Health : సంతానలేమికి దారితీస్తున్న దీర్ఘకాలిక ఒత్తిడి.. ఇదిగో కారణాలు!

by Javid Pasha |

దీర్ఘకాలికి మానసిక ఒత్తిడి వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి రీప్రొడక్టివ్ హార్మెన్ లెవెల్స్ పడిపోతాయి. సంతానలేమికి కారణం అవుతాయి.

Health : సంతానలేమికి దారితీస్తున్న దీర్ఘకాలిక ఒత్తిడి.. ఇదిగో కారణాలు!
X

దిశ, ఫీచర్స్ : దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి సాధారణంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలిసిందే. కానీ అది సైలెంట్లీ మానవ సంతానోత్పత్తి (fertility)పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఇటీవలి అధ్యయనాలు ఇదే చెబుతున్నాయి. స్త్రీ పురుషులందరిపైనా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే మహిళల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంటున్నదని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళల్లో అధికం..

స్ట్రెస్ మానవ శరీరంలో నిశ్శబ్దంగా పనిచేసి సంతానోత్పత్తిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. పురుషుల్లో ఇది స్పెర్మ్ మోటిలిటీ/కౌంట్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. మహిళల్లో మరిన్ని అధిక సమస్యలకు కారణం అవుతుంది. ప్రధానంగా అధిక ఒత్తిడి వల్ల మహిళల్లో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, హైపోథాలమిక్ - పిట్యూటరీ-గొనాడల్ (HPG) యాక్సిస్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల గొనాడోట్రిపిన్-రిలీజింగ్ హార్మోన్ (GnRH) విడుదల తగ్గి ఎల్‌హెచ్( LH)& ఎఫ్ఎస్‌హెచ్ (FSH) హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా అండం విడుదల(Ovulation) ఆలస్యమవుతుంది లేదా అసంపూర్ణంగా జరుగుతుందని అధ్యయనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితి మెన్‌స్ట్రువల్ సైకిల్ అసమతుల్యతకు దారితీసి, సంతాన సాఫల్యతకు ఇబ్బందులు కలిగిస్తుంది.

పునరుత్పత్తి హార్మోన్లు తగ్గతాయి

అంతేకాకుండా దీర్ఘకాలికి స్ట్రెస్ వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి రీ ప్రొడక్టివ్ హార్మెన్ లెవెల్స్ మారిపోతాయి. ఇది లూటియల్ ఫేజ్‌ను చిన్నగా చేసి, అండాశయ విధానాల(ovarian mechanisms)ను దెబ్బతీస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఓవ్యులేషన్(Ovulation) విండో సమయంలో అధిక స్ట్రెస్ ఉన్న మహిళల్లో గర్భధారణ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇలాంటి హార్మోనల్ అసమతుల్యతవల్ల అండం నాణ్యత కూడా ప్రభావితం అవుతుంది. ఇంప్లాటేషన్ సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల ఒత్తిడి సహజమే కదా అని దీర్ఘకాలంపాటు నిర్లక్ష్యం చేస్తూ పోతే.. దాని నుంచి బయటపడకపోతే అది నిశ్శబ్దంగా మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.

పరిష్కారం ఏమిటి?

అధిక మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం పెద్ద పనేం కాదు. మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, సరైన ఆహారాలను తీసుకోవడం వంటివి చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. అధ్యయనాలు ప్రకారం.. శరీరం సహజంగా పనిచేయాలంటే.. మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ మనసును చిన్నా భిన్నం చేసి, మీలో ప్రతికూల ఆలోచనలను పెంచే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. దీని నియంత్రణకు అనేక పద్ధతులు, మార్గాలు కూడా ఉన్నాయి. రోజువారీ వ్యాయామాలు, యోగా, డీప్ బ్రీతింగ్, సాయంకాలం ప్రశాంతమైన నడక వంటివి కార్టిసాల్ స్థాయిలను తగ్గించి హార్మోన్ల సమతుల్యతకు దోహద పడతాయి. మానసిక ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వండి, తగినంత నిద్ర, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వంటి చిన్న చిన్న మార్పులతోనే మీ ఫెర్టిలిటీ హెల్త్ మెరుగు పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మానసిక, ఆరోగ్య వైద్య నిపుణులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పాటించడం ద్వారా ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. వైద్యుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Next Story