ఎలాంటి పరిస్థితుల్లోనైనా కదిలే అతి చిన్న జెల్లీ రోబో! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

by Javid Pasha |

శాస్త్రవేత్తలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల అతిచిన్న స్మార్ట్ రోబోను రూపొందించారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా కదిలే అతి చిన్న జెల్లీ రోబో! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : రోబోటిక్ టెక్నాలజీ ఎన్ని మార్పులకు దారితీస్తున్నదో తెలిసిందే. అయితే ఇటీవల యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, అలాగే క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని క్రియేట్ చేశారు. వారు జెల్లీ లాంటి మృదువైన మెటీరియల్‌తో ఒక సాఫ్ట్ రోబోట్‌ను రూపొందించారు. విషయం ఏమిటంటే.. ఇది ఎటువంటి ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉండదు. కానీ బయటి ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ల సహాయంతో మార్పు చెంది పనిచేస్తుంది. అదెలా సాధ్యం? దీనివల్ల ఉపయోగామిటో తెలుసుకుందాం పదండి.

ఎలా పనిచేస్తుంది?

సాంకేతిక శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ అతిచిన్న రోబో తనను తాను ఏ ఆకారంలోనైనా సర్దుబాటు చేసుకుంటుంది. దానిలోపల ఎటువంటి పరికరాలు లేకపోయినా బయటి విద్యుత్ క్షేత్రాల సహాయంతో మార్పు చెందుతూ.. కదులుతూ పనిచేస్తుంది. అదెలా సాధ్యం అవుతుందంటే.. దీనిని ఎలక్ట్రో-మార్ఫింగ్ జెల్ (e-MG) అనే స్మార్ట్ మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల అది అవసరానికి తగినట్లుగా సాగడం, వంగడం, తిరగడం వంటివి చేయగలదు. ఇరుకైన లేదా క్లిష్టమైన ప్రదేశాల్లో సైతం ప్రయాణించగలదు.

ఉపయోగాలేమిటి?

ప్రయోగాల్లో భాగంగా పరీక్షించినప్పుడు అతిచిన్న మానవ రూపం సైజు గల ఈ ఎలక్ట్రో-మార్ఫింగ్ జెల్ (e-MG) రోబో అద్భుతం చేసింది. జిమ్నాస్ట్ లాగా మెలికలు తిరుగుతూ 10 వేలకంటే ఎక్కువసార్లు నిరంతరంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్ రోబోటిక్స్‌లో పెద్ద మార్పు తెస్తుందని, ‘స్విస్ ఆర్మీ నైఫ్’లాగా మల్టిపుల్‌గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వైద్య చికిత్సల్లో శరీర భాగాలకు మందులను అందించడం, సున్నితమైన ప్రదేశాల అన్వేషణ, ఇరుకైన చోట్ల సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు వంటి అనేక రంగాల్లో దీనిని ఉపయోగించవచ్చుని చెబుతున్నారు.

Next Story