- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

అందరూ ఉన్నొళ్లే ఉండరు.
కొందరు పూట గడవనివాళ్లు కూడా ఉంటారు.
బయటకెళ్తే భోజనం చేసే స్థోమత కూడా ఉండదు కొందరికి.
అలాంటి వారి ఆకలి తీర్చడానికి..
సామాజిక రిఫ్రిజిరేటర్లు శ్రీకారం చుట్టుకుంటున్నాయి.
ఆకలితో అలమటించేవాళ్లకు బుక్కెడు తిండిపెట్టిస్తున్నాయి.
- దిశ, ఫీచర్స్
ప్రపంచ ఆకలి సూచికలో ఇండియాది 105వ స్థానం. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ఇండియా తీవ్రమైన ఆకలిస్థాయిని కలిగి ఉంది. దీని స్కోరు 27.3. దాదాపు 19 కోట్లమంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో తిండి దొరకనివాళ్లు.. దొరికినా పోషకాలు లేనివాళ్లూ ఉన్నారు.
ఇవ్వండి.. తీసుకోండి
సమాజంలో తీవ్రమవుతున్న ఆకలిని అరికట్టడానికి "సామాజిక రిఫ్రిజిరేటర్" కాన్సెప్ట్ అమలువుతోంది. మిగిలిన ఆహారాన్ని ఇచ్చే గుణం.. మానవత్వంతో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం ఇది. రెస్టారెంట్ల బయట.. వర్తక సముదాయాలు.. చౌరస్తాలు.. రద్దీ ఫుట్‌పాత్‌లపై ఇవి వెలుస్తున్నాయి. "మీకు మిగిలింది ఇక్కడ పెట్టండి.. అవసరమైంది తీసుకోండి" అనే కాన్సెప్ట్‌తో సోషల్ రిఫ్రిజిరేటర్లు పనిచేస్తున్నాయి. వీటికోసం ఎలాంటి అభ్యర్థనలు.. కాగితాలు.. ప్రశ్నలు అవసరం లేదు. స్వేచ్ఛగా ఎవరికేం కావాలో తీసుకెళ్లొచ్చు.. అలాగే అవసరం లేనివి పెట్టిపోవచ్చు.
హ్యాపీ ఫ్రిడ్జ్ మూమెంట్
ఢిల్లీ నడిబొడ్డులో ఈ "హ్యాపీ ఫ్రిడ్జ్"లు ఉంటాయి. స్థానికులు రొట్టెలు.. అన్నం.. కూరగాయలు ఇక్కడ పెడతారు. అవసరం ఉన్నవారు వీటిని తీసుకెళ్లి తింటారు. కూలీల నుంచి సామాన్య వ్యక్తి వరకు ఎవరొచ్చినా రోజంతా భోజనం అందుబాటులో ఉంటుంది. ఆహారం అందిస్తున్నామని కాకుండా.. సమాజంలో అందరికీ గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో హ్యాపీ ఫ్రిడ్జ్ మూమెంట్ జరుగుతోంది. మీరుచేసేది దానధర్మం కాదు.. సాటి మనిషికి చేసే సాయం అని భావించాలని ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నారు. "ఫీడింగ్ ఇండియా" సంస్థ ఈ మూమెంట్‌ను తీసుకొచ్చింది.
ఫుడ్ ఏటీఎం
మనీ ఏటీఎంలు.. వాటర్ ఏటీఎంలు కాదు ఫుడ్ ఏటీఎంలు కూడా చాలాచోట్ల కనిపిస్తున్నాయి. అయితే వీటికోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కోల్‌కతాలోని రెస్టారెంట్ల యజమానులు.. స్వచ్ఛంద సేవకుల బృందం ఈ "ఫుడ్ ఏటీఎం"లను ప్రారంభించారు. రెస్టారెంట్లలో మిగిలిన ఆహారాన్ని.. ఇంట్లో వండితే తినగా మిగిలిన ఆహారాన్ని ఫుడ్ ఏటీఎంలు అని పిలవబడే సామాజిక రిఫ్రిజిరేట్లలో నింపుతారు. అది ఖాళీ అయ్యేలోపే ఇంకా చాలా ఆహారం రెడీగా ఉంటుంది. "మంచి ఆహారం వృథా కాకూడదు.. ప్రజలు ఆకలితో నిద్రపోకూడదు" అనేది వారి ఉద్దేశం.
అయ్యమిట్టు ఉన్
అందరికీ తిండి దొరకాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రారభించిన సామాజిక రిఫ్రిజిరేటర్ ఇది. చెన్నయ్ నగరంలోని బసంత్ నగర్ టెన్నిస్ క్లబ్ ఆవరణలో ఈ ఫ్రిడ్జ్ నడుస్తోంది. "మీరు తినే ముందు ఇంకెవరికైనా పెట్టండి" అనే తమిళ సామెత నుంచి ప్రేరణ పొంది దీనిని స్థాపించారు. డాక్టర్ ఇస్సా ఫాతిమా జాస్మిన్ దీనిని ప్రారంభించారు. స్థానికులు నిశ్శబ్దంగా ఇంట్లో వండిన ఆహారం.. పండ్లు.. వాటర్ బాటిల్స్‌ను తీసుకొచ్చి ఈ ఫ్రిడ్జ్‌లో పెడతారు. కైండ్‌నెస్ రిఫ్రిజిరేటర్‌గా స్థానికులు పిలుచుకునే ఈ ఫ్రిడ్జ్‌లో ఏదో ఒకటి పెట్టడం స్థానికులకు ఆచారంగా మారింది.
షేరింగ్ షెల్వ్
ఇంట్లో వండిన భోజనం రోజూ ఎంత వృథాగా పోతోంది.. దానివల్ల ఎంత డబ్బు వృథా అవుతున్నట్టో గ్రహించండి అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే "షేరింగ్ షెల్వ్" సామాజిక రిఫ్రిజిరేటర్. ఇది గురుగ్రామ్‌లో ఉంటుంది. 100 కంటే ఎక్కువ కుటుంబాలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంట్లో వండిన ఆహారాన్ని క్రమం తప్పకుండా ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టడం స్థానికులకు దినచర్యలో భాగమైపోయింది. ఇది పరస్పర విశ్వాసంతో నడిచే కార్యక్రమం. ఆహార వృథాను అరికడుతూనే ఆకలిని నిశ్శబ్దంగా.. సమర్థవంతంగా తగ్గించడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
రోటీ బ్యాంక్
ఇది ముంబైలో ఉంటుంది. పోలీస్ కమిషనర్ శివానందన్ దీనిని ప్రారంభించారు. ఇది కేవలం రిఫ్రిజిరేటర్ మాత్రమే కాదు. ఇదొక పూర్తిస్థాయి ఆహార రక్షణ కార్యక్రమంగా చెప్పుకుంటారు స్థానికులు. స్వచ్చంద సేవకులు ఇండ్లు.. క్యాటరర్లు.. రెస్టారెంట్లు.. ఈవెంట్లలో మిగిలిన ఆహారాన్ని సేకరిస్తారు. నగరవ్యాప్తంగా అవసరమైన వారికి పంపిణీ చేస్తారు. అంకిత హెల్ప్‌లైన్ సాయంతో డెలివరీ వ్యవస్థను అనుసంధానం మంచి ఆహారం చెత్తకుండీలోకి చేరకముందే ఆకలితో ఉన్నవారికి చేరేలా "రోటీ బ్యాంక్" కృషి చేస్తోంది. రోజూ వేలాది మంది భోజనాలు అందిస్తుంది.






