ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు ప్రమాదం పొంచి ఉన్నట్లే..

by Naga Rani Yarlagadda |

వృద్ధులలో ఎక్కువగా కనిపించే గుండెపోటు సమస్య ఇప్పుడు యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు ప్రమాదం పొంచి ఉన్నట్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధులలో ఎక్కువగా కనిపించే గుండెపోటు సమస్య ఇప్పుడు యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలిలో తలెత్తిన మార్పులు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు దీనికి ప్రధాన కారణాలు కావడంతో యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చు.

గుండెపోటు పెరుగుతున్న ప్రధాన కారణాలు

యువతలో గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదలకు ప్రధానంగా ఆహార అలవాట్లు, శారీరక శ్రమలో లోపం, మానసిక ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఉప్పు, చక్కెరతో కూడిన పదార్థాల వినియోగం, ఫిజికల్ యాక్టివిటీ లోపం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.

ధూమపానం, మద్యం, డ్రగ్స్ వాడకాలు రక్తనాళాలను కుదించివేసి రక్త ప్రసరణను దెబ్బతీస్తాయి. అలాగే డయాబెటిస్, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో గుండె జబ్బులకు చరిత్ర ఉండటం కూడా ప్రమాదాన్ని పెంచే ఒక ముఖ్యమైన కారణం. నిద్రలో లోపం, తిన్నతినకుండానే ఒత్తిడికి లోనవడమూ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

గుండెపోటు హెచ్చరికలు

ప్రతీ గుండెపోటు ఒకే రకంగా కనిపించకపోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు మామూలుకన్నా భిన్నంగా అనిపిస్తే అలసత్వం వహించకూడదు

ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, ఒత్తిడి లేదా గుండె పట్టినట్టు ఉండటం

నొప్పి భుజానికి, చేతికి, మెడకు, దవడకు లేదా వెనుకకు వ్యాపించడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్ర అలసట

ఏసీ గదిలో ఉన్నా చెమట పట్టడం

వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం

తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం

గుండె వేగంగా బారబార కొట్టుకోవడం

ఈ లక్షణాలు అనూహ్యంగా వస్తే, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే వెంటనే అత్యవసర వైద్య సాయం తీసుకోవాలి. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. తొందరగా చికిత్స తీసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చు.

తగిన జీవనశైలి మార్పులు, ఆరోగ్యంపై అప్రమత్తత, క్రమం తప్పని వైద్య పరీక్షల ద్వారా చిన్న వయసులోనే గుండె జబ్బులను నిరోధించవచ్చు.

Next Story