వాటన్ ఐడియా సర్ జీ.. చిప్స్ ప్యాకెట్స్‌‌తో స్కూల్ పర్నీచర్ చేశారు.!

by Daayi Srishailam |

సర్కారు బడుల్లో బెంచీలు, కుర్చీలు తయారు చేస్తోందొక స్టార్టప్.

వాటన్ ఐడియా సర్ జీ.. చిప్స్ ప్యాకెట్స్‌‌తో స్కూల్ పర్నీచర్ చేశారు.!
X

దిశ, ఫీచర్స్: పిల్లలు అన్నం కంటే ఎక్కువ చిరుతిళ్లే తింటున్నారు. చిప్స్ ప్యాకెట్స్.. చాక్లెట్, బిస్కెట్ కవర్స్.. ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వాటితో పర్యావరణం పాడవుతుంది. దీంతో ఏం చేయొచ్చని ఆలోచించి.. సర్కారు బడుల్లో బెంచీలు, కుర్చీలు తయారు చేస్తోందొక స్టార్టప్.

సర్కారు పాఠశాలలకు పిల్లల్ని ఎందుకు పంపడం లేదు అనే ప్రశ్న వస్తే ఫస్ట్ మనకు ఏం గుర్తుకు వస్తాయి.? బెంచీలు, కుర్చీలు లేక నేలపై కాళ్లు మడిచి, వీపు వంచి, నోట్ బుక్స్ మోకాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ కూర్చునే దృశ్యాలే కదా.? అందరూ సర్కారు బడులు గొప్పవనే చెప్తారు కానీ.. ఎవ్వరూ వాటిని బాగుచేసే ఆలోచన చేయరు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిందే బెంగళూరుకు చెందిన "అన్‌వుడ్ స్టార్టప్".

అన్‌వుడ్ స్టార్టప్..

మనం సర్వసాధారణంగా ఉపయోగించే ఫర్నీచర్ తయారీకి ఏటా సుమారు 80 లక్షల నుంచి 130 లక్షల ఘన మీటర్ల కలప అవసరం. 2030 నాటికి ఈ డిమాండ్ 133.4 లక్షల ఘన మీటర్లకు పెరగవచ్చనే అంచనా. ఇదే సమయంలో ప్లాస్టిక్ కవర్లు పాఠశాలల వెలుపల, ల్యాండ్ ఫిల్‌లు నిండిపోతున్నాయి. వ్యర్థ ప్యాకెట్లు కాలువలను అడ్డుకుంటున్నాయి. కల్తీ వ్యర్థాల కుప్పులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇవి వేరు చేయక, రీసైకిల్ చేయక పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. ఇలా వృథాగా పోతున్న ప్లాస్టిక్ కవర్ల నుంచి సర్కారు బడులకు అవసరమయ్యే ఫర్నీచర్ తయారు చేయడమే "అన్‌వుడ్ స్టార్టప్" లక్ష్యం.

అవసరమైన ఫర్నీచర్‌గా..

పాఠశాలల్లో సరైన ఫర్నీచర్ లేకపోవడం, వ్యర్థ వ్యవస్థల వైఫల్యం ఒకదానికొకటి పరిష్కారంగా మారితే ఎలా ఉంటుందని "అన్‌వుడ్ స్టార్టప్" నిర్వహుకులు ఆలోచించారు. కేవలం నాలుగు నెలల్లో "అన్‌వుడ్ స్టార్టప్" 10 టన్నుల రీసైకిల్ చేయడం కష్టమైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఫర్నీచర్‌గా మారుస్తుంది. అదికూడా కలపలాంటి ఆకృతి కలిగిన మన్నికైన ఫర్నీచర్‌గా. దీనిద్వారా చెట్లను రక్షించి, CO₂ ఉద్గారాలను తగ్గి్స్తున్నారు. "అన్‌వుడ్" ఒక సాహసోపేత ఆలోచనతో పుట్టింది. ఎవరూ కోరుకోని ప్లాస్టిక్ వ్యర్థాలను అందరికీ అవసరమైన ఫర్నీచర్‌గా మారుస్తుంది.

రీసైకిల్ చేయని..

"అన్‌వుడ్ స్టార్టప్" కో ఫౌండర్ విశాల్ మెహతా. జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, అడవులను రక్షించడం గురించి మాట్లాడే ముందు "అన్‌వుడ్ స్టార్టప్" గురించి తెలుసుకుంటే మంచిది. విశాల్ "అన్‌వుడ్ స్టార్టప్"ను స్థాపించేకంటే ముందు ఇన్‌‌‌‌‌ఫ్రా‌స్ట్రక్చర్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పనిచేశాడు. సస్టెయినబుల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నప్పుడు ఎన్నో వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా సన్నని, తక్కువ విలువైన ప్లాస్టిక్ వ్యర్థం ఒక పెద్ద సవాలు. దాన్ని ఎవరూ రీసైకిల్ చేయరు. పారవేయడం ఒక్కటే మార్గం అనుకుంటారు.

44000 చిప్స్ ప్యాకెట్స్‌తో

చిప్స్, బిస్కెట్, కిరాణ సామాన్యు, పీపీఈ కిట్స్, డెలివరీ బాక్సులను చుట్టే ఈ ప్లాస్టిక్ మురికిగా, కల్తీగా ఉండటం వల్ల రీసైకిల్ చేయడం సంక్లిష్టంగా ఉంటుంది. 2021లో ఒక మీటింగ్‌లో ఇంజినీర్, ఆవిష్కర్త, మెటిరియల్స్ సైంటిస్ట్ అయిన డాక్టర్ బాబు పద్మనాభన్‌ను కలిశాడు విశాల్. ప్లాస్టిక్ వ్యర్థ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో పాటు అడవుల నరికివేతను నివారించే ఒక పదార్థాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది కలపలాగా కనిపించింది. కానీ అది పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారైంది. ఈ ఆలోచన నచ్చడంతో విశాల్ 44,000 చిప్స్ ప్యాకెట్లతో బెంచీలు, కుర్చీలు తయారుచేసి పేద విద్యార్థుల జీవితాలను మార్చేశాడు.

Next Story