- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెటూరి అమ్మాయి.. అస్సాం నుంచి ఆస్కార్ వరకు.!
ఒక హ్యాండ్ కెమెరాతో సినిమాలు తీసి ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్లింది

దిశ, ఫీచర్స్: సాధించాలనే తపన ఉంటే ఎలాంటి కోచింగ్.. ట్రెయినింగ్ అవసరం లేకున్నా పనిలో శోధన మొదలుపెట్టొచ్చు. అంతిమంగా విజయమూ సాధించొచ్చు. అస్సాంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన రిమా దాస్.. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకోలేదు.. వేరేవాళ్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవమూ లేదు. కానీ ఒక హ్యాండ్ కెమెరాతో సినిమాలు తీసి ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్లింది.
నటన నుంచి డైరెక్షన్..
రిమాదాస్‌ది ఒక సాధారణ కుటుంబం. దర్శకత్వం చేయాలనేది తన డైరీలోనే లేని అంశం. వాళ్ల నాయిన ఒక టీచర్. అమ్మ ప్రింటింగ్ ప్రెస్.. పుస్తకాల దుకాణం నడిపేది. చిన్నప్పటి నుంచి ప్రకృతి.. సంగీతం అంటే ఇష్టం ఉండటం వల్ల నాట్యం.. నటన పట్ల ఆసక్తి ఉండేది. కానీ తల్లిదండ్రులు తనను ప్రొఫెసర్‌గా చూడాలి అనుకున్నారు. కాలేజీ రోజుల్లో కొన్ని స్టేజీ షోలు ఇచ్చేది. అక్కడి నుంచే కళా ప్రస్థానం స్టార్టయ్యింది. సినిమాలు చూస్తూ మేకింగ్ నేర్చుకుంది. నటనలో ఉన్నప్పటికంటే ఎక్కువ సినిమాలు తీసేటప్పుడే ఎక్కువ శ్రద్ధ ఏర్పడి పూర్తిగా మేకింగ్ వైపు దృష్టి మళ్లింది.
అస్సాం కథ ఎందుకు చెప్పొద్దు..
అసిస్టెంట్‌గా చేసిన అనుభవం లేదు. మిగతా దర్శకుల మాదిరిగా పెద్ద పెద్ద నిపుణుల దగ్గర శిక్షణా పొందలేదు. చాలా సింపుల్. తన దగ్గరొక హ్యాండ్ కెమెరా ఉండేది. ఆ కెమెరా చేతబట్టుకొని.. ఏ ఇతర లైటింగ్ సాధనాలూ అవసరం లేకుండా సూర్యకాంతితోనే సినిమా తీసి ప్రపంచానికి అస్సాం సత్తా ఏంటో చూపించింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆస్కార్ ఎంట్రీ సాధించింది. ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్లిన మొదటి అస్సామీ సినిమా ఇదే. పంజాబీ దర్శకుడు పంజాబ్ కథ చెప్తాడు. గుజరాతీ దర్శకుడు గుజరాత్ కథ చెప్తాడు. ఒక అస్సామీ డైరెక్టర్‌గా తానెందుకు అస్సాం కథ ఎందుకు చెప్పకూడదు అనేది తన పాయింట్.
మనమే చెప్పుకోవాలి..
వాళ్లు కథ చెప్తున్నారు. వీళ్లు సినిమా తీస్తున్నారని రిమాదాస్ ఎప్పుడు కూడా ఎవరికీ ఫిర్యాదుచేసినట్లు మాట్లాడలేదు. వాళ్లు అలా.. వీళ్లు ఇలా అని ఫిర్యాదు చేయడం కంటే తానే కొంత స్పేస్ క్రియేట్ చేసుకొని అస్సాం కథను అందరిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రయత్నమైతే చేద్దాం.. ఫలితం తర్వాత అనేది తన భావన. ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా ఆశించలేదు. సహాయం చేయొచ్చు.. చేయకపోవచ్చు. కానీ మన కథలు చెప్పాల్సింది.. ప్రపంచానికి చాటాల్సింది ఒక డైరెక్టర్‌గా మన బాధ్యతే కదా అని అడుగు ముందుకేసింది. అనుకున్నది సాధించింది.
సామాజిక కోణం..
విజయం వచ్చింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ అవార్డు సైతం పొందింది. అయినా కానీ.. రిమా దాస్‌కి సినిమాలపై ఆకలి తీరలేదు. కెరీర్ తొలినాళ్లలో ఉన్న ఆరాటం.. తపన తనను కొత్త కోణంలో సినిమాలు తీసేలా ప్రేరేపిస్తున్నాయి. ఏదో సినిమాలు తీశామా.. జనాల్లోకి వదిలామా అన్నట్లు కాకుండా.. అవి సామాజికంగా ఎంత ప్రభావం చూపించాయి అనే కోణంలోనే తను ఆలోచిస్తుంది. ఒక గ్రామంలో ఆరుబయట వాకిళ్లలో ఆడుకున్న అమ్మాయి.. ఇప్పుడు భారత సినిమా చరిత్రలో తన పేరు చిరస్థాయిగా రాసుకునే స్థాయికి ఎదిగిందంటే ఆమె సంకల్పమెంత బలమైందో అర్థం చేసుకోవచ్చు.






