాషణల అంతరం ఏర్పడలేదు. క్యూ కార్డులు.. సైన్ చార్టులు.. టేబుల్ బజర్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని అద్భుతంగా కేఫ్‌ను నడిపిస్తున్నారు.
కేఫ్ పాజిటివ్
ఇది చిన్నస్థలం. కానీ హృదయం చాలా పెద్దది. కోల్‌కతాలోని బల్లీగంజ్‌లో ఉంటుంది. దీనిని హెచ్ఐవీ పాజిటివ్ బాధిత యువత రన్ చేస్తున్నారు. హెచ్ఐవీ బాధితులు నడిపుతున్న దేశంలోని మొదటి కేఫ్ ఇదే. హెచ్ఐవీ వైరస్‌పై సమాజంలో ఉనన కళంకాన్ని ధైర్యంగా సవాలు చేస్తూ సాగుతున్న పాజిటివ్ కేఫ్ ఇది. గ్యారేజీని కేఫ్‌గా మార్చి డబ్బు సంపాదించడమే కాదు స్థిరత్వం.. స్వీకృతి సందేశాన్నీ ఇస్తున్నారు. గౌరవంతో.. స్వయంకృషితో ఎదుగుతున్నారు. కేవలం ఆరోగ్య స్థితే మానవత్వాన్ని నిర్వచించదని చాటిచెప్తున్నారు.
రైటర్స్ కేఫ్
ఇక్కడికి ఎక్కువగా పుస్తక ప్రియులు వస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదొక లైబ్రరీలా అనిపిస్తుంది. చెన్నయ్‌లోని పీటర్స్ రోడ్‌లో ఈ కేఫ్ ఉంది. యాసిడ్ దాడి బాధితులు దీనిని నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ అండ్ విక్టిమ్ కేర్ (పీసీవీసీ) ఎన్‌జీఓ సహకారంతో ఈ కేఫ్ నడుస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి ఈ రకమైన ఉపాధి కల్పిస్తున్నారు. గౌరవం.. ఆత్మవిశ్వాసం.. జీవితాన్ని పునర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తూ యాసిడ్ దాడి బాధితులు దీనిని రన్ చేస్తున్నారు. ఇదొక ఆహారాన్నందించే సెంటర కాదు.. ఆశ.. స్థిరత్వానికి ఒక దీపస్తంభంలా పనిచేస్తోంది.
ప్రకృతిక్ కేఫ్
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ప్రకృతిక్ కేఫ్ ఉంది. ఇదొక జీరో కరెన్సీ.. జీరో వేస్టేజ్ కేఫ్. ఇక్కడ ఆహారం కంటే దాని తత్వశాస్త్రానికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ ఉచితంగానే భోజనం పెడతారు. వాళ్లకు తోచిన సాయమేదైనా చేస్తే తీసుకుంటారు. గిరిజన యువత ఈ కేఫ్‌ను నడుపుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ ధవల్ పటేల్ దీనిని స్థాపించారు. సామాజిక ఉద్ధరణను మేళవించే ఈ కేఫ్ శక్తి గిరిజన యువతే. ఈ గజిబిజీ జీవితంలో తిండి కోసం క్రెడిట్ కార్డులు.. డెబిట్ కార్డుల స్వైపింగ్‌లు.. యూపీఐల గడబిడలేవీ లేకుండా కమ్మని ఆహరాన్ని కడుపునిండా పెడుతోంది ప్రకృతిక్ కేఫ్.
తిహార్ ఫుడ్‌కోర్ట్
ఇది ఢిల్లీలోని తిహార్ జైలు సముదాయంలో ఉంటుంది. ఇండియాలోనే అతిపెద్ద జైలు సముదాయం ఇది. ప్రతి తాండీతో ఖైదీల కథను పున:రచన చేసే సెంటర్ అన్నమాట. హాస్పిటాలిటీలో శిక్షణ పొందిన ఖైదీలచే ఈ కేఫ్ నడుస్తోంది. ఎన్నో తప్పులు చేసి.. ఏవో నేరాలు చేసి జైలులో శిక్షణ అనుభవిస్తూ కుటుంబాలను కలుసుకునేందుకు పరితపిస్తూ బాధ్యత గుర్తొచ్చిన ఖైదీలు ఇక్కడ పనిచేస్తారు. ఒకరకంగా వారిలో పునరావాసాన్ని ప్రసాదించేందుకు చేస్తున్న ప్రయత్నమిది. అందుకే "మీరు పెట్టేది సాధారణ ఫుడ్ కాదు.. ఇది విముక్తికొక వేదిక" అంటుంటారు కస్టమర్లు.






