నువ్ సూపర్ మావా.. మోడలింగ్‌ను వదిలేసి చీపురు చేత పట్టాడు.!

by Daayi Srishailam |

శుభ్రతా ఉద్యమాన్ని నడిపిస్తూ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు

నువ్ సూపర్ మావా.. మోడలింగ్‌ను వదిలేసి చీపురు చేత పట్టాడు.!
X

దిశ, ఫీచర్స్: గురుగ్రామ్ వీధులు చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. సెర్బియాకు చెందిన లాజర్ జంకోవిక్ దీనిని చూసి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు దీని గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలి.? ఒకవేళ చేశామే అనుకో వాళ్లు సక్రమంగా స్పందిస్తారా.? అని ఆలోచించాడు. ఫిర్యాదు కంటే చర్య తీసుకోవడం బెటర్ అనుకున్నాడు. కట్ చేస్తే.. శుభ్రతా ఉద్యమాన్ని నడిపిస్తూ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు.

గుడ్ మార్నింగ్ గురుగ్రామ్..

లాజర్ గురుగ్రామ్‌కు వచ్చినప్పుడు ఒకరకంగా ఒక మిషన్‌నే కనుగొన్నాడు. పొద్దున్నే జనాలు ఇంకా నిద్రలేవకముందే గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. జనాలు విచిత్రంగా చూస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా చేతికి చెత్త సంచులు తగిలించుకున్నాడు. ఫుట్‌పాత్‌లపై రాపర్‌లను ఏరుకుంటున్నాడు. కాలువలకు అడ్డమొచ్చిన చెత్తను శుభ్రం చేస్తున్నాడు. వీధుల్లో నిండివున్న దుమ్ము.. ధూళిని ఊడుస్తున్నాడు. ఒక చేతిలో చీపురు.. మరొక చేతిలో తన సంకల్పంతో ముందుకెళ్లాడు లాజర్ జంకోవిక్. చప్పట్ల కోసమో.. లేదా హెడ్‌లైన్స్ కోసమో అతడు ఈ పని చేయడం లేదు. అతను ఎలాంటి ఎన్‌జీఓ రన్ చేయడం లేదు. ఫండింగ్ కూడా లేదు. అయినప్పటికీ నగరాలను శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు.

వైరల్ అవడంతో..

ఇండియాలో సంవత్సరానికి 62 మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో చాలా భాగం వీధుల్లో, విభజన లేకుండా, నిర్వహణ లేకుండా పడిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లు, పబ్లిక్ స్థలాల్లో చెల్లాచెదురుగా పడి ఉంటున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకొని లాజర్ ఒక ఆదివారం రోజున గురుగ్రామ్ శుభ్రత డ్రైవ్ నిర్వహించాడు. వాస్తవానికి దీనికోసం ముందస్తుగా ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అయితే అతని వీడియోలు వైరల్ కావడం వల్ల స్థానికులు దీనిని సండే డ్రైవ్‌గా మార్చేశారు. లాజర్ పిలుపు మేరకు ప్రతీ సండే అతడు రాకముందే జనాలు బ్యాగ్‌లు, చీపురులతో సిద్ధంగా ఉండేవారు. వర్షం వల్ల ఓవర్‌ఫ్లో అయిన కాలువలను శుభ్రంచేయడం.. విసిరేసిన ఫుడ్ రాపర్‌లను ఏరడం.. చెత్త కుప్పలను సేకరించడం చేశారు.

ఏక్ దిన్.. ఏక్ గల్లీ..

లాజర్‌ను ఆశ్చర్యపోయాడు. అది ప్రజలు చెత్తను శుభ్రం చేసినందుకు కాదు. ప్రజల ఇన్వాల్వ్‌మెంట్ చూసి ఆశ్చర్యపోయాడు. యాక్చువల్‌గా లాజర్ 2018లో మోడలింగ్ కాంట్రాక్ట్ కోసం ఇండియాకు వచ్చాడు. సెర్బియాలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. కానీ ఇండియా అతన్ని ఊహించని ఆకర్షణకు గురిచేసింది. దోసె, బటర్ చికెన్‌కు ఫిదా అయిపోయిన అతడిని ఒక దృశ్యం కలవరపరిచింది. అదే చెత్త. ఇండియన్స్ ఇండ్లను శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ వీధులనెందుకు నిర్లక్ష్యం చేస్తారు అనే ఆలోచన వచ్చింది. బెంగళూరులో ఆరు సంవత్సరాల తర్వాత 2024లో గురుగ్రామ్‌కు వచ్చిన అతను “ఏక్ దిన్, ఏక్ గల్లీ” అని వాగ్దానం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను దాదాపు రోజూ బయటకు వెళ్లి.. పరిసరాలను శుభ్రం చేస్తున్నాడు.

మనవాళ్లకే సవాల్..

లాజర్ నిశ్శబ్దంగా ఎక్కడికి వెళ్లినా చెత్త ఏరుకుంటాడు. బెంగళూరులో ఆరు సంవత్సరాల్లో 20కి పైగా శుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాడు. ఇండియా గేట్ ముందు విస్తృత స్థలాన్ని శుభ్రం చేయడానికి వన్ మేనేజ్‌మెంట్ అనే సివిక్-టెక్ ప్లాట్‌ఫామ్‌తో చేతులు కలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన సందేశాన్ని విస్తృతంగా చేరవేస్తున్నాడు. కాలువల నుంచి చెత్తను తీసే వీడియోలు వైరల్ అయ్యాయి. స్థానికులు నిర్లక్ష్యం చేసే పనిని ఒక విదేశీయుడు చేయడం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది.. వివిధ నగరాల్లో 100 మందికి పైగా అతని డ్రైవ్‌లలో చేరడానికి ప్రేరేపించింది. మోడలింగ్ కోసం ఇండియా వచ్చినప్పటికీ వీధులను శుభ్రం చేస్తూ పర్యావరణం పట్ల, ఇండియా పట్ల తనకున్న ప్రేమను చాటుతున్నాడు. మన హిందీ కూడా నేర్చుకొని మనవాళ్లకే సవాల్ విసురుతున్నాడు.

Next Story