Behaviors : సాధారణ విషయాలే కానీ..

by Javid Pasha |
Behaviors : సాధారణ విషయాలే కానీ..
X

దిశ, ఫీచర్స్ :

కొన్ని ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తాయ్..

మరికొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయ్..

కొన్ని సందర్భాలు భావోద్వేగాలను ప్రేరేపిస్తాయ్..

మరికొన్ని భవిష్యత్తును నిర్దేశిస్తాయ్..

కొన్నిసార్లు అతి ఆలోచనలతో సతమతమౌతుంటాం..

మరికొన్నిసార్లు అసూయతో దిగజారిపోతుంటాం..

అవును.. రోజువారీ జీవితంలో అనేక ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు, భావాలు, భావోద్వేగాలు సహజమే అయినా.. అవి మన ప్రవర్తను నియంత్రిస్తాయని, జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతీ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తుంటారు. అట్లనే ప్రతీ వ్యక్తికీ పర్సనల్ అంశాలతోపాటు సామాజిక జీవితాలు ఉంటాయి. అందుకు తగిన ప్రవర్తనలూ కనిపిస్తుంటాయి. అయినా సరే కొన్నిసార్లు ఎవరి గురించి ఎవరికీ అర్థం కాకపోవచ్చు. మెరిసేదంతా బంగారం కాదన్నట్లు పైకి మంచిగానే అనిపించేవన్నీ అసలుకే పనికి రానివై ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఇవి పనికే రావనుకునే విషయాలు సైతం అత్యంత ప్రభావితం చేసేవై విలసిల్లవచ్చు. నివురు గప్పిన నిప్పులెక్క.. ఎన్నటికీ తొణకని నిండు కుండలెక్క నిజమైన జ్ఞానమెప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుందని మేధావులు చెబుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా..? మనిషి ప్రవర్తనలోనూ అనేక కోణాలుంటాయనే అసలు విషయాన్ని గ్రహిస్తే.. ఈ సమాజంలో మీరెలా మసలుకోవాలో తెలుసుకోవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. నిద్ర, నవ్వు, ఏడుపు, బాధ, అసూయ, ఆవేశం వంటివన్నీ ఆ కోవకే చెందుతాయని చెబుతున్నారు. వీటివెనుక కూడా మనకు తెలియని సీక్రెట్ థింగ్స్ ఉండవచ్చునని పేర్కొంటున్నారు.

నిద్రపోతే విశ్రాంతి లభించినట్టేనా?

నిద్ర.. ప్రతీ ఒక్కకిరీ అవసరం. అయితే నిద్రపోవడమనేది ఎల్లప్పుడు ఆరోగ్యం, విశ్రాంతితో ముడిపడిన విషయంగానే చూస్తుంటాం. ఒక వ్యక్తి ఎక్కువగా నిద్రపోతుంటే ఏంటది కుంభకర్ణుడిలా అంటుంటారు కొందరు. కానీ మీ కుటుంబంలో ఎవరైనా తరచుగా నిద్రపోవడానికే మొగ్గు చూపుతుంటే మరో కోణంలో కూడా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివెనుక అసలు విషయం (Secret Thing) వేరు అయి ఉండవచ్చు. ఒక వ్యక్తి ఎక్కువ సమయం నిద్రపోతూ కూడా అలసిపోయినట్లు కనిపిస్తుంటే.. అది ఆ వ్యక్తికి లేదా చూసే ఇతర వ్యక్తులకు వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ తరచూ ఒక వ్యక్తి ఇతరుల నుంచి తప్పించుకొని నిద్రపోవడానికి, ఒంటరిగా ఉండటానికి ప్రయారిటీ ఇస్తున్నారంటే.. ఆ వ్యక్తి మానసిక ఒత్తిడి, ఆందోళన, తీవ్రమైన అలసట, అసంతృప్తి భావాలతో పోరాడుతుండవచ్చునని మానసిక నిపుణులు అంటున్నారు. అంటే ఇక్కడ తాత్కాలిక సమస్యల నుంచి రిలీఫ్ కోసమో, భావోద్వేగాలు సీక్రెట్‌గా ఉంచుకునేందుకో చాలా మంది ఆశ్రయించగల సులువైన మార్గం ఏంటంటే.. నిద్రపోవడం. అంటే ఇది కేవలం విశ్రాంతి కోణంలోనేకాదు, కనిపించని బాధలవల్ల కూడా కావచ్చుననమాట.

భావోద్వేగాల నియంత్రణ

చిన్న విషయాలకే అతిగా స్పందించేవారు, చిన్న మాటకే అతిగా ఫీలయ్యేవారు కూడా మనకు ఎక్కడో ఒకదగ్గర తారసపడుతుంటారు. ఆయా సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకునేవారు చాలా మందే కనిపిస్తుంటారు. ఎక్కువ బాధ కలిగించేవి లేదా ఆనందాన్ని కలిగించేవి ఇలా ఏవైనా సరే భావోద్వేగాలకు నెలవైన సందర్భాల్లో కొందరి ప్రవర్తన చూసేవారికి బాధగానో, వింతగానో అనిపించిస్తూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి అలా తీవ్రంగా స్పందించడం, ముఖ్యంగా భావోద్వేగానికి లోనై ఏడుపు ఆపుకోలేకపోవడం అనే ఆ వ్యక్తి ప్రవర్తన వెనుక గల సీక్రెట్ ఎంత మందికి అర్థం అవుతుంది?. ఇక్కడ అర్థం చేసుకోతలగడమే అసలైన విజ్ఞుల లక్షణం. అతిగా స్పందించగల వ్యక్తులు, ఎమోషనల్ అయ్యే వ్యక్తులు చాలా సున్నిత మనస్కులై ఉండవచ్చు. ఇతరుల బాధల్ని తమ బాధగా భావించేవారు కూడా అయ్యుండవచ్చు. వారిలో ఎమోషన్స్ మాత్రమే కాదు, తెలివి కూడా ఎక్కువే ఉండవచ్చు.

చిరు నవ్వు చిందిస్తుంటే..

ఎవరైనా చిరునవ్వు చిందిస్తుంటే.. సంతోషంగా ఉన్నారనుకుంటాం. సహజంగానే అది ఆనందానికి ప్రతీకగా భావిస్తాం. పైగా మొహంపై చిరు నవ్వును చూసినప్పుడు పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. అయితే ఎప్పుడూ నవ్వడం కూడా కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. సమయం, సందర్భం లేకుండా మీరు నవ్వుతూ ఉంటే చూసిన వారికి అసహ్యంగా అనిపిస్తుంది. పైగా వీళ్లకేమైనా పిచ్చా? అనుకునేవారు లేకపోలేదు. కాగా వ్యక్తులు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వెనుక కూడా ఇతరులకు తెలియని రహస్యాలు ఉండవచ్చు అంటున్నారు నిపుణులు నిపుణులు. ముఖ్యంగా వారు లోన్లీనెస్‌తోనో, డిప్రెషన్‌తోనో బాధపడే వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు. గుండె లోతుల్లో పెల్లుబికే బాధలు, భావోద్వేగాలను దాచుకోవడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చు. అందుకే ప్రతీ నవ్వు సంతోషమే కాదు, సమస్యలను, భావోద్వేగాలను బయటకు కనబడకుండా దాచుకోవడానికి, ఎవరికీ చెప్పుకోలేని బాధలను అణచివేయడానికి మరో మార్గం కూడా కావచ్చు. సో.. నవ్వుతున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారనుకోవద్దు.

మౌనం వెనుక రహస్యం

మౌనం.. కొందరు అర్ధాంగికారమంటారు. మరికొందరు అమాయకత్వం అంటారు. ఇంకొందరు వ్యూహం అంటారు. కాబట్టి ఒక వ్యక్తి మౌనంగా ఉంటున్నారంటే.. ఆ ప్రవర్తన వెనుక ఏదైనా ఒక కారణం ఉండే ఉంటుంది. కొంతమందిని చూస్తుంటాం. ఎక్కువసేపు మౌనంగానే ఉంటారు. అవసరం మేరకు మాత్రమే స్పందిస్తుంటారు. పలకరిస్తేనే పలకరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా సరే తక్కువగానే స్పందిస్తుంటారు. చూసేవారికి వీరిలో పొగరు, ఈగో, గర్వం ఎక్కువేమో అనిపిస్తుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయేమోనని సెటైర్లు కూడా వేస్తుంటాం. కానీ ఇలా మౌనంగా ఉండేవారు మానసికంగా దృఢమైన వారిగానూ ఉంటారని మనస్తత్వశాస్త్రం బెబుతోంది. కాబట్టి మౌనం అమాయకత్వమనో, అహంకారమనో అనుకోవాల్సిన అవసరం లేదు. మనిషి ప్రవర్తనలో అదో అలంకారం కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో వాస్తవానికి అదో పవర్ ఫుల్ వెపన్ కూడా. అలాగనీ ప్రతీ సందర్భంలోనూ మౌనం మంచిది కాదు. సామాజిక కోణంలో చూస్తే మేధావుల మౌనం అస్సలు మంచిది కాదు.

అబద్ధం.. నిజం.. అసలు కోణం

నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే వస్తాయని కొందరిని సంబోధించడం మనం తరచూ వింటూనే ఉంటాం. అబద్ధం చెప్పడం మంచిది కాదు. అయితే ప్రతీ సందర్భాన్ని అలాగే చూడలేం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అబద్ధం చెప్పే వ్యక్తులు కూడా బాధితులనే రహస్యం చాలా మందికి తెలియదు. ఏంటంటే.. తమపై తమకు నమ్మకం లేనివారు, ఆత్మ విశ్వాసం లేనివారు, ఒక విషయంలో సరైన అవగాహన లేనివారు తరచుగా అబద్ధాలు ఆడే అవకాశం ఎక్కువ. అంతేకాదు జీవితంలో ఏదైనా ఒక విషయంలో తరచుగా అభద్రతా భావంతో ఉండేవారే ఎక్కువగా అబద్ధాలు ఆడుతుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అంటే వీరూ బాధితులే.. కాకపోతే ఇతరుల ముందు తమను గొప్పగా చెప్పుకోవడానికి, ఇతరుల్లో తమపట్ల బెస్ట్ ఇంప్రెషన్ రావడానికి, తమకు నచ్చని అణచి వేయడానికి అబద్ధాలు ఆడుతుంటారు. అందమైన అబద్ధాలతో పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే అబద్ధం ఆడే ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక చాలామంది గ్రహించలేని ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉండవచ్చు. బాల్యంలో బాధాకరమైన సంఘటనలను ఎక్కువగా ఎదుర్కొన్నవారు, సమాజంలోనో, కుటుంబంలోనో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురై నవారు పెద్దయ్యాక ఎక్కువగా అబద్ధాలాడే అవకాశం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఇదే అబద్ధం వెనుక అసలు రహస్యం. సో అర్థమైంది కదూ.. ప్రతీ ప్రవర్తన వెనుక ఒక రహస్యం ఉంటుందని. అవి సాధారణ విషయాలుగానే అనిపించవచ్చు కానీ.. నిర్లక్ష్యం చేస్తే సమస్యలుగా మారవచ్చు. కాబట్టి మాట, ప్రవర్తన, నడవడిక ఏదైనా సరే సరైంది కానప్పుడు మంచివైపు మార్పు అవసరం అంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed