పాలకూర ఆకులతో హార్ట్ రిపేర్.. పునరుత్పాదక వైద్య చరిత్రలో మరో అద్భుతం!

by Javid Pasha |

శాస్త్రవేత్తలు స్పినాచ్ ఆకుల సిరల నిర్మాణాన్ని ఉపయోగించి మానవ గుండె కణజాలాన్ని పునరుద్ధరించే పద్ధతిని కనుగొన్నారు.

పాలకూర ఆకులతో హార్ట్ రిపేర్.. పునరుత్పాదక వైద్య చరిత్రలో మరో అద్భుతం!
X

దిశ, ఫీచర్స్ : గుండె వైఫల్యానికి, తద్వారా మరణానికి దారితీస్తున్న కారణాల్లో దాని కణజాలం క్షీణత కూడా ఒకటి. కానీ భవిష్యత్తులో ఈ సమస్యకు మరో సులువైన చక్కటి పరిష్కారం అందుబాటులోకి రావచ్చు. ఎందుకంటే.. అమెరికాలోని వర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్(WPI) సహా పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలకూర ఆకుల(spinach leaves) సహజ సిరల నిర్మాణాన్ని ఉపయోగించి మానవ హృదయ కణజాలాన్ని పెంచడంలో సక్సెస్ అయింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం!

కణజాలం పునరుద్ధరణపై ఆశలు

పునరుత్పాదక వైద్య రంగంలో మరో అద్భుతాన్ని క్రియేట్ చేశారు శాస్త్రవేత్తలు. స్పినాచ్ ఆకుల సిరల నిర్మాణాన్ని ఉపయోగించి క్షీణించిన మానవ గుండె కణజాలాన్ని పునరుద్ధరించే పద్ధతిని కనుగొన్నారు. ఇది పునరుత్పాదక వైద్య రంగంలో (regenerative medicine) ఒక ముఖ్యమైన పురోగతిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఈ మెథడ్ ద్వారా హార్ట్ టిష్యూస్ దెబ్బతిన్న రోగులకు సులువైన పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా జీవనకాలం పొడిగించవచ్చు. అంతేకాకుండా కొత్త చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులోకి వస్తాయి.

ప్రయోగం.. ఫలితం

ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు పాలకూర ఆకులను నుంచి తీసిన మొక్క కణాల(By decellularization method)ను తొలగించారు. దీనివల్ల సెల్యూలోజ్‌‌తో కూడిన సన్నని సిరల నెట్‌వర్క్ మాత్రమే మిగిలింది. ఇది మానవ రక్త నాళాల నిర్మాణానికి అనుగుణంగా, సమానంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఆ తర్వాత ఈ స్కాఫోల్డ్‌(scaffold)పై మానవ హృదయ కణాలను (cardiomyocytes) ఉంచారు. అప్పుడు ఈ కణాలు ఆకు సిరల్లో అతుక్కొని పెరిగాయి. అలాగే కొన్ని రోజుల తర్వాత స్వయంగా సంకోచించి (beating) అచ్చం హార్ట్‌ బీట్ మాదిరి పనిచేశాయి. ఈ ఆవిష్కరణతో హృదయ కణజాలానికి అవసరమైన రక్త నాళాల నెట్‌వర్క్ సమస్యను సహజంగా పరిష్కరించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో మల్టిపుల్ పాలకూర ఆకులను కలిపి లేయర్లుగా హృదయ కవచాలు (cardiac patches) తయారు చేసి హార్ట్ అటాక్ ద్వారా దెబ్బతిన్న గుండె భాగాలను రిపేర్ చేయవచ్చునని ఆశిస్తున్నారు. ఈ పరిశోధన బయో ఇంజినీరింగ్ రంగంలో ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన ఒక అద్భుతమైన ముందడుగు అని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు.

Next Story