- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్: "అవేం సదువుల్రా వానాకాలం సదువులు" అంటుండె ఎన్కటికి. అట్లుండేది మరి అప్పుడు. "సదువు శారెడు.. బల్పాలు దోశెడు" అని శాస్త్రం అప్పుడు పుట్టిందిగానీ.. అది ఇప్పటి పిల్లలకు కరెక్టుగా సెట్ అవుతుంది. ఫీజులు, కొత్త బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌ను చూస్తే ఇదే గుర్తుకొస్తుంది. కానీ 90sలో స్కూలంటే అదొక స్వీట్ మెమొరీ. ఈ ఫీజులు, బ్యాగుల బరువులేవీ లేని పీస్‌ఫుల్ డేస్ అవి.
కొత్త పుస్తకాల వాసన
సమ్మర్ హాలిడేస్ అయిపోయి జూన్‌లో మల్లా స్కూల్స్ రీ ఓపెన్ చేస్తుంటే స్కూళ్ల కాడ ఓ జాతర కనిపించేది. ఓ వారందాక అసలు పాఠాలే షురూ కాకపోతుండె. రెండ్రోజులైతే స్కూల్స్ ఓపెనైతయనంగనే పుస్తకాలొచ్చేవి. క్లాస్ పెబ్బలను, స్కూల్ దగ్గర్లుండే పిల్లలను పిలిపించి ఆ పుస్తకాల లోడ్‌ను దించి ఆఫీస్ల పెట్టిస్తుండె. మల్లతెల్లారి ఆ బుక్స్ అన్నింటినీ క్లాస్ వైజ్ వేరు చేస్తుండె. ఆ ప్యాకింగ్స్ ఇప్పుతుంటే.. హ్మ్ హా.. కొత్త పుస్తకాల వాసన నశాళానికి తాకేది. సదువుడేందో ఏమోగానీ ఆ వాసన యాదికొస్తే ఆ మాజా వేరుంటుండె.
ఉబ్బితబ్బి పోతుండె
స్కూల్ ఓపెనింగ్ రోజు యూనిఫామ్‌ల కాకుండా మామూలు చమ్కీల అంగీ వేసుకొనే పోతుంటిమి. ఎందుకంటే ఆ దినం పుస్తకాలిస్తరు. కొత్త క్లాసులోకి పోతున్నమనే సంబరం, కొత్త పుస్తకాలిస్తున్రనే సంబరంతో స్టూడెంట్స్ ఉబ్బితబ్బిపోతుండె. ఫస్ట్ పెద్ద తరగతులకు పుస్తకాలు ఇచ్చేది. రూల్ నెంబర్ పిలిచి బుక్సన్నీ సరిగ్గా ఉన్నయా లేవా అని చెక్ చేసి ఎవరి పుస్తకాలు వాళ్ల చేతిలో పెడుతుండేది. ఇగ ఆ రోజంతా వాటిని చూసుకొని మురిసిపోవుడే ఉండేది. "అరే నాకు కొన్ని పేజీలు మిస్సయినయిరా" అని ఒకరు.. నాకు "డబల్ బుక్స్ వచ్చినయి" అని ఒకరు ముచ్చట్లు పెట్టేది.
బర్త సంచిలే బ్యాగులు
బుక్స్ తీసుకున్నంక కూడా మల్ల తెల్లారి ఎవరూ తీస్కొచ్చెటొళ్లు కాదు. ఎందుకంటే బ్యాగు లేదు కాబట్టీ. ఇప్పటిలెక్క రెడీ మేడ్ బ్యాగులుండకపోయేది. యూరియా సంచులతో బుక్స్ అన్నీ పట్టేటట్లు కొత్త సంచిని కుట్టిపించేది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అన్ని సంచులు వారి క్లాసును బట్టి కుట్టిస్తుండె. అందరూ ఒకేసారి టైలర్‌కు ఇచ్చేది కాబట్టీ.. ఎంతలేదన్నా రెండ్రోజులు పట్టేది బ్యాగ్ స్కూల్‌కు తీస్కపోతందుకు. టీచర్లుగూడ కొత్త రిజిష్టర్లు రాసుడు, పేర్లెక్కిచ్చుడు బిజీల ఉండేది. అందుకే పాఠాలు చెప్పెటందుకు వారం రోజులు పట్టేది. ఇగ అప్పటిదాక టైంపాసే అన్నమాట.
లెటర్ రాసి కాపీలకు
బ్యాగులు తయారయ్యేదాక ఉత్తగుండి ఏంజేస్తమని కాపీలు/నోట్ బుక్స్ కోసం పొయ్యేది. కాపీలకు పోవాలె అని ఇంట్ల పైసలు అడుక్కొని మంచిగా తయారై సైకిళ్ల మీద టౌన్‌కు పోతుంటిమి. కాపీలకు పోతందుకు స్కూళ్లల్ల స్పెషల్ పర్మిషన్ ఉంటుండె. "శ్రీయుత గౌరవ నీయులైన టీచర్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా, అయ్యా నేను ఈ రోజు కాపీలు కొనుకొచ్చుకుంటందుకు పోతున్నా, పర్మిషన్ ఇవ్వగలరు" అని తెల్లకాగితం మీద లెటర్ రాసి క్లాస్ టీచర్‌కి ఇచ్చి పోయేది. తెలుగు కాపీ, ఇంగ్లీష్ కాపీ, సాంఘీక కాపీ అని దేనికవే రేట్లుండేవి.
లేపాక్షి నంది నోట్ బుక్స్
నోట్‌బుక్స్ రెండు మూడు రకాలుండేవి. అందరిక కన్నూ "లేపాక్షి నంది" నోట్ బుక్స్ మీదనే ఉండేది. ఇంటికాడ ముందే చెప్పి పైసలు తీసుకొచ్చేది. "లేపాక్షి నంది నోట్ బుక్స్ కొనిస్తెనే స్కూల్‌కి పోతా.. లేకపోతే పోనే పోనూ" అని ఏడిస్తే పోతేపోనీలే అని ఓ వంద రూపాయలు ఇచ్చెటొళ్లు. అన్నీ తీసుకొని ఆఖరికి ఎక్స్ ట్రా రెండు బుక్స్ ఎక్కువ తీసుకున్నా 70-80 రూపాయల కంటే ఎక్కువ గాకపోతుండె. ఇగ వాటిని ఇంటికి తీస్కపోయి తిర్లేశి మర్లేశి తీరు తీరు అట్టలేస్కొని పెట్టుకునేది. టైలర్ దగ్గరికెల్లి తీసుకొచ్చిన బర్తసంచిలో పుస్తకాలు, కాపీలు పెట్టుకొని భుజానికేసుకొని స్కూల్‌కి పోతుంటే మస్తుంటుండె.
యూనిఫాం కోసం డుమ్మా
పుస్తకాలొచ్చినయి, కాపీలొచ్చినయి, వాటిని పెడ్తందుకు బర్త సంచులొచ్చినయి. కానీ యూనిఫామ్స్ కుట్టియ్యలేదు కదా.? వారం పది రోజులు రేపు ఏస్కొస్తా మాపేస్కొస్తా అని చెప్పి మధ్యలో ఒకట్రెండు రోజులు డ్రెస్సు లేదనే సాకుతో డుమ్మాగొట్టి, ఇంకో రోజంతా టైలర్ దగ్గర్నే కాపుగాసి మొత్తానికి పక్షం రోజులకు యూనిఫాంతోని స్కూల్‌కు పోతుంటిమి. అందరివీ కొత్త డ్రెస్సులు, కొత్త పుస్తకాలే కాబట్టీ క్లాసంత ఓ కొత్త రకం వాసనొచ్చేది సూడున్రీ అబ్బా.. ఇప్పటికీ ఆ స్మెల్ అట్లనే మైండ్ల తిరుగుతుంది. ఇప్పటి పిల్లల స్కూళ్లు, బ్యాగులు, బుక్సూ చూస్తుంటే ఎందుకో గతమొక స్వీట్ మెమొరీలా యాదికొచ్చింది.






