- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూసింది పూసింది.. సన్‌ఫ్లవర్ సిటీ.!
10,000కి పైగా పొద్దుతిరుగుడు గింజల్ని ఉచితంగా పంచి చెన్నయ్‌ని "సన్‌ఫ్లవర్ సిటీ"గా మారుస్తోంది

దిశ, ఫీచర్స్: చెన్నయ్ అంటే గుర్తొచ్చేవి ట్రాఫిక్.. ఉక్కపోత. ఇప్పుడు ఈ కోవలోకి మరో కొత్త పేరు చేరబోతోంది. అదే "పసుపుపూల నగరం". ఏదో ఒక ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కాదు.. సిటీలో ఎక్కడచూసినా పసుపు పచ్చ అందాలే. ఈ అద్భుతానికి కారణం ఒకే ఒక్క మహిళ. ఆవిడే షెఫాలీ దాదాభాయ్. సుమారు 10,000కి పైగా పొద్దుతిరుగుడు గింజల్ని ఉచితంగా పంచి చెన్నయ్‌ని "సన్‌ఫ్లవర్ సిటీ"గా మారుస్తోంది.
వాట్సాప్ గ్రూప్ ప్రారంభం..
2024లో షెఫాలీ నుంగంబాక్కం రూఫ్‌టాప్‌లో 15×30 అడుగుల స్థలంలో 1000 సన్‌ఫ్లవర్ గింజల్ని నాటింది. అవి పెరిగి పూలు పూస్తుంటే తనకు ఎంతో ఆనందం కలిగింది. ఆ ఆనందం తనకే పరిమితం కాకుండా చెన్నయ్ మొత్తం అనుభూతి పొందితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అలా పుట్టిందే #SunflowerCity ఉద్యమం. ఆలోచన వచ్చిన వెంటనే షెఫాలీ ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించింది. అలాగే @chennai.sunflowercity పేరుతో ఇన్‌స్టా గ్రామ్ కూడా తెరిచింది. ఎవరైనా సన్ సప్లవర్ సీడ్స్.. మొక్కలు కావాలంటే ఉచితంగా ఇస్తానని ప్రకటించి వార్తల్లో వ్యక్తి అయ్యింది.
వచ్చి నేర్చుకోవచ్చు..
షెఫాలీ ఇప్పటివరకు 10000కు పైగా సన్‌ఫ్లవర్ మొక్కలను పంచింది. దాదాపు150 ఇండ్లు.. పాఠశాలలు.. కార్పొరేట్ కార్యాలయాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. పిల్లలు.. పెద్దలు.. రిటైర్డ్ అయిన పెద్దమనుషులు కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్‌మెన్‌లు కూడా చేయి కలిపి సన్‌ఫ్లవర్ సిటీకి తమవంతు కృషి చేస్తున్నారు. మొక్కలు.. గింజలతో పాటు.. ఉచిత డిజిటల్ గైడ్.. వర్మీకంపోస్ట్ టిప్స్.. పంచగవ్య సమాచారం కూడా షెఫాలీ ఇస్తోంది. అంతేకాదు ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా తను డెవలప్ చేసిన రూఫ్‌టాప్ గార్డెన్‌కు వచ్చి నేర్చుకోవచ్చు. వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు.
సైన్స్ ప్రాజెక్టుగా..
సన్‌ఫ్లవర్ సిటీ వల్ల చెన్నయ్ తన రూపురేఖల్ని మార్చేసుకుంటోంది. ఏప్రిల్.. ఆగస్టు నెలల్లో పూసే పొద్దు తిరుగుడు పూలతో అందంగా కనిపిస్తుంది. దీనివల్ల తేనెటీగలు.. సీతాకోకచిలుకలు ఆకర్షితమై బయోడైవర్సిటీ పెరిగే అవకాశముంది. మట్టిలోని టాక్సిన్స్.. హెవీ మెటల్స్‌ను పీల్చేసే గుణం దీనికుంది. ఇంకో విషయమేంటంటే వీటికోసం ఎక్కువ నీళ్లు అవసరం లేదు. కేసీ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఫోటోట్రోపిజం సైన్స్ ప్రాజెక్టుగా వీటిని పెంచారు. దిండివనంలో గిరీష్ పాండియన్ పెట్రోల్ బంక్ దగ్గర 300కు పైగా మొక్కలు నాటారు. కస్టమర్లు పెట్రోల్ కొట్టించినంక అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు.






