- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టగొడుగుల సాగుతో నెలకు రూ.13 లక్షల సంపాదన.!
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు

దిశ, ఫీచర్స్: రాజస్థాన్‌కు చెందిన శంకర్ మీనా వాళ్లు తమ పొలంలో గోధుమలు, ఆవాలు సాగు చేసేవాళ్లు. వాళ్ల నాన్న పొలంలో రాత్రింబవళ్లు కష్టపడినా ప్రకృతి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని ఆదాయం అనిశ్చితంగా ఉండేది. బాగా సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని శంకర్ కామర్స్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసి ఆర్‌ఏ పొదార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏలో చేరాడు.
ఎంబీఏ మధ్యలోనే మానేసి..
ఎంబీఏలో చేరాడు కానీ.. శంకర్ ధ్యాసంతా వ్యాపారం మీదనే ఉండేది. ఎంబీఏ అయిపోయేదెప్పుడు.? తనకు జాబ్ వచ్చేదెప్పుడు.? ఆ వచ్చే జీతంతో ఇప్పటికిప్పుడు కుటుంబ కష్టాలను తీర్చగలనా అనే ఆత్మ పరిశీలన చేసుకొని 2012లో ఎంబీఏను మధ్యలోనే మానేశాడు. రకరకాల వ్యాపారాలు చేసినా ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. 2017లో శంకర్ 'జీవన్ మష్రూమ్' కంపెనీని స్థాపించాడు. బటన్, ఓయిస్టర్, లయన్స్ మేన్, పాడీ స్ట్రా, షిటాకే, గనోడెర్మా, పోర్టోబెల్లో వంటి వివిధ రకాల మష్రూమ్ విత్తనాలను విక్రయించడం ప్రారంభించాడు.
వద్దని వారించారు..
రాజస్థాన్‌లోనే మొట్టమొదటి వాణిజ్య మష్రూమ్ స్పాన్ ల్యాబ్‌ను నడుపుతూ నెలకు 80 టన్నుల స్పాన్‌లను ఉత్పత్తి చేస్తున్నాడు శంకర్. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు భూటాన్, నేపాల్, యూఏఈ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ నెలకు రూ.13 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఎంబీఏ మానేసి వ్యాపారంలోకి రావడం.. నిలదొక్కుకోవడం అంత ఈజీగా జరగలేదు. వ్యాపారం పెడతా అనగానే అందరూ అతడి సామర్థ్యాలను సందేహించారు. ఈ వయసులో వ్యాపారం చేయడం కాకుండా కెరీర్‌పై దృష్టి పెట్టమని చెప్పారు.
చిన్న గదిలో..
2015లో శంకర్ సోలన్‌లోని ఐసీఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్‌కు వెళ్లి మష్రూమ్ సాగు గురించి నేర్చుకున్నాడు. సోలన్‌లోని ఐసీఏఆర్ నుంచి మదర్ కల్చర్‌ను తెచ్చి తన ఇంటి గ్యారేజీలో తాత్కాలిక 'జుగాడ్' ల్యాబ్‌ను ఏర్పాటు చేసి స్పాన్‌లను పరీక్షా ప్రాతిపదికన తయారు చేయడం ప్రారంభించాడు. తన ఇంట్లో ఒక చిన్న గదిని ఖాళీ చేసి మష్రూమ్ సాగు కోసం ఏర్పాటు చేశాడు. కొన్ని నెలల్లో రాజస్థాన్‌లో మష్రూమ్ స్పాన్‌లను తయారు చేసే ఒక్క యూనిట్ కూడా లేదని గమనించాడు. హిమాచల్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాలపై ఆధారపడవలసి వచ్చేది. ఇది అతడికి ఒక అద్భుతమైన అవకాశంగా కనిపించింది.
నెలకు 80 టన్నుల ఉత్పత్తి..
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.9 లక్షల రుణం, కుటుంబం, స్నేహితుల ఆర్థిక సహాయంతో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ల్యాబ్‌ను నిర్మించాడు. ఈ ల్యాబ్‌లో సీడ్ జెర్మినేషన్ ఛాంబర్స్, వెర్టికల్ ఆటోక్లేవ్‌లు, లామినార్ ఎయిర్‌ఫ్లో క్యాబినెట్‌ల వంటి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియా సహాయంతో బల్క్ ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు నెలకు 80 టన్నుల స్పాన్‌లను ఉత్పత్తి చేస్తోంది. కిలో రూ.90-115 ధరలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ స్పాన్‌లకు భారీ డిమాండ్ ఉంది.
అవార్డులు సైతం..
జీవన్ మష్రూమ్ కేవలం స్పాన్‌ల ఉత్పత్తితోనే ఆగలేదు. రాజస్థాన్‌లోని మష్రూమ్ సాగు శిక్షణ కేంద్రంగా కూడా పనిచేస్తున్నారు. వ్యవసాయ విద్యార్థులు, మష్రూమ్ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లను అందిస్తున్నారు. వేలాది మందిని శిక్షణ ఇచ్చి, మష్రూమ్ వ్యవసాయ వ్యాపారులుగా మార్చారు. శంకర్ కృషి, నాణ్యతపై దృష్టి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2019లో రాజస్థాన్ ప్రభుత్వం నుండి 'ప్రోగ్రెసివ్ & ఇన్నోవేటివ్ ఫార్మర్' అవార్డు.. 2020లో స్టార్టప్ ఇండియా నుండి 'ఇన్నోవేటివ్ అగ్రికల్చరల్ స్టార్టప్' అవార్డు అందుకున్నాడు.






