- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: చీరలు అమ్మాలంటే పెద్ద షోరూమ్ ఉండాలి. ఇంకా భారీ పెట్టుబడి పెట్టాలి. మనకు తెలిసి ఇవే అవసరమని అనుకుంటాం. కానీ.. హైదరాబాద్‌కు చెందిన సంగీత రాజేష్ ఇవేవీ అవసరం లేదని నిరూపించింది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చీరలు అమ్ముతూ పెద్ద విజయం సాధించింది. చీరలంటే నూరో.. వెయ్యో కాదు. ఏకంగా 10 లక్షలకు పైగా చీరలమ్మింది.
ఆన్‌లైన్ ఎగ్జిబిషన్లు..
సంగీత మొదట్లో ప్రీ-ప్రైమరీ కరికులమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఫ్యాషన్ రంగంపై మక్కువతో నిఫ్ట్‌లో చేరింది. మచిలీపట్నం.. శ్రీకాళహస్తి వంటి ప్రాంతాలకు వెళ్లి కళంకారి.. చేనేత కళల గురించి అధ్యయనం చేసింది. కోర్సు తర్వాత ఒక చిన్న బొటిక్‌ను ప్రారంభించించింది. కానీ ఊహించని నష్టాలు వచ్చాయి. అది ఆమెకు పెద్ద పాఠం అయింది. సంప్రదాయ దుకాణాలకు బదులు డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకొని 2015 నుంచి ఆన్‌లైన్ ఎగ్జిబిషన్లు చేస్తూ ఫేస్‌బుక్ లైవ్ స్టార్ట్ చేసింది. ఐఎస్‌బీలో చదివిన అనుభవంతో వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది.
ఫేస్‌బుక్ లైవ్..
సంగీత బిజినెస్ స్పెషాలిటీ ఫేస్‌బుక్ లైవ్ షోలు. సూరత్ సిల్క్ మిల్స్.. కాంచీపురం హ్యాండ్లూమ్ కేంద్రాలు.. కళంకారి వర్క్‌షాప్‌లకు వెళ్లి అక్కడి నుంచే 6-8 గంటల పాటు లైవ్ ప్రసారం చేస్తుంది. ప్రతి చీరను చూపిస్తూ దాని ఫాబ్రిక్.. డిజైన్ల గురించి ఒక కథలా చెప్తుంది. లైవ్ చూసేవారు నచ్చిన చీరను వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు. మధ్యవర్తులు లేకుండా చేనేత కార్మికుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరేలా చూస్తారు. ఒక్క షోలో తక్కువలో తక్కుత 5 వేల చీరలు అమ్ముడు పోతాయి. రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. రూ.600 నుంచి రూ.45 వేల వరకు ధర ఉన్న చీరలను లైవ్ ద్వారా చూపిస్తుంది సంగీత.
10 లక్షల చీరలు..
గత పదేళ్లలో సంగీత ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 8.5 లక్షలకు మించిన ఫాలోవర్లను సంపాదించింది. వారి ద్వారా దాదాపు 10 లక్షలకు పైగా చీరలు అమ్మింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు రోడ్‌షోలు చేస్తూ ప్రాంతీయ చీరలను ప్రపంచానికి చేరుస్తోంది. లాజిస్టిక్స్.. కస్టమర్ సపోర్ట్.. సోషల్ మీడియా టీమ్‌లు ఏర్పాటుచేసి సంగీతాస్ సారీ ఎంపోరియం ద్వారా 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఇటీవలబంజారా హిల్స్‌లో 5 వేల చదరపు అడుగుల షోరూమ్‌ను ఓపెన్ చేసింది సంగీత. ఈ షోరూంలో దాదాపు 15 వేలకు మించిన చీరలు అందుబాటులో ఉన్నాయి.
పైసా లేకపోయినా..
సంగీత ఏదో తన వ్యాపారం చేసుకొని చేతులు దులుపుకోవడం లేదు. చేనేత కార్మికులు.. డిజైనింగ్ కళాకారులకు మంచి మార్కెట్‌ను చూపిస్తుంది. వారసత్వ చేనేత కళలను కొత్త తరానికి వినూత్న రీతిలో పరిచయం చేస్తుంది. వ్యాపారంలో వినూత్నతతో పాటు సామాజిక బాధ్యత అవసరమని తెలియజేస్తోంది. చేతిలో పెట్టుబడి కోసం పైసా లేకపోయినా ఒక స్మార్ట్‌ఫోన్‌తో సామ్రాజ్యం నిర్మించవచ్చు సంగీత తన సక్సెస్ ద్వారా నిరూపిస్తోంది. ఏడాదికి 3-5 మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న ఈ మోడల్ లైవ్ కామర్స్‌కు మార్గదర్శకం. తన సక్సెస్ స్టోరీ సృజనాత్మకత.. పట్టుదలతో ఏదైనా సాధ్యమే అని చెప్తోంది.






