సిటీ సెంటర్ టు ఔటర్ వరకు రోడ్ నెట్‌వర్క్

by Daayi Srishailam |   (  Updated:2026-01-04 12:59:45  IST  )

ఔటర్ టు త్రిపుల్ ఆర్ వరకు సైతం విస్తరణ

సిటీ సెంటర్ టు ఔటర్ వరకు రోడ్ నెట్‌వర్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ మహా నగరంలోని సెంటర్ సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్ఆర్)కు ట్రాఫిక్ చిక్కుల్లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించింది. గ్రేటర్ లో వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. అయితే నగరానికి రాకుండానే ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లడానికి ఓఆర్ఆర్‌ను నిర్మించారు. కానీ సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు వెళ్లడానికి మాత్రం వాహనదారులకు నరకయాతనే. నగరంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. మెహదీపట్నం, ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట, సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా మెహదీపట్నం వరకు ఉన్నది. ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌కు చేరేందుకు ఇప్పటికే ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ ట్రాఫిక్‌తో రద్దీగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు ఎలివేటెడ్ కారిడార్ల పనులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

సికింద్రాబాద్ నుంచి ఔటర్‌కు…

సికింద్రాబాద్ ప్రాంతం నుంచి నాగ్ పూర్, కరీంనగర్ మార్గాల్లో వెళ్లడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌–కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్‌ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట, తూంకుంట మీదుగా 18.100 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. జాతీయ రహదారి 44లోని హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి సుచిత్ర సమీపంలో ఉన్న డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.320 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ రానుండగా.. ఇందులో బేగంపేట ఎయిర్‌పోర్టు బాలంరాయ్‌ వద్దే దాదాపు 600 మీటర్ల మేర అండర్‌పాస్‌ రానుంది. ప్యారడైజ్‌ నుంచి ఫ్లైఓవర్‌ ప్రారంభమై ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌పాస్‌లోకి వెళ్లి.. ఆ తర్వాత మళ్లీ ఫ్లైఓవర్‌ ప్రారంభమై డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు రానుంది. వీటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

షేక్‌పేట్ నాలా నుంచి…

సిటీ సెంటర్ అసెంబ్లీ, లక్డికాపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం ప్రాంతాల నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ఆర్)కు వెళ్లడానికి టోలిచౌకి ఫ్లైఓవర్, షేక్‌పేట ఫ్లైఓవర్ మీదుగా రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి వెళ్లడానికి అవకాశముంది. అయితే ఈ రోడ్డులో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తప్పడంలేదు. ఈ నేపథ్యంలో షేక్ పేట్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లకుండా..మణికొండ మీదుగా వెళ్లడానికి కారిడార్ ను డెవలప్ చేయడానికి హెచ్ఎండీఏ రూ.110 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తోంది. షేక్‌పేట నాలా నుంచి గండిపేట కాండూట్‌ వెంట మణికొండ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి పైపులైన్‌ మార్గంలో సీబీఐటీ వరకు సరికొత్త రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గండిపేట కాండూట్‌ వెంట ఇప్పటికే రోడ్డు ఉండగా.. దాన్నీ ఇరువైపులా 200 అడుగుల మేర విస్తరించడానికి కసరత్తు చేస్తున్నారు. తర్వాత ఈ మార్గంలో ఏడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించడానికి హెచ్ఎండీఏ భావిస్తున్నది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ చిక్కుల్లేకుండా ఔటర్ వెళ్లేందుకు మార్గం సుగమమవుతోందని అధికారులు చెబుతున్నారు.

బంజారాహిల్స్‌ నుంచి బయటకు…

హైదరాబాద్ నడరం నడిబొడ్డ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెళ్లేందుకు రూ.1600 కోట్లతో ఎలివేటెడ్ నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డీపీఆర్ కోసం హెచ్ఎండీఏ రిక్వెస్ట్ ఫర్ ఫ్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) నుంచి ఫిలింనగర్‌, జడ్జెస్‌ కాలనీ, దుర్గం చెరువు, టీ-హబ్‌, శిల్పా లే-అవుట్‌ ఫ్లై-ఓవర్‌ వరకూ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.

ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు…

ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్ఆర్)తో రీజినల్ రింగ్ రోడ్డు(త్రిపుల్ ఆర్)ను అనుసంధానం చేయడానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఔటర్​ రింగ్​ రోడ్డు రావిర్యాల జంక్షన్​ నుంచి మీర్​ఖాన్​పేట, అక్కడి నుంచి అమన్​గల్​ వరకు రూ.4,621కోట్ల వ్యయంతో 41.50 కిలోమీటర్ల పొడవుతో రతన్​టాటా గ్రీన్​ఫీల్డ్​ రహదారి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతోపాటు బుద్వేల్​ నుంచి టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ 167 జాతీయ రహదారి వద్ద కోస్గి వరకు 86 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీచేశారు.

Next Story